ENGLISH | TELUGU  

కార్తికేయ‌ మూవీ రివ్యూ

on Oct 24, 2014

Karthikeya movie review, karthikeya review,  karthikeya telugu movie review, karthikeya rating, Karthikeya talk

 

ఓ హ‌త్య జ‌రిగిపోయింది.. ఒక్క క్లూ కూడా లేదండీ.. అన్నామ‌నుకోండి. ఆస‌క్తి ర‌గులుతుంది. క్లూ లేకుండా హంత‌కుడిని ఎలా ప‌ట్టుకొంటారు అన్న స‌స్పెన్స్ మొద‌ల‌వుతుంది. చాంతాడంత ఇన్వెస్టిగేష‌న్ జ‌రిగిన త‌ర‌వాత‌ అది హ‌త్య‌కాదండీ.. యాక్సెడెంట్ అని చెప్పామ‌నుకోండి..! చిర్రెత్తుకుపోదూ..!

థ్రిల్ల‌ర్ సినిమాల ముఖ్య ల‌క్ష‌ణం చిక్కుముడులు వేసుకొంటూ వెళ్లి.. మ‌ళ్లీ విప్ప‌డం. ఇక్క‌డ చిక్కుముడ‌లు వేయ‌డం గొప్ప కాదు. దాన్ని విప్పే విధానంలోనే ద‌ర్శ‌కుడి తెలివితేట‌లు ఆధార‌ప‌డి ఉంటాయి.

ప్ర‌శ్న‌లు గొప్ప‌వా? స‌మాధానాలు గొప్ప‌వా??  అని అడిగితే కొంత‌మంది ప్ర‌శ్న‌లే గొప్ప‌వంటారు. ఎందుకంటే ప్ర‌శ్న పుడితే.. స‌మాధానం కోసం అన్వేష‌ణ మొద‌ల‌వుతుంది. ఆ అన్వేషణ‌లో నిజాలు తెలుస్తుంటాయి. కానీ థ్రిల్ల‌ర్ సినిమాల విష‌యానికొస్తే.. ఈ సూత్రం రివ‌ర్స్ చేయాలి.

థ్రిల్ల‌ర్ చిత్రాల్లో ప్ర‌శ్న‌లు కావు... వాటి కోసం అన్వేషించే స‌మాధానాలు గొప్ప‌గా ఉండాలి. కానీ కార్తికేయ‌లో అదేం జ‌ర‌గ‌లేదు. ఇందులో ప్ర‌శ్న‌లు గొప్ప‌గా ఉన్నాయి. అన్నీ ఉత్కంఠ‌త‌ను రేక్కెత్తించేవే. అయితే స‌మాధానాల అన్వేష‌ణ చ‌ప్ప‌గా సాగింది. దాంతో థ్రిల్ల‌ర్ సినిమా కాస్త‌.. ప‌ట్టు స‌డ‌లిపోయింది.

