ఆమె శరీరాన్నే కాదు.. సర్వస్వాన్ని ప్రేమిస్తున్నా!
on Nov 2, 2017
పాతికేళ్లకు పైగా కాపురం అంటే మామూలు ఇళ్లల్లో పెద్ద విశేషం ఏం కాదు కానీ... సినిమా పరిశ్రమలో మాత్రం అది పెద్ద విశేషమే. సినిమా సెలబ్రిటీల కాపురాలు పట్టుపని పదేళ్లు కూడా సాగకుండా పెటాకులవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. ఇక బాలీవుడ్ అయితే.. చెప్పేదేముంది? అక్కడ పెళ్లి అనేది పెద్ద విషయమే కాదు. అయితే... షారుక్ ఖాన్ ని మాత్రం ఈ విషయంలో మినహాయించాల్సిందే. తాను పెళ్లి చేసుకొని 26 ఏళ్లయ్యింది. ఈ సుదీర్ఘ కాలంలో వాళ్లిద్దరి మధ్య ఒక్కటంటే ఒక్క గొడవ కూడా జరగలేదంటే నమ్ముతారా? సాధారణంగా భార్యాభర్తల మధ్య జరిగే చిలిపి తగాదాలు.. అలకలూ, అల్లర్లు అవి మామూలుగానే ఉంటాయ్. కానీ.. లోకులకు తెలిసేంత పెద్ద తగాదాలు మాత్రం ఈ కుటుంబం ఎరుగదు. అంత పద్ధతిగా తన సంసార జీవితాన్ని నెట్టుకొస్తున్నాడు కింగ్ ఖాన్.
‘కింగ్ ఆఫ్ బాలీవుడ్: షారుక్ ఖాన్ అండ్ ది సెడెక్టివ్ వరల్డ్ ఆఫ్ ఇండియన్ సినిమా' పేరుతో అనుపమ చోప్రా రాసిన పుస్తకంలో షారుక్ దంపతులకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పొందుపరిచారు. ’గౌరీ నా ఆస్తి. ఆమె లేకపోతే నేను బతకలేను. నేను ఆమె శరీరాన్ని మాత్రమే కాదు. మనసును సర్వాన్ని ప్రేమిస్తున్నాను. గౌరీ కోసం సర్వస్వాన్ని కూడా వదులుకోడానికి నేను సిద్ధం’ అని ఓ సందర్భంలో అనుపమ చోప్రాతో షారక్ అన్న మాటలను ఈ పుస్తకంలో పొందుపరిచడం విశేషం. అంత పెద్ద సూపర్ స్టార్.. భార్య మీద ఇంత ప్రేమ చూపించడం నిజంగా గ్రేట్ కదా. ఏమంటారు?