ENGLISH | TELUGU  

రివ్యూ : కాట‌మ‌రాయుడు

on Mar 24, 2017


ప‌వ‌న్ క‌ల్యాణ్‌... టాలీవుడ్‌లో నెంబ‌ర్ వ‌న్ స్థానానికి గట్టి పోటీ ఇచ్చిన‌, ఇస్తున్న క‌థానాయ‌కుడు. ప‌వ‌న్ సినిమా హిట్ట‌యితే ఆ ప్ర‌భంజ‌నం ఏ స్థాయిలో ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లెద్దు. ఓ యావ‌రేజ్ సినిమా ఇస్తేనే కోట్లు కొల్ల‌గొట్టేయ‌డం ఖాయం. అలాంటిది ప‌వ‌న్ సినిమా హిట్ట‌యితే.. ఆ స్థాయి ఊహించ‌లేం. అందుకే ప‌వ‌న్ నుంచి సినిమా వస్తోందంటే అంచ‌నాలు పెరిగిపోతాయి. ఈసారి మా ప‌వ‌న్ ఏం మ్యాజిక్ చేస్తాడా అంటూ అభిమానులు ఆవురావుర‌మంటూ ఎదురుచూస్తారు. ప‌వ‌న్ ధాటికి పాత రికార్డులు ఎన్ని బ‌ద్ద‌ల‌వుతాయా??  అంటూ ట్రేడ్ వ‌ర్గాలు ఆశ‌ప‌డుతుంటాయి. 'స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్‌'తో ప్రేక్ష‌కులు, అభిమాన‌లు, ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు దారుణంగా నిరాశ ప‌డ్డాయి. వాళ్ల బాకీ తీర్చేయాల్సిన త‌రుణం ప‌వ‌న్ కి వ‌చ్చింది. మ‌రి 'కాట‌మ‌రాయుడు' బాకీ తీర్చాడా?  లేదంటే అప్పుల భారం మ‌రింత మోపాడా??  ప‌వ‌న్‌కి అచ్చొచ్చిన రీమేక్ ఫార్ములా ఈసారి వ‌ర్క‌వుట్ అయ్యిందా, లేదా??  చూద్దాం... రండి. 

* క‌థ‌

ఆ ఊరికి పెద్ద‌... కాట‌మ‌రాయుడు (ప‌వ‌న్ క‌ల్యాణ్‌). రాబిన్ వుడ్ త‌ర‌హా క్యారెక్ట‌రైజేష‌న్‌. ఉన్నోడిని కొట్టు.... లేనోడికి పెట్టు అనే సిద్దాంతం త‌న‌ది. త‌మ్మ‌ళ్లంటే పంచ ప్రాణాలు. వాళ్ల‌పై ఈగ వాలినా క్ష‌మించ‌డు. వాళ్ల‌కీ అంతే. అన్న‌య్యే అన్నీ. కాట‌మ‌రాయుడుకి అమ్మాయిలంటే అస్స‌లు ప‌డ‌దు. ప్రేమా... గీమా జాన్తానై. అమ్మాయిల‌కంటే డేంజ‌ర్ ఈ ప్ర‌పంచంలో ఇంకెక్క‌డా ఉండ‌ద‌న్న అభిప్రాయం త‌న‌ది. త‌మ్ముళ్లూ అంతే!  కాక‌పోతే.. వ‌య‌సొచ్చిన త‌మ్ముళ్లు న‌చ్చిన వాళ్ల‌కు మ‌న‌సిచ్చేస్తారు. అన్న‌య్య‌తో అదెలా చెప్పాలో తెలీదు. అన్న‌య్య‌ని ప్రేమ‌లో దింపితే.. ఆ త‌ర‌వాత త‌మ ప‌ని సులువ‌వుతుంద‌న్న న‌మ్మ‌కం క‌లుగుతుంది. అందుకోసం వాళ్లేం చేశారు??   కాట‌మ‌రాయుడు జీవితంలోకి ప్ర‌వేశించిన అమ్మాయి (శ్రుతిహాస‌న్) ఎవ‌రు???  వీళ్ల క‌థ ఎన్ని మ‌లుపులు తిరిగింది??  ఇవ‌న్నీ కాట‌మ‌రాయుడు చూసి తెలుసుకోవాల్సిందే. 