ఇంత‌కీ కార్తికేయ క‌థేంటంటే..
సుబ్ర‌హ్మ‌ణ్య‌పురంలోని సుబ్ర‌హ్మ‌ణ్యేశ్వ‌ర‌ దేవాల‌యం చాలా విశిష్ట‌మైన‌ది. ప్ర‌తీ కార్తీక పౌర్ణ‌మి నాడు... ఆ దేవాల‌యం వెలిగిపోతుంటుంది. అయితే అనుకోకుండా ఆ గుళ్లో విప‌త్క‌ర ప‌రిస్థితులు ఎదుర‌వుతుంటాయి. ఆల‌య ధ‌ర్మ‌క‌ర్త‌, పుజారీ పాముకాటుకి చ‌నిపోతుంటారు. దాంతో ఊర్లో పెద్ద‌మ‌నుషులు ఆ ఆల‌యాన్ని మూసేస్తారు. ఆ గుడి ర‌హ‌స్యాల‌ను ఛేధించ‌డానికి ప్ర‌య‌త్నించిన ఓ ఉద్యోగి, పోలీస్ అధికారి కూడా మ‌ర‌ణిస్తారు. అదే ఊర్లో మెడిక‌ల్ క్యాంప్ నిమిత్తం అడుగుపెడ‌తాడు కార్తీక్ (నిఖిల్‌).  ప్ర‌శ్న‌ని ప్ర‌శ్న‌లా వ‌దిలేయ‌డం కంటే, ప్రాణాలు వ‌దిలేయ‌డ‌మే బెట‌ర్ అనుకొనే మ‌న‌స్త‌త్వం త‌న‌ది.  త‌న‌ కాలేజీలో చ‌దివే వ‌ల్లీ (స్వాతి)ని చూసి ఇష్ట‌ప‌డ‌తాడు. అదేంటో.. వ‌ల్లీని చూసిన మ‌రుక్ష‌ణం నుంచి త‌న‌క‌న్నీ శుభాలే జ‌రుగుతుంటాయి. దాంతో సెంటిమెంట్‌గా కూడా వ‌ల్లీకి ఫిక్స‌యిపోతాడు.  ఊర్లో అడుగుపెట్టిన త‌ర‌వాత ఆ గుడి గురించి తెలుసుకొనే ప్ర‌య‌త్నాలు మొద‌లెడ‌తాడు కార్తీక్‌. అప్ప‌టి నుంచీ కార్తీక్‌ని  ఓ పాము కార్తీక్‌ని వెంబడిస్తుంటుంది. ఇంత‌కీ ఆ గుడిలో ఏం జ‌రుగుతోంది. జ‌రుగుతున్న హ‌త్య‌ల‌కు కార‌ణం ఎవ‌రు? ఈ ప్ర‌శ్న‌ల‌కు కార్తీక్ ఎలాంటి స‌మాధానాలు రాబ‌ట్టాడు అనేదే ఈ కార్తికేయ సినిమా.

ద‌ర్శ‌కుడు చందూ మొండేటికి ఇదే తొలి సినిమా. తొలి ప్ర‌య‌త్నం ఓ థ్రిల్ల‌ర్ చిత్రంతో చేయాల‌నుకోవ‌డం, అదీ ఇలాంటి స‌బ్జెక్ట్‌ని వెతుక్కోవ‌డం సాహ‌స‌మే. అయితే త‌న క‌ర్త‌వ్వ నిర్వ‌హ‌ణ‌లో స‌గమే విజ‌యం సాధించాడు. గుడిలో ఏం జ‌రుగుతుంది?  పాము కార్తీక్‌ని ఎందుకు ప‌గ‌బ‌ట్టింది?  ఆ గుడిని ఎందుకు మూసేశారు..?  ఇలాంటి ప్ర‌శ్న‌లు ప్రేక్ష‌కుల్ని వేధిస్తుంటాయి. ఏదో ఉంది, ఏదో ఉంది.. అనే ఉత్కంఠ‌త‌ను రేకెత్తించేవ‌ర‌కూ ద‌ర్శ‌కుడు స‌ఫ‌ల‌మ‌య్యాడు. ప్రేక్ష‌కుడికి ఒక ద‌శ‌లో ఈ సినిమాపై చంద్ర‌ముఖి స్థాయి ప్రేమ క‌లుగుతుంది. కానీ... వేసిన చిక్కుముడుల‌ను విప్పే ప్ర‌య‌త్నంలో ద‌ర్శ‌కుడి అనుభ‌వ రాహిత్యం బ‌య‌ట ప‌డింది. థ్రిల్ల‌ర్ సినిమాల ప్ర‌ధాన నియ‌మం.. వేసిన చిక్కుముడుల‌ను ప‌క‌డ్బందీగా విప్ప‌డం. అలా జ‌రిగితే.. కార్తికేయ ఓ స్థాయిలో ఉండేది. కానీ ద‌ర్శ‌కుడు తుస్స్ మ‌నిపించాడు. ఈసినిమాకి ప్రాణ‌మైన క్లైమాక్స్‌ని ఉత్తినే తేల్చేశాడు. దాంతో ఈ సినిమాపై పెంచుకొన్న నమ్మ‌కం, సినిమా గ్రాఫ్ ట‌ప్పున ప‌డిపోతాయి. సిక్స‌ర్ కొట్టి, సెంచ‌రీ చేస్తాడ‌నుకొన్న బ్యాట్స్‌మెన్ బంతిని ఎదుర్కోకుండానే వికెట్ల‌ను కొట్టుకొని వెళ్లిపోతే ఎలా ఉంటుందో, ఈ సినిమాలో క్లైమాక్స్ అలా ఉంటుంది.

