'కార్తికేయ-2'కి మేలు చేసిన 'లైగర్'!
on Aug 25, 2022

బ్లాక్ బస్టర్ టాక్ తో రన్ అవుతున్న 'బింబిసార', 'సీతా రామం' సినిమాలు థియేటర్స్ లో ఉన్న సమయంలో విడుదలైన 'కార్తికేయ-2' వారం రోజుల్లోనే ఆ చిత్రాల కలెక్షన్స్ ని దాటేసి సంచలనాలు సృష్టిస్తూ దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ ఇండియా, ఓవర్సీస్ లోనూ కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది. ఇప్పటిదాకా(12 రోజుల్లో) వరల్డ్ వైడ్ గా రూ.41.80 కోట్ల షేర్(81.50 కోట్ల గ్రాస్) రాబట్టిన ఈ మూవీ.. త్వరలోనే రూ.50 కోట్ల షేర్ మార్క్, రూ.100 కోట్ల గ్రాస్ మార్క్ అందుకునే అవకాశముంది. అయితే 'కార్తికేయ-2' జోరుకు 'లైగర్'తో బ్రేక్ పడుతుందని భావించారంతా. కానీ ఇప్పుడు 'లైగర్' రాక 'కార్తికేయ-2'కు కలిసొచ్చిందని చెప్పొచ్చు.
విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ 'లైగర్'. భారీ అంచనాలతో నేడు(ఆగస్ట్ 22) ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం మొదటి షో నుంచే నెగటివ్ టాక్ సొంతం చేసుకుంది. కొందరైతే అసలు ఈ మూవీ నిజంగా పూరీనే డైరెక్ట్ చేశాడా అనే సందేహం కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చి ఉంటే మాత్రం ఖచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించేది. విడుదలకు ముందు ఈ సినిమాపై తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ లోనూ బజ్ బాగానే క్రియేట్ అయింది. వరల్డ్ వైడ్ గా దాదాపు 90 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ చిత్రం.. 100 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసినా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే అంచనాలన్నీ తలకిందులై 'లైగర్' మూవీ నెగటివ్ టాక్ సొంతం చేసుకుంది.
'లైగర్'కి అడ్వాన్స్ బుకింగ్ భారీగానే జరిగాయి. అది నేటి 'కార్తికేయ-2' కలెక్షన్లపై తీవ్ర ప్రభావం చూపుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే 'లైగర్'కి పాజిటివ్ టాక్ వచ్చినట్లైతే 'కార్తికేయ-2' ఫుల్ రన్ పైనే ప్రభావం పడుండేది. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ 'కార్తికేయ-2' కంటే 'లైగర్' వైపు ఎక్కువ మొగ్గు చూపేవారు. అయితే ఇప్పటికే అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తున్న 'కార్తికేయ-2'.. ఇప్పుడు 'లైగర్' దెబ్బకి క్లాస్ మాస్ అనే తేడా లేకుండా మళ్ళీ అందరికీ మొదటి ఆప్షన్ కానుంది. వీక్ డేస్ లోనూ వరల్డ్ వైడ్ గా కోటికి పైగా షేర్ రాబడుతున్న కార్తికేయ-2.. సౌత్, నార్త్, ఓవర్సీస్ అనే తేడా లేకుండా రేపటి నుంచి మరింత పుంజుకొని ఈ వీకెండ్ లోనే రూ.100 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరే అవకాశం కనిపిస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



