ENGLISH | TELUGU  

నాన్న సెంటిమెంట్ కదిలిస్తోందా?

on Jun 20, 2015

పిల్లల్ని కనిపెంచటం...వారికి విద్యాబుద్ధులు నేర్పించటం... వారి బంగారు భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దటంలో తల్లిదండ్రుల పాత్ర సమానంగావున్నా తల్లికి లభించే గుర్తింపే ఎక్కువ. అంటే తల్లి ప్రేమపై రాసే కథలు, కవితలు, తీసే సినిమాలు...వీటన్నింటిని చూస్తే తండ్రి పాత్రకు అంతగా ప్రాధాన్యత లభించడం లేదనే చెప్పాలి. బిడ్డకోసం అమ్మ చేసే త్యాగం ఎంత ముఖ్యమైనదో... నాన్న పడే తాపత్రయం, శ్రమ అంతకన్నా ముఖ్యమైనవి. కానీ తండ్రి శ్రమ, అభిమానం, తాపత్రయం.. అన్నీ పరోక్షమైనవి. అందుకే నిజజీవితంతో పాటూ సినిమాల్లోనూ నాన్నకు లభించే గుర్తింపు తక్కువే. నాన్న సెంటిమెంట్ తో వచ్చిన సినిమాల్లో ఒకటో రెండో తప్ప మిగిలిన అన్నీ నిరాశపర్చినవే.

నాన్నకు ప్రేమతో....ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ టైటిల్. ఈ పేరే చెబుతోంది. యంగ్ టైగర్ మూవీ నాన్నసెంటిమెంట్ చుట్టూ ముడిపడిఉందని. త్వరలో సెట్స్ పైకి ఈ సినిమాపై భారీఅంచానాలే ఉన్నాయి. ఎందుకంటే సెంటిమెంట్ సీన్స్ లో ఎన్టీఆర్ చక్కగా నటిస్తాడనే టాక్ ఉంది. అయితే గతంలో నాన్న సెంటిమెంట్ తో వచ్చిన సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయనే చెప్పాలి. మహేష్‌బాబు నటించిన ‘నేనొక్కడినే’ఈ నేపథ్యంలో వచ్చిన సినిమానే. తెలిసీతెలియని వయసులో తల్లిందండ్రులు చనిపోవడంతో ఆంద్యంతం వాళ్లెలా ఉంటారో తెలుసుకునే ప్రయత్నంలోనే ఉంటాడు హీరో. ముఖ్యంగా తండ్రి ఆశయాన్ని నెరవేర్చేందుకు ప్రాణాలనే ఫణంగా పెట్టి పోరాడుతాడు. కానీ భారీ అంచనాల మధ్య విడుదలైన ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. ప్రిన్స్ ఫ్యాన్స్ కి తీవ్ర నిరాశ మిగిల్చింది. విడుదలకు సిద్ధమవుతున్న శ్రీమంతుడు సైతం తండ్రి సెంటిమెంట్ ఆధారంగా రూపుదిద్దుకుందని టాక్.



లేటెస్ట్ గా వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి సైతం అదే రిజల్ట్  ఇచ్చింది. తండ్రి గౌరవాన్ని నిలబెట్టేందుకు సర్వం త్యాగం చేసి రోడ్డున పడిన పాత్రలో బన్నీ మెప్పించలేకపోయాడని విమర్శలు వచ్చాయి. మరోవైపు అపజయం ఎరుగని దర్శకుడిగా పేరుసంపాదించుకున్న త్రివిక్రమ్ మ్యాజిక్ ఎంతమాత్రం పనిచేయలేదు. రికార్డులు తిరగరాస్తుందనుకున్న ఈ చిత్రం ఎవ్వరూ ఊహించని విధంగా నెగిటివ్ రిజల్ట్ ఇచ్చింది. సెంటిమెంట్ మాస్టర్ త్రివిక్రమ్ సైతం తండ్రి సెంటిమెంట్  ని పండించలేకపోయాడనే కామెంట్స్ వచ్చాయి.అయితే తండ్రిగా ప్రకాశ్ రాజ్ మాత్రం ఫుల్ మార్క్స్ సంపాదించుకున్నాడనే చెప్పాలి.