స‌స్పెన్స్‌, థ్రిల్ల‌ర్‌ల ఫ‌క్తు సూత్రం ఒక‌టుంది. సినిమా ఆద్యంతం ఒక‌డిపై అనుమానాన్ని క‌లుగ చేస్తారు. ప్రేక్ష‌కుడి క‌ళ్ల‌న్నీ ఒక‌రిపై ఫోక‌స్ చేయిస్తారు. చివ‌రికి అంత‌టికీ కార‌ణం వాడు కాదు, ఇంకొక‌డు అని చూపిస్తారు. దాంతో ప్రేక్ష‌కుడు త‌త్త‌ర‌ప‌డిపోయి, మంత్ర‌ముగ్థుడైపోతాడు. ఇప్ప‌టి వ‌ర‌కూ విజ‌య‌వంత‌మైన ఏ థ్రిల్ల‌ర్ సినిమాలు చూసుకొన్నా ఇదే నియమం క‌నిపిస్తుంది. కానీ కార్తికేయ సినిమా ఇక్క‌డే ప‌ట్టు త‌ప్పింది. సినిమా మొద‌లైన కాసేప‌టికే ఓ పాత్ర ఓవ‌రాక్ష‌న్‌పై ప్రేక్ష‌కుల క‌న్ను ప‌డుతుంది. ''వాడి ప్ర‌మేయం ఏమైనా ఉందా?''  అనే అనుమానాలు రేకెత్తుతాయి. చివ‌రికి వాడే అస‌లు సూత్ర‌ధారి అనేస‌రికి - ప్రేక్ష‌కుడు కూడా నిరాశ చెందుతాడు. ఓస్ ఇంతేనా, ఇంకేదో అనుకొన్నానే అన్న అసంతృప్తితో ప్రేక్ష‌కులు బ‌య‌ట‌కు వ‌స్తారు. స్నేక్ హిప్న‌టైజ్‌, వ‌జ్రం అనే విష‌యాలు క‌థ‌లోకి ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చాయో.. ఈ సినిమా గ్రాఫ్ అక్క‌డే అమాంతం కుప్ప కూలింది. క్లైమాక్స్ తూతూ మంత్రంగా తేల్చేయ‌డంతో అప్ప‌టి వ‌ర‌కూ జాగ్ర‌త్త‌గా క‌ట్టుకొచ్చిన మేడ పునాదులు లాగేసిన‌ట్టైంది.

రెండు గంట‌ల సినిమా ఇది. నిజానికి ర‌న్ టైమ్ త‌క్కువ‌. కానీ థ్రిల్ల‌ర్ సినిమాల‌కు ఇంత కూడా ఉండ‌కూడ‌దు. నిఖిల్ - స్వాతి లవ్ ట్రాక్ వ‌ల్ల ఈ క‌థ‌కు ఎలాంటి ఉప‌యోగం లేదు. ఆ స‌న్నివేశాల్ని ట్రిమ్ చేసుకొంటే బాగుండేది. ఇలాంటి సినిమాల నిడివి గంట‌న్న‌ర ఉన్నా.. పెద్ద న‌ష్ట‌మేం ఉండ‌దు. సినిమా ఫాస్ట్‌గా సాగుతున్న ఫీలింగ్ క‌ల‌గాలంటే, నిడివి విష‌యంలో ద‌ర్శ‌క నిర్మాత‌లు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సిందే. ఫ‌స్టాఫ్ ఓకే అనిపిస్తుంది. అయితే అందులోనూ లాగ్స్ ఉన్నాయి. సెకండాఫ్ ప్రారంభం, న‌డ‌త బాగానే ఉంటాయి. ఎప్పుడైతే స్నేక్ హిప్న‌టిజం అన్న‌ది తెలిసిందో.. అప్ప‌టి నుంచీ ఈ సినిమాపై ఆస‌క్తి త‌గ్గిపోతుంది.

