దర్శకునిగా కైకాల..
on Jul 26, 2018
కొత్త వింత పాత రోత అనే సామెత మన తెలుగు చిత్రసీమకి సరిగ్గా సరిపోతుంది.ఇక్కడ ఉన్న సీనియర్ నటులను కాదని తెలుగు రాని పరభాషా నటుల కోసం వెంపర్లాడుతుంటారు దర్సక నిర్మాతలు.రాసే కథ లో తీసే విధానం లో కొత్తదనం ఉండాలిగాని నటులు మారినంత మాత్రాన రిజల్ట్స్ మారవు. అలనాటి నటుల్లో నవ రస నట సార్వభౌముడిగా బిరుదుగాంచిన నటుడు కైకాల సత్యనారాయణ.ఎన్నో వైవిధ్య భరితమైన పాత్రల్లో నటించిన కైకాల దాదాపుగా వెండి తెరకి దూరమయ్యారు.అయితే ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం ‘ఎన్టీఆర్’ లో లెజెండరీ దర్శకులు హెచ్ఎం.రెడ్డి పాత్రలో నటిస్తున్నారు.
కైకాల పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు క్రిష్ ట్వీటర్లో 'కాళిదాసు', 'భక్తప్రహ్లాద' లాంటి చిత్రాలతో దక్షిణ భారతీయ సినిమాకి పునాది వేసిన పితామహుడు హెచ్ఎం రెడ్డి. అలాంటి లెజెండరీ పాత్రను మాహానటుడు కైకాల సత్యనారాయణ అమోఘమైన పద్ధతిలో రంజింపచేశారంటూ ఆ పాత్ర పిక్ ట్వీట్ చేసారు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇటీవలే తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది.ఎక్కడా రాజీ లేకుండా చిత్రంలో భారీ తారాగణాన్ని ఎంచుకున్నాడు బాలయ్యబాబు. చిత్రంలో ఎన్టీఆర్కు సంబంధించిన కీలక వ్యక్తులను, కీలక సన్నివేశాలను చూపించనున్నారు.చిత్రంలో ఎన్టీఆర్ సతీమణి బసవతారకమ్మ పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటిస్తున్న విషయం తెలిసిందే.