కార్మిక సంఘాలకు షాకిస్తూ ఫిల్మ్ ఛాంబర్ సంచలన ప్రకటన!
on Aug 4, 2025

సినీ కార్మికుల వేతనాలను 30 శాతం పెంచకపోతే షూటింగ్స్ లో పాల్గొనేది లేదని తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని నిర్మాతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఇప్పటికే వేతనాలు ఎక్కువగా ఉన్నాయని, ఇంకా ఎక్కువగా ఉంటే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో నిర్మాతలతో చర్చించిన ఫిల్మ్ ఛాంబర్.. సినీ కార్మిక సంఘాలకు షాకిస్తూ తాజాగా సంచలన ప్రకటన చేసింది. యూనియన్స్ తో సంబంధం లేకుండా సాంకేతిక నిపుణులని, కార్మికుల్ని పనిలోకి తీసుకునే స్వేచ్ఛ నిర్మాతలకు ఉంటుందని తెలిపింది.
ఫిల్మ్ ఛాంబర్ విడుదల చేసిన ప్రెస్ నోట్ లో కీలక అంశాలు:
1) చిత్ర పరిశ్రమ ఇప్పటికే చాలా ఇబ్బందికర పరిస్థితులలో ఉంది. ఇటువంటి సమయంలో వేతనాలు పెంచడం, అందులోనూ కార్మిక శాఖ కమీషనర్ మార్గదర్శకత్వంలో, పరిష్కారం కోసం చర్చలు జరుగుతున్న సందర్భంలో.. ఫెడరేషన్ వారు కమీషనర్ మాటను ధిక్కరిస్తూ 30 శాతం పెంచిన తరువాత మాత్రమే విధులకు వెళ్ళాలని నిర్ణయించడం చాలా బాధకరం.
2) భరించలేని స్థాయిలో వేతనాలు పెంపును యూనియన్స్ డిమాండ్ చేయటం చిన్న నిర్మాతలకు ఆమోదయోగ్యం కాదు. ఈ పెంపును నిర్మాతలందరూ ఏకగ్రీవంగా వ్యతిరేకించడమైనది. కనీస వేతనాల చట్టం ప్రకారం, కనీస వేతనాలు చెల్లించే ఏ కార్మికుడినైనా నియమించుకునే హక్కు నిర్మాతలకు ఉందని కార్మిక శాఖ కమిషనర్ స్పష్టం చేశారు.
3) మనం అన్ని యూనియన్ల వారికి ఎక్కువ వేతనాలు చెల్లించడం జరగుచున్నది. ఇతర రాష్ట్రాల చలన చిత్ర పరిశ్రమలో ఇచ్చే వేతనాల కంటే మన కార్మికులకు అధిక వేతనాలు చెల్లించుచున్నాము.
4) ఈ పరిస్థితుల నేపథ్యంలో, తెలుగు ఫిలిం చాంబర్ ఏకగ్రీవంగా ఒక తీర్మానం చేసింది. దీని ప్రకారం నిర్మాతలు ఎవరైతే వైపుణ్యం కలిగిన వర్కర్స్ తామివ్వగలిగే వేతనానికి పనిచేస్తారో వారెవరైనప్పటికి వారి యూసయన్లో ఉన్నా లేకున్నా వాళ్ళతో షూటింగ్స్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎంతోమంది ఔత్సాహికులు ఇండస్ట్రీలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ.. యూనియన్లలో సభ్యత్వం కొరకు లక్షలాది రూపాయలు డిమాండ్ చేస్తూ వారి ప్రవేశానికి సదరు యూనియన్లు వారు అవరోధం కలిగిస్తున్నారు. ఇది ఎంతో మంది నైపుణ్యవంతులైన కార్మికుల పొట్ట కొట్టడమే. ప్రతి ప్రాజెక్టు అవసరాలు మరియు వ్యక్తుల సామర్థ్యాల ఆధారంగా కార్మికులతో కలిసి పనిచేసే పూర్తి స్వేచ్చ నిర్మాతలకు ఉంటుంది.
5) ఎవరైనా ఔత్సాహిక నిపుణులు / కార్మికులు సినీ రంగంలో పనిచేయాలంటే వారితో పని చేయించుకోవడానికి నిర్మాతలందరూ ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగినది. లక్షలాది రూపాయలు సభ్యత్వం కొరకు కట్టవలసిన పని లేదు. నైపుణ్యం ఉన్న కార్మికునికి పని కల్పించడమే మా ధ్యేయం.
6) తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి పరిశ్రమలోని అనేక రంగాలలో పని చేసి కళాకారులు, సాంకేతిక నిపుణులు మరియు ఇతర స్టేక్ హోల్డర్పు ఉంటారు. వీరందరితో పని చేస్తూ ఒక సానుకూల నిర్ణయం వైపు మండలి పని చేస్తుంది.
7) నిర్మాత లేనిదే సినిమా పరిశ్రమ లేదు. మన ఫిలిం ఇండస్ట్రీ మనుగడ కోసం నిర్మాత శ్రేయస్సు అతి ముఖ్యమైన విషయం అని కార్మిక సంఘాలు మరొక్కసారి గుర్తించాలి.


Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



