నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...
on Mar 14, 2015

ఆయన సంగీతాన్ని ఎలా కొలవాలి..? ఏ రీతిన వర్ణించాలి?
శంకరా.. నాదశరీరాపర అనే పాటిచ్చినందుకు ఆయన్ని క్లాస్ అనాలా??
చిటపట చినుకులు పడుతూ ఉంటే అంటూ ఆ చినుకుల్లో తడిసి ముద్ద చేసినందుకు పాటిచ్చినందుకు రొమాంటిక్ అనాలా??
ము.. ము.. ము.. ముద్దంటే చేదా నీకా ఉద్దేశం లేదా అంటూ కవ్వించినందుకు, ఆరేసుకోబోయి పారేసుకొన్నాను.. అంటూ ఊరించినందుకు పక్కా మాస్ అనాలా??
ముత్యమంతా పసుము ముఖమంత ఛాయ - అంటూ ముత్తైదువుల జాతీయ గీతాన్నిచ్చినందుకు మహిళా పక్షపాతి అనాలా?
ఎవరేమన్నా అనుకోండి! ఆయన్ని ఎలాగైనా పాడుకోండి. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఆయన ఓమామ! సంగీత బ్రహ్మా. నిదురించే తోటలోనికి
పాటలా వచ్చిన కోయిలమ్మ.. కె.వి.మహదేవన్.
``ఏమీ ఎరగని నగ్నశాఖ నుంచి ఆకులు ఎలా పుట్టుకొస్తాయో అలా ఆయన స్పర్శ తాకితే.. తీగల్లోని వేణువులో నిదురిస్తున్న స్వరాల అప్సరసలు మేల్కొంటాయి. గాలిలోకి ఎగిరిపోతాయి. మన అంతర్లోకాల్లో గుంపులు గుంపులుగా ముసురుకొని పూల పండుగలు చేస్తాయి...`` అంటూ కె.విమహదేవన్ పాటకు కితాబులిచ్చారు.. గుంటూరు శేషేంద్రశర్మ. ఈ మాటలు అక్షర సత్యాలు.
మధురమైన గీతికల్లో శ్రోతల్ని ముంచి తేల్చడానికి, మన చెవుల్లో అమృతాలు ధారబోయడానికే ఆయన పుట్టినట్టు అనిపిస్తుంటుంది. ఆయన స్వరపరచిన ఏ పాట తీసుకొన్నా.. అది మంచు పూల వర్షమై గుభాళిస్తుంది. అమ్మ పాటలా జోల పాడుతుంది. ప్రేయసిలా సేద తీరుస్తుంది. కడుపునిండా సంగీత రుచులతో కూడా వినోదాల విందు వడ్డిస్తుంది. ఆయన పాటకున్న మహత్తు అది. అందుకే నాలుగు దశాబ్దాల పాటు అప్రహిహాతంగా ఆయన సంగీత ప్రయాణం సాగింది. తెలుగు ప్రేక్షకులకు తేట తేనె రుచులు పంచుతూ.. పరుగులు తీసింది. మంచి మనసులు, మూగమనసులు, ఆత్మబంధువు, ఆత్మబలం, దాగుడు మూతలు, దసరాబుల్లోడు, ప్రేమ్ నగర్, అందాల రాముడు, అడవిరాముడు, సీతామాలక్ష్మి, సిరివెన్నెల, శంకరాభరణం... ఇలా ఎన్నని చెప్పుకోవాలి?? ఏ పాట కోసం ప్రస్తావించుకోవాలి??
తెలుగు సినీ జగత్తులో క్లాసిక్ అనిపించుకొన్న పాటల్లో అధిక వాటా ఆయనదే.
శిలలపై శిల్పాలు చెక్కినారు, ముద్దబంతిపువ్వులో మూగ కళ్ల ఊసులో, గోదారి గట్టుందీ, పాడుతా తీయగా చల్లగా, పచ్చగడ్డి కోసేటి పడుచుపిల్లోయ్, ప్రతిరాత్రీ వసంతరాత్రి... ఇలా ఒకటా రెండా వందల, వేల గీతాలు. అవన్నీ చరిత స్మ్రతుల్లో.. మధుర జ్ఞాపకాల్ని పంచేస్తుంటాయి.
సంగీతంలో ట్రెండ్ అనే పదం ఎప్పుడు విన్నా.. అది ఆయన పాట నుంచే మొదలవుతుంటుంది.
తెలుగు సినీ జగత్తులో ఇన్ని అద్భుతాలు సృష్టించిన మామకి.. తెలుగు రాదంటే నమ్ముతారా???