* విశ్లేష‌ణ‌

త‌మిళ వీర‌మ్‌కి మ‌న‌దైన మార్పులేం పెద్ద‌గా చేయ‌లేదు ద‌ర్శ‌కుడు. కాక‌పోతే... ప‌వ‌న్‌పై ప్రేమ‌తోనో, ప‌వ‌న్ అభిమానుల్ని ల‌క్ష్యం చేసుకోనో... ఆ క్యారెక్ట‌ర్‌ని ఇంకాస్త బాగా ఎలివేట్ చేయాలనో క‌థానాయ‌కుడి వ‌ర‌కూ కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకొన్నాడు. ప‌వ‌న్ నుంచి ఆశించే వినోదం గ‌త సినిమాల్లో మిస్ అయ్యింది. దాన్ని క‌వ‌ర్ చేయ‌డానికి ద‌ర్శ‌కుడు క‌ష్ట‌ప‌డ్డాడు. ప‌వ‌న్ పాత్ర చుట్టూ అల్లుకొన్న వినోదం ఆయ‌న ఫ్యాన్స్‌కి న‌చ్చుతుంది. శ్రుతి హాస‌న్‌ని ప్రేమ‌లోకి దింప‌డానికి ప్ర‌య‌త్నించే స‌న్నివేశాలు ఫ్యాన్స్ కోసం స్పెష‌ల్‌గా తీర్చిదిద్దిన‌ట్టు అనిపిస్తుంది. ప‌వ‌న్ ఇంట్ర‌డ‌క్ష‌న్‌, ఆ వెంట‌నే వ‌చ్చే పాట‌... ఇవ‌న్నీ మాస్‌కి న‌చ్చేవే. ప్ర‌ధ‌మార్థంలో `అదిరిపోయాయి` అనే మూమెంట్స్ ఏం ఉండ‌వు గానీ... సాఫీగానే సాగిపోతోంది.  ద్వితీయార్థంలో యాక్ష‌న్ కి ఎక్కువ చోటిచ్చారు. ఎమోష‌న్స్ కూడా క్యారీ అయ్యాయి. అయితే ఏ సన్నివేశం బ‌లంగా ఇంపాక్ట్ ఇవ్వ‌దు. అన్నీ పైపైనే ట‌చ్ చేసుకొంటూ వెళ్లిపోయారు. సినిమాలో డ‌ల్ మూమెంట్స్ కూడా చాలానే క‌నిపించాయి. `ఫిల్` చేయాల‌న్న ఉద్దేశంతో సీన్లు రాసుకొంటే ఇలానే ఉంటుంది. ఫైట్స్ పై పెట్టిన శ్ర‌ద్ద కాస్త‌... ఎమోష‌న్‌లోనూ పెట్టుంటే బాగుండేది. సెకండాఫ్ మొద‌లైన 20 నిమిషాల వ‌ర‌కూ... క‌థ‌లో ఎలాంటి మ‌లుపులూ, ఆస‌క్తిక‌ర‌మైన అంశాలూ ఉండ‌వు. 


అస‌లు ఇలాంటి క‌థ‌లు తెలుగు చిత్ర‌సీమ‌లో కోకొల్ల‌లుగా వ‌చ్చాయి. ఆ మాత్రం దానికి వీర‌మ్‌పై ఎందుకు ఆధార‌ప‌డ్డారో, ఆ సినిమాని ఎందుకు రీమేక్ చేయాల‌నిపించిందో అర్థం కాదు. దానికి త‌గ్గ‌ట్టు ప్రొడ‌క్ష‌న్ వాల్యూస్ దారుణంగా ఉన్నాయి. ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమా అంటే.. మేకింగ్ ఏ రేంజులో ఉండాలి? అదేం క‌నిపించ‌దు. పాట‌లు చుట్టేశారు. సీజీ వ‌ర్క్ తో ముడిప‌డ్డ స‌న్నివేశాలు తేలిపోయాయి. ఫైట్స్ కోస‌మే కాస్త ఖ‌ర్చు పెట్టారు.. కాస్త క‌ష్ట‌ప‌డ్డారు. `వీరం` స్క్రీన్ ప్లే కూడా ఇంతే నీర‌సంగా ఉంటుంది.కాక‌పోతే.. దాన్ని మార్చుకొనే ఛాన్స్ ఇక్క‌డుంది. డాలీ ఆ విష‌యాన్ని ప‌ట్టించుకోలేదు. ప్ర‌తీ సీన్ ప‌వ‌న్ క‌ల్యాణ్ మానియాపైనే బేస్ అయి న‌డిచిందంటే... వీర‌మ్ క‌థ‌పై ద‌ర్శ‌కుడు ఎంత ఆధార‌ప‌డ్డాడో అర్థం చేసుకోవొచ్చు. 

