నాగార్జున చేస్తున్నది కరెక్టేనా..?
on Jun 17, 2025
టాలీవుడ్ సీనియర్ స్టార్స్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునలను నాలుగు పిల్లర్స్ గా భావిస్తుంటారు. ఈ తరం స్టార్స్ తో కూడా పోటీపడి విజయాలు సాధించగల సత్తా వీరికి ఉంది. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ ఇప్పటికీ హీరోలుగా నటిస్తూ విజయాలను అందుకుంటున్నారు. అయితే నాగార్జున అడుగులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి.
నాగార్జున అడుగులు మొదటినుంచి కాస్త భిన్నంగానే ఉంటాయి. మూసధోరణిలో సినిమాలు చేయకుండా ఎప్పటికప్పుడు కొత్తదనం అందించడానికి ప్రయత్నిస్తుంటాడు. కొత్త దర్శకులతో సినిమాలు చేయడానికి ఉత్సాహం చూపిస్తాడు. ఇప్పుడు కూడా మిగతా సీనియర్ స్టార్స్ కి భిన్నంగా అడుగులు వేస్తున్నాడు.
ప్రస్తుతం నాగార్జున.. హీరోగా సినిమాలు చేయకుండా.. ఇతర హీరోల సినిమాలలో భాగం అవుతున్నాడు. ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన 'కుబేర'లో కీలక పాత్ర పోషించాడు. ఈ సినిమా జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే రజినీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో రూపొందుతోన్న 'కూలీ'లో విలన్ గా నటిస్తున్నాడు. ఇది ఆగస్టు 14న థియేటర్లలో అడుగుపెట్టనుంది. రెండు నెలల వ్యవధిలో వస్తున్న ఈ రెండు సినిమాలు సక్సెస్ అయితే.. నాగార్జున వరుస సినిమాలతో జోరు పెంచే అవకాశముంది.
నాగార్జునకు సౌత్ తో పాటు, నార్త్ లోనూ మంచి గుర్తింపు ఉంది. పలు హిందీ సినిమాల్లో నటించి అక్కడి ప్రేక్షకులకు చేరువయ్యాడు. 2022 లోనూ 'బ్రహ్మాస్త్ర' చిత్రంలో ఆయన పోషించిన 'నంది అస్త్ర' అనే శక్తి కలిగి ఉన్న అనీష్ శెట్టి పాత్రకు మంచి పేరు వచ్చింది. ఇక 'కుబేర', 'కూలీ' తర్వాత నాగార్జున ఇదే బాటలో పయనిస్తే.. భారీ పాన్ ఇండియా సినిమాలలో విలన్ రోల్స్ కి, కీ రోల్స్ కి ఆయన బెస్ట్ ఆప్షన్ అవుతాడు. అన్ని భాషల మేకర్స్ నాగార్జున కోసం క్యూ కట్టే ఛాన్స్ ఉంది. మరి తన స్టార్డంకి భిన్నంగా నాగార్జున ఎంచుకున్న ఈ దారి.. మునుముందు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
