ENGLISH | TELUGU  

ఇంకొక్కడు మూవీ రివ్యూ

on Sep 8, 2016

విక్ర‌మ్‌ని ఓ విష‌యంలో మెచ్చుకొని తీరాలి. ఎన్ని ఫ్లాపులు ఎదురైనా... ఏదో డిఫ‌రెంట్‌గా ప్ర‌య‌త్నిస్తూనే ఉంటాడు. ఎన్ని దెబ్బ‌లు తిన్నా.. మ‌ళ్లీ లేచి నిల‌బ‌డుతుంటాడు. రొటీన్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు హిట్ట‌వుతున్నాయి క‌దా, అని అంద‌రి దారిలో వెళ్ల‌డు. కొత్త పాయింట్ ప‌ట్టుకొని.. దాని చుట్టూ క‌మ‌ర్షియ‌ల్ అంశాలు అల్లుకోవ‌డానికి క‌ష్ట‌ప‌డుతుంటాడు. అందుకే విక్ర‌మ్ సినిమాలు ఫ్లాప్ అవుతున్నా - కొత్త‌ద‌నాన్ని ఇష్ట‌ప‌డేవారికి మాత్రం ఏదో ఓ మూల న‌చ్చేస్తూనే ఉంటాయి. ఈసారి విక్ర‌మ్ ఓ సైన్స్ ఫిక్ష‌న్‌ని ఎంచుకొన్నాడు. దానికి అన్నిర‌కాల క‌మ‌ర్షియ‌ల్ అంశాల్ని మేళ‌వించ‌డానికి ట్రై చేశాడు. మ‌రి ఆ క‌ల‌యిక కుదిరిందా, విక్ర‌మ్ ఈసారైనా ఆక‌ట్టుకొన్నాడా, ఇంత‌కీ ఈ ఇంకొక్క‌డు ఎవ‌రు? అత‌ని క‌థేంటి? 
తెలుసుకొందాం రండి

* క‌థ‌

ల‌వ్ (విక్ర‌మ్‌) అనే కెమెక‌ల్ సైంటిస్ట్ మ‌లేసియాలో ర‌క‌ర‌కాల ప్ర‌యోగాల్ని ర‌హ‌స్యంగా చేస్తుంటాడు. అత‌ని సృష్టి... స్పీడ్ అనే మందు. అది చూడ్డానికి ఆస్త‌మా రోగులు పీల్చే ఇన్‌హీల‌ర్‌గా ఉంటుంది. కానీ అది పీలిస్తే.. మ‌నిషి స‌ర్వ‌శక్తిమంతుడిగా మార‌తాడు. అదీ 5 నిమిషాల వ‌ర‌కూ మాత్ర‌మే. ఈ స్పీడ్ విద్రోహుల చేతికి చేర‌వేసి, కోట్లు సంపాదించాల‌ని, ప్ర‌పంచంలోనే అత్యంత ధ‌న‌వంతుడు అవ్వాల‌ని ఆశ ప‌డ‌తాడు ల‌వ్‌. అందుకే... స్పీడ్‌ని పెద్ద ఎత్తున త‌యారు చేసి విదేశాల‌కు ఎగుమ‌తి చేయాల‌ని ప‌థ‌కం ప‌న్నుతాడు. అత‌న్ని ప‌ట్టుకోవ‌డానికి భార‌త ప్ర‌భుత్వం అఖిల్ (విక్ర‌మ్‌),  ఆరుషి (నిత్య‌మీన‌న్‌) అనే రా ఏజెంట్ల‌ని అండ‌ర్ క‌వ‌ర్ ఆప‌రేష‌న్ లో భాగంగా మ‌లేసియా పంపుతుంది. అయితే నాలుగేళ్ల క్రితం ల‌వ్ చేతిలోనే త‌న భార్య (న‌య‌న‌తార‌)ని కోల్పోతాడు అఖిల్‌. ఆ ప‌గ సాధించుకొని, ల‌వ్ సామ్రాజ్యాన్ని నేల‌మ‌ట్టం చేయాల‌నుకొంటాడు అఖిల్‌. మ‌రి అత‌ని ప్ర‌య‌త్నం ఫ‌లించిందా, లేదా?  మ‌లేసియాలో అఖిల్‌కి ఎలాంటి అనుభ‌వాలు ఎదుర‌య్యాయి? అనేదే క‌థ‌. 