చిన్న సినిమా అయినా స‌రే, నీట్‌గా తీశారు. కెమెరా ప‌నిత‌నం, ఆర్‌.ఆర్ బాగున్నాయి. ద‌ర్శ‌కుడు రాసుకొన్న సంభాష‌ణ‌లు ఆలోచింప‌చేస్తాయి. గుండ్రంగా తిరిగే భూమికి వాస్తేంటి? ఇది ఆగ్నేయం, అది నైరుతి అని ఎలా నిర్ణ‌యిస్తారు? ప్ర‌శ్న‌ని ప్ర‌శ్న‌గా వ‌దిలేయ‌డం కంటే, ప్రాణాలు వ‌దిలేయ‌డం బెట‌ర్‌.. ఇలాంటి సంభాష‌ణ‌లు బాగున్నాయి. నిఖిల్ ఓవ‌రాక్ష‌న్ చేయకుండా బాలెన్స్ గా న‌టించాడు. కాక‌పోతే ల‌వ‌ర్‌బోయ్ సీన్స్ అత‌నికి సూట్ కావు. స్వాతిది ప్రాధాన్యం లేని పాత్ర‌. స్వ‌త‌హాగా ఇలాంటి పాత్ర‌ల్ని తాను ఒప్పుకోదు. మ‌రెందుకు ఈ క్యారెక్ట‌ర్ అంగీక‌రిందో..?  దానికి తోడు కాస్త ఒళ్లు చేసింది. రావురమేష్‌, భ‌ర‌ణి.. ఇలాంటి వాళ్ల‌ని స‌రిగ్గా ఉప‌యోగించుకోలేదు. కామెడీ ట‌చ్ ఈసినిమాకి స‌రిపోలేదు.

ద‌ర్శ‌కుడు రాసుకొన్న క‌థ‌, క‌థ‌నం కొంత వ‌ర‌కూ ఓకే. కాక‌పోతే క్లైమాక్స్‌లో చేతులెత్తేశాడు. అక్క‌డా కాస్త తెలివిగా సీన్స్ రాసుకొంటే బాగుండేది. ప్రేక్ష‌కుడికి ఎక్క‌డా  క్లూలు ఇవ్వ‌కుండా, చివ‌ర్లోనే అన్నీ రివీల్ చేసుంటే అప్ప‌టి వ‌ర‌కూ ప‌డిన క‌ష్టానికి ఓ అర్థం దొరికేది. కొన్ని సీన్స్‌ని యానిమేష‌న్‌లో చూపించారు. దానికి తోడు వాయిస్ ఓవ‌ర్ ఒక‌టి. దాదాపు 5 నిమిషాల పాటు ఈ ప్ర‌హ‌స‌నం సాగుతుంది. దాన్ని ట్రిమ్ చేసుకొంటే బాగుంటుంది.


కొత్త‌గా ఆలోచించేవాళ్లు ప‌రిశ్ర‌మ‌కు వ‌స్తున్నారు. కాక‌పోతే చిన్న చిన్న త‌ప్పుల‌తో త‌మ ఆలోచ‌న‌ల‌కు పూర్తి న్యాయం చేయ‌లేక‌పోతున్నారు. ఆ చిన్ని త‌ప్పులే.. భారీ మూల్యం చెల్లించుకొనేలా చేస్తున్నాయి. కార్తికేయ విష‌యంలో అదే రుజువైంది. మంచి ఎఫెక్ట్ పెట్టినా.. ఆ ప్ర‌య‌త్నం బూడిద‌లో పోసిన ప‌న్నీరైంది.

పంచ్ లైన్
: కొండ‌ను త‌వ్వి.. ఎలుక‌ను ప‌ట్టిన‌ కార్తికేయ‌

రేటింగ్‌: 2.5/5

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.