ప్రేక్షకులను మళ్ళీ థియేటర్స్ కి రప్పించే సినిమా 'బింబిసార'!
on Jul 30, 2022

నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'బింబిసార'. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాతో వశిష్ఠ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఆగస్ట్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ టీజర్, ట్రైలర్ ఇప్పటికే విడుదలై విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా హాజరైన జూనియర్ ఎన్టీఆర్ ప్రేక్షకులను మళ్ళీ థియేటర్స్ కి రప్పించే కంటెంట్ ఉన్న సినిమా 'బింబిసార' అని అన్నాడు.
'బింబిసార' ఖచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుందని తారక్ ఆశించాడు. రెండేళ్ల క్రితం ఈ కథ విన్నానని, అద్భుతమైన కథ అని అన్నాడు. అయితే ఇంత పెద్ద కథని కొత్త దర్శకుడు తెరకెక్కించగలడా అని ఆందోళన కలిగిందని, కానీ సినిమా చూశాక సర్ ప్రైజ్ అయ్యానని చెప్పాడు. కథ చెప్పేటప్పుడు వశిష్ఠలో ఎంత కసి కనిపించిందో, సినిమాని కూడా అంతే గొప్పగా తెరకెక్కించాడని తారక్ తెలిపాడు.
"ఈ మధ్య ప్రేక్షకులు థియేటర్స్ లో సినిమా చూడటానికి ఆసక్తి చూపించలేదని అంటున్నారు. కానీ నేను అది నమ్మను. ఎందుకంటే మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. బింబిసార కూడా ప్రేక్షకులు థియేటర్స్ కి వెళ్లి చూడాల్సిన అద్భుతమైన కంటెంట్ ఉన్న సినిమా. ఈ చిత్రం కళ్యాణ్ అన్న కెరీర్ కి బింబిసారకి ముందు, బింబిసారకి తరువాత అనేలా ఉండబోతోంది. బింబిసార పాత్రలో కళ్యాణ్ అన్నని తప్ప మరో నటుడిని ఊహించుకోలేం. ఈ సినిమా చూసి చెబుతున్నాను. నాకు కథ, కథనం, నెక్స్ట్ ఏం జరగుతుంది అన్నీ తెలిసి కూడా సినిమా చూసి ఎగ్జైట్ అయ్యాను. ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ చిత్రంలో పాటు విడుదలవుతున్న 'సీతారామం' కూడా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అని తారక్ అన్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