అంతకుముందు వచ్చిన అత్తారింటికి దారేది సైతం ఈ కోవకు చెందినదే. కూతురికోసం తపించిపోతున్న ఓ తండ్రి కోరిక నెరవేర్చడం చుట్టూనే కథాంశం తిరుగుతుంది. చివరికి కూతురి స్పర్శ తగిలేంతవరకూ ఆ తండ్రి పడిన వేదన అంతా ఇంతా కాదు. తప్పుచేసినా క్షమించే  ఏకైకవ్యక్తి తండ్రికాక ఇంకెవరు అని ఆ చిత్రంతో మరోసారి చాటిచెప్పేప్రయత్నం చేశాడు త్రివిక్రమ్. ఈ చిత్రం గందరగోళం మధ్యవిడుదలైనా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.  ఆతర్వాత వచ్చిన గోవిందుడు అందరివాడే సైతం తండ్రి సెంటిమెంట్ అయినా....అంతగా ఆకట్టుకోలేకపోయింది. తండ్రిని కాదనుకొని వచ్చిన కొడుకు మళ్లీ ఆయన్ని చేరుకునేందుకు పడే తాపత్రయం చూసి మాత్రం కళ్లు చెమర్చని వారులేరంటే అతిశయోక్తి కాదు.

వీటన్నింటికన్నా పూర్తిస్ధాయి తండ్రి సెంటిమెంట్ తో వచ్చిన చిత్రం నాన్న. నాన్నగా విమర్శకుల ప్రశంసలందుకున్న విక్రమ్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తెలివితేటలు లేకున్నా, బుద్దిమాంద్యం అయినా తండ్రి ప్రేమలో ఇసుమంతైనా మార్పు ఉండదని చాటిచెప్పిన చిత్రం నాన్న.  సమాజంపై అవగాహన లేకున్నా- తాను బిడ్డకు ఎంతమాత్రం న్యాయం చేస్తున్నాడో తెలుసుకోలేకపోయినా...బిడ్డకోసం తండ్రి పడే తాపత్రయాన్ని కళ్లకు కట్టినట్టు చూపించారు. ఆ చిత్రం షూటింగ్ ముగిసిన తర్వాత కూడా బేబీ సారా...విక్రమ్ ని నాన్న అంటోందంటే ఆ పిలుపులో మాధుర్యం అదే.


ఇక తండ్రి పాత్ర అంటే తెలుగుసినిమాల్లో ప్రకాశ్  రాజ్ కళ్లముందు కనిపిస్తాడు. నూటికి నూరుశాతం తండ్రి పాత్రకు న్యాయం చేసే నటుడాయన. విలక్షణ నటుడు తండ్రిగా చాలా సినిమాల్లో మెప్పించినా ముఖ్యంగా ఆకాశమంత చిత్రం ముందువరుసలో ఉంటుంది. కూతురి పాదాలను అపురూపంగా తాకిన క్షణం నుంచి పెళ్లిచేసుకుని వెల్లిపోతున్నప్పుడు ఆయన పలికించే హావభావాలు ప్రతి తండ్రికి తమబిడ్డ తప్పని సరిగా గుర్తొస్తుంది. అరచేతుల్లో అడుగులు వేయించుకుని నడిపించే తండ్రి తనంతట తాను నడవగలదని తెలిసి కూడా వదిలిపెట్టలేడు. అయినా పిల్లలు....తల్లిదండ్రులుగా మారినా.... తల్లిదండ్రులకు పిల్లలు ఎప్పుడూ చిన్నారులే కదా. ప్రకాశ్ రాజ్ తండ్రిగా నువ్వే నువ్వే, బొమ్మరిల్లు, చిరుత....ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన నటప్రస్థానంలో తండ్రిపాత్రలకే ఎక్కువ మార్కులు.

ఏదిఏమైనా తల్లి సెంటిమెంట్ ని చూసి తొందరగా కరిగే ప్రేక్షకులకు తండ్రి సెంటిమెంట్ కాస్త తక్కువనే చెప్పాలి. అయితే చెప్పేవిధంగా చెబితే తండ్రి సెంటిమెంట్ సైతం పేలుతుందనేందుకు అత్తారింటికి దారేది, నాన్న, నువ్వేనువ్వే నిదర్శనం. మరి రానున్న నాన్న సెంటిమెంట్ సినిమాలు ఎలా ఉండబోతున్నాయో.....చూద్దాం....

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.