'లిటిల్ హార్ట్స్' డైరెక్టర్ బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్.. అతని తాతయ్య దిగ్గజ దర్శకుడు!
on Sep 8, 2025

పలు పెద్ద సినిమాలను సైతం ప్రేక్షకులు థియేటర్ కి వెళ్ళి చూడటానికి ఆసక్తి చూపించట్లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి సమయంలో ఓ చిన్న సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. అదే 'లిటిల్ హార్ట్స్'. (Little Hearts)
ఈ సెప్టెంబర్ 5న 'ఘాటి', 'మదరాసి' వంటి పెద్ద సినిమాలతో పాటు.. థియేటర్లలో అడుగుపెట్టింది 'లిటిల్ హార్ట్స్'. పెద్దగా అంచనాల్లేకుండా విడుదలైన ఈ సినిమా.. పెద్ద సినిమాలకే షాకిస్తూ భారీ వసూళ్లు రాబడుతోంది. కేవలం మూడు రోజుల్లోనే రూ.12 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి సత్తా చాటింది.
కేవలం మౌత్ టాక్ తోనే 'లిటిల్ హార్ట్స్' మూవీ బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేస్తోంది. సినిమాలో కామెడీ అదిరిపోయిందని, ఈమధ్య కాలంలో ఇలాంటి కామెడీ ఫిల్మ్ రాలేదని.. చూసిన ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. ముఖ్యంగా చిత్ర రచయిత, దర్శకుడు సాయి మార్తాండ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. (Sai Marthand)

అదే సమయంలో అసలు ఈ సాయి మార్తాండ్ ఎవరు? అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇతను ఎవరో కాదు.. ఒకప్పటి దిగ్గజ దర్శకుడు బి.వి.ప్రసాద్ మనవడు. 1965లో విడుదలైన 'శ్రీ సింహాచల క్షేత్ర మహిమ' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన బి.వి.ప్రసాద్.. టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. ఎన్టీఆర్ తో 'మనుషుల్లో దేవుడు', 'ఆరాధన', 'మేలుకొలుపు' వంటి సినిమాలు చేశారు. అలాగే కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి వంటి హీరోలతో ఆయన పని చేశారు. రెండు దశాబ్దాల సినీ ప్రయాణంలో బి.వి.ప్రసాద్ దాదాపు 20 చిత్రాలు తెరకెక్కించారు. ఆయన దర్శకత్వం వహించిన 'మట్టిలో మాణిక్యం' సినిమాకి నేషనల్ అవార్డు కూడా రావడం విశేషం.
తాతయ్య బి.వి.ప్రసాద్ బాటలో పయనిస్తూ.. ఇప్పుడు మనవడు సాయి మార్తాండ్ మెగా ఫోన్ పట్టాడు. అంతేకాదు, దర్శకుడిగా మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. సాయి మార్తాండ్ భవిష్యత్ లో మరిన్ని విజయాలను అందుకోవాలని ఆశిద్దాం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



