ధోని 'ఎల్‌జీఎం' వచ్చేస్తోంది.. కాబోయే అత్తగారికి కండీషన్స్ పెట్టిన కోడలు కథ!
on Aug 1, 2023

కొత్తగా పెళ్లి చేసుకోవాలనుకునే అబ్బాయి, అమ్మాయిలకు మనసులో తెలియని భయాలు ఎన్నో ఉంటాయి. అలాంటి ఆసక్తికర కథాంశంతో ఓ చిత్రం వస్తోంది. ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి కాబోయే అత్తగారి గురించి భయపడుతుంది. అందుకోసం ఆమెతో కలిసి కొన్నిరోజుల పాటు ట్రావెల్ చేయాలనుకుంటుంది. అందుకు ఒప్పుకున్న అత్తా కోడళ్ల మధ్య ఉండే కండీషన్స్ ఏంటి? చివరకు వారిద్దరూ మనస్తత్వాలు కలిశాయా? అనే వైవిధ్యమైన పాయింట్‌తో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'ఎల్‌జీఎం' (LGM - Lets Get Married). ఆగస్ట్ 4న ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో జె.పి.ఆర్.ఫిల్మ్స్, త్రిపుర ప్రొడక్షన్స్ బ్యానర్స్ విడుదల చేస్తున్నాయి.
ఇండియన్ లెజెండ్రీ క్రికెటర్ ఎం.ఎస్.ధోని 'ఎల్‌జీఎం'తో చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. రమేష్ తమిళ్ మణి దర్శకత్వంలో ఈ సినిమాను ధోని ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లిమిటెడ్ బ్యానర్‌పై సాక్షి ధోని, వికాస్ హస్జా నిర్మించారు. ఈ సినిమాలో హరీష్ కళ్యాణ్, ఇవానా, నదియా ప్రధాన పాత్రలు పోషించారు. పెళ్లికి ముందే కాబోయే అత్తగారికి కండీషన్స్ పెట్టిన గడసరి కోడలుగా ఇవానా కనిపిస్తుంది. 'లవ్ టుడే' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు ఇవానా దగ్గరైన సంగతి తెలిసిందే. ఇక కొడుకు ప్రేమ కోసం కోడలు పెట్టిన కండీషన్స్ కు ఒప్పుకుని ఆమెతో ట్రావెల్ చేసే తల్లి పాత్రలో నదియా నటించారు. ఇక ఇటు కాబోయే భార్య, అటు ప్రేమగా పెంచిన తల్లి మధ్య భావోద్వేగాలతో నలిగిపోతూ ఇబ్బంది పడే అబ్బాయిగా హరీష్ కళ్యాణ్ నటించారు. ఇక సినిమాలో యోగిబాబు తనదైన కామెడీతో నవ్వించనున్నారు. ఆగస్ట్ 4న ఈ చిత్రం భారీస్థాయిలో రిలీజ్ అవుతుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