* న‌టీన‌టుల ప్ర‌తిభ‌

ప‌వ‌న్ వ‌న్ మాన్‌షో చాలా సినిమాల్లోచూశాం. అలా చెప్పుకొనే సినిమాల్లో ఇదీ ఒక‌టిగా ఉంటుంది. అలాగ‌ని ప‌వ‌న్ త‌న అల్టిమేట్ ప‌వ‌ర్ అంతా ఈ సినిమాకి వాడేశాడ‌ని చెప్ప‌లేం. అత‌ని టాలెంట్‌లో 50 శాతం మాత్ర‌మే తెర‌పై క‌నిపిస్తుంది. అది చాల్లే.. అని ఫ్యాన్స్ సంబ‌ర ప‌డిపోతే చేసేదేం ఉండ‌దు. ప‌వ‌న్ త‌ర‌హా హాస్యం.. అత‌ని మేన‌రిజాలే ఈసినిమాకి అతి పెద్ద ప్ల‌స్‌. పాట‌ల్లో ప‌వ‌న్ ఒళ్లు వంచాలి. అదేదో మొక్క‌బ‌డి వ్య‌వ‌హారంలా అనుకొంటే.. క‌ష్ట‌మే.  శ్రుతి హాస‌న్ కొన్ని చోట్ల చాలా అందంగా, ఇంకొన్ని చోట్ల పీక్కుపోయిన‌ట్టు క‌నిపించింది. అయితే ప‌వ‌న్‌తో త‌న కెమిస్ట్రీ ఈసారీ బాగా కుదిరింది. నాజ‌ర్ పాత్ర హుందాగా సాగింది. రావు ర‌మేష్ రాయ‌ల‌సీమ మాండ‌లికంలో చెప్పిన డైలాగులు ఆక‌ట్టుకొంటాయి. విల‌న్ గ్యాంగ్ పెద్ద‌దే ఉన్నా... స‌రిగా వాడుకోలేదు. అలీ, ఫృథ్వీ కామెడీ కొంత వ‌ర‌కూ వ‌ర్క‌వుట్ అయ్యింది. త‌మ్ముళ్లంతా పాత్ర ప‌రిధి మేర న‌టించారు.


* సాంకేతిక వ‌ర్గం

అనూప్ లాంటి న‌వ‌త‌రం సంగీత ద‌ర్శ‌కులు ప‌వ‌న్ కల్యాణ్ లాంటి స్టార్ సినిమాకి ప‌నిచేసే అవ‌కాశం వ‌స్తే రెచ్చిపోవాలి. కానీ అదేం జ‌ర‌గ‌లేదు. మిరా మిరా మీసం.. పాట త‌ప్ప మిగిలిన‌వేవీ పెద్ద‌గా ఆక‌ట్టుకోవు. వాటిని తెర‌పై తీర్చిదిద్దిన ప‌ద్ధ‌తి కూడా అంతంత మాత్ర‌మే. దాంతో.. పాట‌లు నిరుత్సాహ‌ప‌రిచాయి. ప్ర‌సాద్ మూరెళ్ల కెమెరా ఓకే అనిపిస్తుంది. అయితే అత్తారింటికి దారేదిలాంటి రిచ్‌నెస్ ఎక్క‌డా క‌నిపించ‌దు. ద‌ర్శ‌కుడు వీర‌మ్‌లో మార్పులూ చేర్పులూ చేయ‌లేదు. కేవ‌లం ప‌వ‌న్ క‌ల్యాణ్ క్యారెక్ట‌ర్‌పై ఫోక‌స్‌పెట్టాడు. అంత‌కు మించి చేసిందేం లేదు.


* ఫైన‌ల్ ట‌చ్ :  కాట‌మ‌రాయుడు... వీడు ఫ్యాన్స్ కోస‌మే పుట్టాడు


* రేటింగ్‌: 2.75

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.