ENGLISH | TELUGU  

చార్లీ చాప్లిన్ జయంతి

on Apr 16, 2015

అతడి నడక హాస్యం.నటన హాస్యం. పలుకు హాస్యం. ఉలుకు హాస్యం.అతడేం చేసినా నవ్వుల జల్లే. చిలిపి చేష్టలు,విచిత్ర ఆహార్యమే అతడి ఆస్తి. అద్భుత ప్రతిభలో తనకెవరూ సాటిలేరనిపించాడు.ప్రపంచమంతా అభిమానుల్ని ఆర్జించాడు. అందరినీ కవ్వించి నవ్వించిన  ఆ హాస్యరస చక్రవర్తి చార్లి చాప్లిన్‌. హాస్యానికి సిలబస్ గా ప్రపంచ చలనచిత్ర యవనికపై చెరగని గురుతుగా నిలిచిన చార్లీ చాప్లిన్ జయంతి నేడు.

1889 ఏప్రిల్ 16న  సూర్యుడితో పాటూ బ్రిటన్ లో ఈ హాస్య చక్రవర్తి ఉదయించాడు. తాగుబోతు భర్తను భరించలేక చాప్లీ తల్లి వేరు కాపురం పెట్టింది. ఆమె మంచి నటి, గాయకురాలు. ఊరూరా తిరిగి నాటక ప్రదర్శనలిచ్చేది. ఓ నాటకంలో పాడలేక గొంతు మూగబోయిన తల్లి స్థానంలో నిలబడి ఇచ్చిన ప్రదర్శనకి జనం జయజయధ్వానాలు పలికారు. ఎప్పుడు ఏ పాత్ర దొరికితే దానిని బతకడం కోసం చేశాడు. సొంతంగా వినోదాత్మకంగా కామెడీ స్కిట్ లు రాసి ప్రదర్శించేవాడు. తనకు పదకొండేళ్ల వయసులో మతి స్థిమితం కోల్పోయిన తల్లిని ఆస్పత్రిలో చేర్చి.....అన్న సిడ్నితో పాటు వర్క్‌హౌస్‌లో చేరాడు. గంజినీళ్లు తాగి బతికాడు. రోగిష్ఠులతో కలిసి జీవించాడు. కూలి చేసి పొట్టపోసుకున్నాడు. మార్కెట్‍లోనో, పార్కుల్లోనో పడుకునేవాడు.

క్రమంగా వేషాల అవకాశాలు పెరిగాయి. ఆ సమయంలో ఆఫీస్ బాయ్ గా వేసిన రోల్ మంచి పేరు తెచ్చిపెట్టింది. 1910-1913 మధ్యలో అమెరికా అంతటా ప్రదర్శనలిచ్చాడు. అమెరికాకి మాకాం మార్చాడు. ఓ దర్శకుడి సూచన మేరకు ఒక ప్రత్యేక పాత్రలో కన్పించాడు. అది తాను స్వయంగా సృష్టించుకున్న పాత్ర. వదులు ప్యాంట్, పెద్ద బూట్లు, చేతికర్ర, డెర్బీటోపీ, బిగుతుగా కోటు, చిన్న మీసం... ఆ వేషంతో సెట్స్ మీదికి వచ్చాడు. నవ్వులే నవ్వులు. అంతే అదే చార్లీ పర్మినెంట్ గెటప్  అయిపోయింది. ఆ పాత్రకు తానే ట్రాంప్ అని పేరు పెట్టుకున్నాడు. అలా 1913 లో అనాలోచితంగా పుట్టిన ట్రాంప్... దేశదిమ్మరి పాత్ర అర్థశతాబ్దం పాటూ వంద చిత్రాల్లో వివిధ రకాలుగా  నటించి ప్రపంచ ప్రేక్షకులకు చేరువయ్యాడు.

