ఘంటసాల కుమారుడు రత్నకుమార్ కన్నుమూత
on Jun 10, 2021

సుప్రసిద్ధ గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు రెండో కుమారుడు రత్నకుమార్ కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన.. ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. కరోనా సోకి కోలుకున్న తర్వాత రత్నకుమార్ గుండెపోటుతో మరణించారు.
ఇటీవల కరోనా బారినపడిన రత్నకుమార్ కు రెండు రోజుల క్రితమే నెగటివ్ గా నిర్ధారణ అయ్యింది. అయితే కొంతకాలంగా ఆయన కిడ్నీ సంబంధింత సమస్యలతో ఇబ్బందిపడుతున్నారని, డయాలసిస్ చికిత్స తీసుకుంటున్నారని కుటుంబసభ్యులు తెలిపారు. ఈ క్రమంలో చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. గురువారం తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు. రత్నకుమార్ ఆకస్మిక మరణంతో ఘంటసాల కుటుంబంలో విషాదం నెలకొంది.
రత్నకుమార్.. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా దక్షిణాది భాషల్లోనే కాకుండా హిందీలోనూ తెరకెక్కిన ఎన్నో చిత్రాలకు తన వాయిస్ అందించారు. ఎనిమిది గంటలపాటు ఏకధాటిగా డబ్బింగ్ చెప్పి 'ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్'లోనూ రత్నకుమార్ స్థానం సంపాదించుకున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఇప్పటివరకూ ఆయన వెయ్యికి పైగా సినిమాలకు డబ్బింగ్ చెప్పారు. ‘వీరుడొక్కడే’, ‘ఆట ఆరంభం’ వంటి తమిళ్ డబ్బింగ్ చిత్రాలతో పాటు దాదాపు 30 సినిమాలకు ఆయన మాటలు అందించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



