రెండు వారాల ముందే నెట్టింట్లో పెట్టేశారు..!!
on Jul 5, 2016
సినిమా విడుదలయ్యాక పైరసీ అవ్వడాన్ని ఎలా అడ్డుకోవాలా? అని భాషతో సంబంధం లేకుండా అన్నీ చిత్ర పరిశ్రమాలూ తలలు కొట్టుకొంటుంటే.. ఇప్పుడు కొత్తగా వారికి ఇంకో సమస్య వచ్చింది. సినిమా సెన్సార్ కోసం ఒక కాపీని సెన్సార్ బోర్డ్ కు పంపుతారు. ఆ కాపీని ఎవరూ బయట ప్రదర్శించకుండా "సెన్సార్ కాపీ" అని సదరు ప్రింట్ పై లోగోను కూడా వేస్తారు.
అయితే.. ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకోవడానికి ఏదైతే ఏంటీ అనుకొన్నారో ఏమో తెలియదుగానీ.. మొన్న "ఉడ్తా పంజాబ్" సెన్సార్ కాపీని నెట్ లో పెట్టేశారు. విడుదలకు సరిగ్గా రెండ్రోజుల ముందే క్లీన్ కాపీ నెట్ లో పెట్టేయడంతో సినిమా కలెక్షన్స్ పై తీవ్ర ప్రభావం చూపింది. ఇప్పుడు అదే తరహాలో మరో బాలీవుడ్ సినిమా సెన్సార్ కాపీని కూడా నెట్ లో అప్లోడ్ చేసేశారు.
అడల్ట్ ఎంటర్ టైనర్ గా బాలాజీ మోషన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న తాజా చిత్రం "గ్రేట్ గ్రాండ్ మస్తీ". రితేష్ దేశ్ ముఖ్, వివేక్ ఒబెరాయ్, అఫ్తాబ్ లు హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాలో "చిన్నదాన నీకోసం" ఫేమ్ మిస్తీ చక్రవర్తి, శ్రద్ద దాస్, పూజా చోప్రాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. జూలై 22న విడుదల కావాల్సిన ఈ సినిమా ఇప్పుడు ఆన్ లైన్ లో లభ్యం అవుతుండడంతో.. ఈ సినిమాకు కనీస స్థాయి కలెక్షన్లైనా లభిస్తాయా అని నిర్మాతలు కంగారుపడిపోతున్నారు!