మామ వృద్దినీ, సంగీత జ్ఞానాన్నీ చూసి ఓర్వలేని కొంతమంది `తెలుగు రానివాడి చేత తెలుగు సినిమాలకు పనిచేయించడమేమిటి` అంటూ ఎద్దేవా చేశారు. అలా చేసిన ప్రతిసారీ.. తన బాణీతోనే సమాధానమిచ్చారు. తెలుగు రాకపోయినా సరే.. ప్రతి పదానికి అర్థం అడిగి మరీ తెలుసుకొని.. ఆ మాధుర్యాన్ని ఎక్కడా కోల్పోకుండా బాణీని కట్టేవారు. మామ కెరీర్‌లో ప్రతీ సినిమా, ప్రతి పాటా ఓ ఆణిముత్యమే. అయితే అందులో మకుటం లేని మహారాజులా వెలిగింది మాత్రం.. శంకరాభరణం. శాస్త్రీయ సంగీతంపై తనకున్న భక్తిని ఈ చిత్రంతో తెలియపరుచుకొన్నారు విశ్వనాథ్. ``నువ్వున్నావన్న ధైర్యంతోనే ఈ సినిమా చేస్తున్నా... `` అంటూ విశ్వనాథ్ ఈ సినిమాని కె.వి మహదేవన్ చేతిలో పెట్టారంటేనే ఆయన విశిష్టత ఏమిటో అర్థం అవుతుంది. ఈ సినిమాలో పాటలు పాడడానికి బాలసుబ్రహ్మణ్యం ముందు నిరాకరించారట. ``అమ్మో.. ఈ పాటలు నేను పాడలేను.. నా వల్ల కాదు..`` అంటూ బాలు భయపడుతుంటే... ధైర్యం చెప్పి ముందడుగు వేయించింది మామే. ఈ చిత్రంతోనే తొలిసారి బాలుకి ఉత్తమ గాయకుడిగా జాతీయ అవార్డు వచ్చింది. కొత్తగాయకులలోని ప్రతిభని గుర్తించి ప్రోత్సహించడంలోనూ మామ ముందుండేవారు. ఎల్.ఆర్.ఈశ్వరిలాంటి సుమధుర గాయనిని తెలుగు తెరకు పరిచయం చేసింది కె.విమహదేవనే.
ఇళయరాజా, చక్రవర్తి లాంటి సంగీత దర్శకుల రాకతో కె.వి.మహదేవన్ జోరుకు అడ్డుకట్ట పడింది. అయినా సరే.. తన శైలికి తగిన చిత్రం వచ్చినప్పుపడు చెలరేగిపోతూనే ఉన్నారు. యువతని ఉర్రూతలూగించిన `ఆరేసుకోబోయి పారేసుకొన్నా` గీతాన్ని తన 56వ యేట మామ కంపోజ్ చేశారంటే నమ్ముతారా..?? ఈ పాట కోటి రూపాయల గీతంగా ప్రసిద్ధికెక్కింది. ఈ పాటని చూడ్డానికే ప్రేక్షకులు మళ్లీ మళ్లీ థియేటర్లకు వెళ్లేవారట. వేటూరి రాసిన తొలి మాస్ గీతం కూడా ఇదే. మురారి లాంటి నిర్మాతలు... `కెవి లేకపోతే సినిమాలు తీయను` అని భీష్మించుకొని కూర్చునేవారంటే.. కళాతపస్వి కె.విశ్వనాథ్ `నా సినిమాల్లో సంగీతం బాగుందంటే అదంతా కెవిమహదేవన్ చలవే` అన్నారంటే... ఇంతకంటే ఈ స్వర బ్రహ్మా గురించి చెప్పేదేముంది??
తెలుగు పాటకు పరుగులు నేర్పించిన ఘనత ఆయనది..
మాస్, క్లాస్ అనే తేడా చెరిపిన నేర్పరితనం ఆయనది..
సంప్రదాయ సంగీతాన్నీ రిక్షావోడు పాడుకొనేలా చేసిన ప్రతిభ ఆయనది..
తెలుగు సినిమా సంగీతం అనే పుస్తకంలో... ఓ సువర్ణ అధ్యాయం ఆయనది..
కానీ ఆయన వదిలి వెళ్లిన ప్రతి పాటా మనది.. అచ్చంగా మనదే. ఆ పాటల్ని వింటూ.. ఆ మధురిమల్లో మామని మనసారా వెదుక్కొందాం.. మళ్లీ మళ్లీ అదే పాట పాడుకొందాం!!
(ఈరోజు కె.వి.మహదేవన్ జయంతి సందర్భంగా)
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