1923లో చాప్లిన్ స్టూడియో స్థాపించి సొంతంగా చిత్రాలు తీయడం ప్రారంభించాడు. 30 ఏళ్లలో తొమ్మిది చిత్రాలు తీశాడు. ఆ సినిమాల్లో పాత్రలను ఎందరో కాపీ కొట్టినా చాప్లిన్ కు ఎవ్వరూ సాటి రాలేకపోయారు. విచిత్రమేంటంటే ఓ సారి చాప్లిన్ తానెవరో చెప్పకుండా తననే ఇమిటేట్ చేశాడు. ఆ కాంపిటేషన్లో ఆయన విజేతగా నిలవలేకపోవడం విడ్డూరం.

మూకీ సినిమాల యుగంలో సిటీలైఫ్, ది కిడ్, సర్కస్, ది మోడ్రన్ టైమ్స్ వంటి అజరామరమైన హాస్య చిత్రాలను, టాకీల యుగంలో నాటి నియంత హిట్లరును ఆటపట్టిస్తూ తీసిన 'ది గ్రేట్ డిక్టేటర్' వంటి సందేశాత్మక చిత్రాలను చాప్లిన్ నిర్మించి, దర్శకత్వం వహించారు. సైనికులారా స్వేచ్ఛ కోసం పోరాడండి బానిసత్వం కోసం కాదు అంటూ ది గ్రేట్ డిక్టేటర్ సినిమాలో నకిలీ హిట్లర్ వేషధారణలో చాప్లిన్ ప్రసంగం యుద్ధోన్మాదులకు ఈ నాటికీ చెంపపెట్టులాంటి సందేశం ఇస్తూనే ఉందని సినీ విమర్శకుల ప్రశంస. కానీ ఈ పాత్రే చార్లీని కష్టాల్లోకి నెట్టింది. అమెరికన్ల ఆగ్రహానికి గురిచేసింది. యుద్ధానికి వ్యతిరేకంగా చేసిన ప్రసంగం కమ్యునిజానితి ఊతమిచ్చేదిగా ఉందని అమెరికాలో వ్యతిరేకత మొదలైంది. తాను కమ్యూనిస్టు కాదని ఎంత వివరణ ఇచ్చినా ప్రజలు శాంతించలేదు.

ఆ తర్వాత తీసిన మున్షుయర్ వెర్డ్  సినిమాకి సెన్సార్  సర్టిఫికేట్ ఇవ్వకుండా అడ్డంకులు పెట్టారు.ఎంతో వివరణ ఇచ్చుకుంటే కానీ ఆ సినిమా రిలీజ్ కాలేదు. అమెరికన్లు తనమీద అనుమానం పెంచుకున్నారని చార్లీకి అర్థమైంది. మీడియాకు టార్గెటయ్యాడు. అమెరికా వ్యతిరేకని, కమ్యూనిస్టని విపరీతంగా ప్రచారం జరిగింది. అప్పటికి 40 ఏళ్ళుగా నివసిస్తున్నా, చాప్లిన్ బ్రిటీష్ పౌరసత్వాన్ని వదులుకోలేదు. ఈ వంకతో అతడ్ని వేధించడం మొదలెట్టారు. అయితే చాప్లిన్ వాదనేంటంటే...కళాకారుడుగా తాను ప్రపంచ పౌరుడునని, ప్రత్యేకంగా ఏ ఒక్క దేశానికీ చెందినవాడ్నికాదని చెప్పాడు. కాని ఎలాగైనా అతడ్ని జైలుపాలు చేయాలని ప్రయత్నించారు. ఫలితం దక్కలేదు. ఇక అక్కడ తనకు స్థానం లేదని భావించాడు. ఆ తర్వాత స్విట్జర్లాండ్‌ లో స్థిరపడ్డాడు. అక్కడ ప్రజలు, ప్రముఖులు......చాప్లిన్ ని ప్రశంసించేవారు. " గ్రేట్ హ్యూమనిస్ట్ ' అని చెప్పుకునేవారు.