* విశ్లేష‌ణ‌

స్పీడ్ అనే మందు వాడితే... 5 నిమిషాల పాటు శ‌క్తిమంతుడు అవుతాడు. ఆ పాయింట్ ఆస‌క్తికి రేకెత్తిస్తుంది. అయితే దాని చుట్టూ అల్లిన క‌థ మాత్రం స‌ర్వ సాధార‌ణంగా ఉంది. ఓ చిన్న పాయింట్‌ని న‌మ్ముకొని అన్ని కోట్లు ఖ‌ర్చు పెట్ట‌డం ఆత్మ‌హ‌త్యా స‌దృశ్య‌మే. సైన్స్ ఫిక్ష‌న్ క‌థ‌ల‌కు లాజిక్‌ల‌తో ప‌నిలేదు. అయితే చెప్పే విధానం క‌న్వినెన్స్‌గా ఉండాలి.  స్పీడ్ మందు వాడితే.. జ‌రిగే అన‌ర్థాలేంటి?  దాని వ‌ల్ల దేశానికి ఎలాంటి న‌ష్టం జ‌రుగుతుంది?  అనే విష‌యాల్ని స్ప‌స్టంగా చెప్ప‌లేదు.  అంత పెద్ద ఇష్యూ అనుకొంటే దాన్ని అఖిల్ ఒక్క‌డికే అప్ప‌చెప్ప‌డం కూడా క‌రెక్ట్ అనిపించ‌దు. స్ర్కిప్టులో లోపాల్ని ప‌క్క‌న పెడితే, దాన్ని న‌డిపిన విధానం కూడా బోర్ కొట్టిస్తుంది. క‌థ‌ని ఇంట్ర‌స్టింగ్ గా న‌డ‌ప‌డం అటుంచితే... క‌థ‌నంలో వేగం లేదు. సినిమా అంతా ఒకే పాయింట్ చుట్టూ తిరుగుత‌న్న పీలింగ్ క‌లుగుతుంది. ఇంట్ర‌వెల్ బ్యాంగ్ బాగున్నా.. ఆ త‌ర‌వాత ఏం జ‌ర‌గ‌బోతోంది అనేది తేలిగ్గా ఊహించ‌గ‌లుగుతాడు ప్రేక్ష‌కుడు. ప్రారంభ సన్నివేశాల్లో ఉన్న ఆస‌క్తి... రాను రాను త‌గ్గిపోతూ ఉంటుంది. ద్వితీయార్థం టోట‌ల్‌గా మ‌న స‌హ‌నానికి ప‌రీక్ష పెడుతుంది. యాక్ష‌న్ నేప‌థ్యంలో తెర‌కెక్కించిన స‌న్నివేశాలు బాగానే ఉన్నా.. చివ‌రికి హీరో కూడా స్పీడ్ మందు వాడి.. శ‌త్రువుల్ని అంత‌మొందించ‌డం హీరోయిటిక్‌గా అనిపించ‌దు. కామెడీ ఏ కొస‌నా లేదు. నిత్య‌మీన‌న్ పై వేసిన ఓ కుళ్లు జోకు ఒక్క‌టే పేలింది.

* న‌టీన‌టుల ప్ర‌తిభ‌

విక్ర‌మ్ గొప్ప న‌టుడన్న విష‌యం ప్ర‌త్యేకించి చెప్ప‌క్క‌ర్లెద్దు. దాన్ని నిరూపించుకోవ‌డానికి మ‌ళ్లీ మ‌ళ్లీ ఇలా కోట్లు దండ‌గ చేయ‌క్క‌ర్లెద్దు. ల‌వ్ అనే పాత్ర‌లో క‌నిపించ‌డానికే విక్ర‌మ్ ఈ సినిమా చేశాడా?  అనిపిస్తుంది. నిజానికి ఆ పాత్ర కూడా అంత గొప్ప‌గా లేదు. సినిమా స‌గం అయ్యాక ల‌వ్ పాత్ర ప్ర‌వేశిస్తుంది. అక్క‌డి నుంచి సినిమా మ‌రింత స్పీడ్ అందుకోవాలి. కానీ.. అక్క‌డ్నుంచి మ‌రీ స్లో అవుతుంది. నిత్య‌మీన‌న్ మ‌రోసారి ప్రాధాన్యం లేని పాత్ర‌లో క‌నిపిస్తుంది. అఖిల్ ప‌క్క‌న దిష్టిబొమ్మ‌లా నిల‌బ‌డి.. చివ‌ర్లో ప్రాణ త్యాగం చేయ‌డానికే ఆ పాత్ర‌ని వాడుకొన్నారు. న‌య‌న‌తార సినిమా మొత్తం సీరియ‌స్ లుక్‌లోనే క‌నిపిస్తుంది. మిగిలిన వాళ్ల గురించి మాట్లాడుకోవ‌డానికి ఏం లేదు.

* సాంకేతికంగా

సినిమా కోసం చాలా ఖ‌ర్చు పెట్టారు. మ‌లేసియా మొత్తం చూపించేశారు. లొకేష‌న్లు కొత్త‌గా ఉన్నాయి. సెట్లూ బాగున్నాయి. ప్ర‌తీ సీన్ రిచ్ గా ఉంది. అయితే సినిమాలోనే విష‌యం లేదు. హ‌రీష్ పాట‌లు విన‌సొంపుగా లేవు. డ‌బ్బింగ్ పాట‌ల్లో సాహిత్యం గురించి ఎంత త‌క్కువ మాట్లాడుకొంటే అంత మంచిది. ద‌ర్శ‌కుడు ఆనంద్ శంక‌ర్ ఏం న‌మ్ముకొని ఈ సినిమా తీశాడో అర్థం కాలేదు. క‌థ‌కుడిగా కూడా ఆనంద్ ఫెయిల్ అయ్యాడ‌నే చెప్పాలి.

* పంచ్ లైన్ :  ఒక్క‌డు కూడా మిగ‌ల‌డు

* రేటింగ్‌: 1.5

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.