అమాంతం ఎన్టీఆర్ కాళ్లమీద పడిపోయాను!
on Sep 14, 2017
ఎన్టీయార్ పై తీసిన సెటైరియల్ మూవీ ‘గండిపేట రహస్యం’. అందులో ఎన్టీయార్ పాత్రకు నటుడు పృధ్వీని తీసున్నారు హీరో కృష్ణ. 1989లో జరిగిన ఈ ముచ్చట గురించి ఇటీవల ఓ సందర్భంలో అందరితో పంచుకున్నాడు పృధ్వీ. గమ్మత్తుగా ఉంటుంది వినండి. ‘రామారావుగారి వేషం వేస్తావా? అనడిగారు కృష్ణ. రామారావుగారంటే చిన్నప్పట్నుంచీ ప్రాణం. అందుకే ఎగిరి గంతేశా. తీరా షూటింగ్ జరుగుతుంటే అర్థమైంది. ఇదేదో ఆయన్ను ఏకుతూ తీస్తున్న సినిమా అని. ‘సార్... ఇదేంటండీ..’ అనడిగా. పర్లేదులే చేయవయ్యా. అని ధైర్యం చెప్పారు కృష్ణ. ‘ఆయన తిడతారేమోనండీ’ అన్నా. ‘ఆయనేం అనడు లేవయ్యా’ అని బలవంతంగా ఆ పాత్ర చేయించారు.
సినిమా విడుదలైంది. రచ్చ మొదలైంది. ఫ్యాన్సందరూ రగిలిపోతున్నారు. నన్ను ఫ్యాన్స్ కొట్టారనీ.. నేను పారిపోయాననీ.. ఓ వార్త ఆ నోటా ఆ నోటా తిరిగి తిరిగి ఇండస్ట్రీ అంతా వ్యాపించింది. నిజానికి అదేం జరగలేదు. అంతేకాదు... నేను ఏ సినిమా ఆఫీస్ కి వెళ్లినా... ‘వేషం లేదు పో...’ అంటున్నారు. హైదరాబాద్ లో నాకిక పని ఉండదని అర్థమైపోయింది. చివరకు మిత్రుడ్ని వెంటబెట్టుకొని డైరెక్ట్ గా ఎన్టీయార్ గారినే కలిశాను. ఆయన సెక్రటరియేట్ లో కూర్చొని ఉన్నారు. వెళ్లి అమాంతం కాళ్లమీద పడిపోయాను. ఆయన చుట్టూవున్న కొందరు నన్ను తన్నడానికి మీదకొచ్చారు. ఆయన వారందరి వంక అలా చూశారు. అంతే.. ఆగిపోయారు. ‘నేను ఏ పాపం ఎరుగనండీ... వేషం ఇస్తానంటే ఆశపడ్డాను కానీ... మీ పాత్ర వేయించి బదానం చేస్తారని అనుకోలేదండీ’ అని ప్రాధేయపడ్డాను. ఆయన పైకి లేపి.. నన్ను ఓదార్చారు. ‘ఎప్పుడూ ఇలాంటివి చేయకు. స్వర్థంతో పక్కవారిని బలి చేయడం ఇక్కడ మామూలే’ అని.. నా నుదుటన బొట్టు పెట్టి.. నీకు మంచి వచ్ఛస్సుంది.. పౌరాణికాలు వచ్చినా వదలకు చేయ్. అని దీవించారు.
అప్పట్నుంచే నాకు నిదానంగా వేషాలు రావడం మొదలైంది. అయితే... నాకు వేషాలు రాకుండా చేసింది రామారావుగారని చాలామంది అనుకుంటారు. అది నిజం కాదు. ఇండస్ట్రీ అంతా దాదాపు ఆయన భక్తులే ఉంటారు. వారందరూ ఆయనపై భయంతో, భక్తితో.. అభిమానంతో నన్ను దూరం పెట్టారు. నేను ఆయనకు చేరువయ్యానని తెలిశాక.. మళ్లీ నాకు వేషాలు ఇవ్వడం మొదలైంది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పతే మైదానంలో మీటింగ్ పెట్టారు. అమితాబ్, అనిల్ కపూర్ తదితర బాలీవుడ్ స్టార్లు కూడా వచ్చారు. మిరియాల పాల గ్లాస్ పట్టుకొని మోహన్ బాబుగారు కూడా రామారావుగారి పక్కనే ఉన్నారు. ఓ దండ తీసుకొని అన్నగారిని కలవడానికి నేనూ వెళ్లాను. నన్ను స్టేజ్ పైకి కూడా రానీయలేదు. అది చూసి... అన్నగారే స్వయంగా... ‘పృథ్వీగారిని పైకి రానీయండి’ అని పోలీస్ లకు ఆర్డర్ పాస్ చేశారు. వెంటనే దండ తీసుకొని పైకెళ్లి అన్నగారి మెడలో దండ వేసి కాళ్లకు నమస్కరించాను. ఆ సందర్భంలోనే ఓ ఫోటో దిగాను. ఇప్పటికీ నా ఇంట్లో ఆ ఫోటో ఉంది. ఆ ఫోటో వంక చూసుకున్నప్పుడల్లా ఏదో తెలీని ఆనందం. అంటూ.. గత స్మృతుల్ని నెమరు వేసుకున్నాడు పృధ్వీ.