అప్పటికి చాప్లిన్‌కు 64 సంవత్సరాలు. మిగిలిన జీవితాన్ని ఇంగ్లండులోనే గడపాలని నిర్ణయించుకున్నాడు. అమెరికాలో తన ఆర్థికలావాదేవీలు పూర్తి చేసుకోవడానికి సమయం పడుతుంది కాబట్టి తిరిగి రావడానికి US అనుమతి అడిగాడు. అతి కష్టం మీద పునః ప్రవేశానికి అనుమతించారు. ఒకప్పుడు చార్లీని చూసేందుకు ఎగబడిన అమెరికన్లు తర్వాత ఆయన కనిపిస్తే ఏం చేస్తారో తెలియని స్థితి.  ఫలితంగా అమెరికా వదిలే ముందు....వారం తర్వాత దాదాపు రహస్య జీవితం గడిపాడు. ఈలోగా తిరిగి అమెరికా రావాలంటే అమెరికా అధికారుల ముందు హాజరై వారి ప్రశ్నలకు  సంతృప్తికర సమాధానాలు ఇవ్వాలని కేబుల్ వచ్చింది. మాతృదేశం ఇంగ్లండుకి వెళ్లాడు. అక్కడా ఒంటరి తనమే మిగిలింది. అప్పుడు తనకు ఆధారం నాలుగో భార్య ఉనా, ఆమెతో కలిగిన సంతానం. స్విట్జర్లాండ్ వెళ్లి ఓ చిన్న గ్రామంలో నివాసం ఏర్పరుచున్నాడు. 1957లో ఏ కింగ్ ఇన్ న్యూయార్క్, 1967లో ఏ కౌంటెస్ ప్రమ్ హాంగ్ కాంగ్ తీశాడు. హాంగ్ కాంగ్ లో చార్లీ  ఓ నిముషం పాటు కనిపించే పాత్ర వేశాడు. అది ఘోరంగా విఫలమైంది.  అదే ఆయన నటించి, నిర్మించిన చివరి చిత్రం.

బ్రిటన్ మాత్రం చాప్లిన్ ను తమదేశపు ప్రముఖుడిగానే భావించింది. చాప్లిన్ ఇంగ్లండులో స్థిరపడితే బాగుండనుకుంది. కానీ ఆయన స్వేచ్ఛకు అడ్డుచెప్పలేదు. ఆక్స్ ఫర్డ్ వర్శిటీ 1962లో గౌరవ డాక్టరేట్ ఇచ్చి సత్కరించింది.  1975లో బ్రిటీష్ ప్రభుత్వం నైట్ బిరుదుతో సత్కరించింది. నాటి నుంచి సర్ చార్లీ చాప్లిన్ అయ్యాడు. అప్పటికి చార్లీని అమెరికా నుంచి బహిష్కరించి 30 ఏళ్లు. అమెరికా వెళ్లే ఆలోచన చేసినా అది కుదరలేదు. అక్కడ ఆర్థిక లావాదేవీలు  చక్కబెట్టుకునేందుకు వెళ్లిన భార్యని....అమెరికా అధికారులు ప్రశ్నలతో విసిగించారు. ఇక అమెరికా తనని వదలనుకున్నాడు చార్లీ.

ఈ లోగా అమెరికా ధోరణిలో మార్పొచ్చింది.  చార్లీ వయసూ పెరిగింది. 87 ఏళ్లప్పుడు చాప్లిన్ తిరిగి అమెరికా వెళ్లగలిగారు. పశ్చాత్తాపంతో అమెరికా ప్రజలు ఆయనకు ఘన స్వాగతం చెప్పారు. అమెరికా సెనెట్, కాంగ్రెస్ తరఫున అమెరికా గౌరవ పౌరసత్వాన్ని అందించి, వైట్ హౌస్ లో ఘనంగా సన్మానించారు.  ఆవిధంగా బహిష్కరించిన చార్లీని తిరిగి గౌరవించక తప్పలేదు. జీవితంలో ఎన్నో చీకటి వెలుగులు చూసిన చార్లీ 1977 డిసెంబరు 25 క్రైస్తవులంతా వేడుకల్లో మునిగి తేలుతున్న వేళ.... మతంమంటే విశ్వశించని  చాప్లిన్ కళ్లు శాశ్వతంగా మూతపడ్డాయి. మానవజాతికి కల్మషం లేని నవ్వు అందించిన ఆయనకు మూడు ఆస్కార్ అవార్డులొచ్చాయి.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.