రోజురోజుకి దిగజారుతున్న టాలీవుడ్ ఫ్యాన్స్!
on Aug 18, 2025

సినీ హీరోల అభిమానుల మధ్య గొడవలు అనేవి ఇప్పటివి కావు. ఎన్టీఆర్, ఏఎన్నార్ కాలం నుంచే ఈ ట్రెండ్ ఉంది. కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ అభిమానులు ఆ ట్రెండ్ ను కొనసాగించారు. ప్రస్తుతం అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్, రామ్ చరణ్ వంటి హీరోల ట్రెండ్ నడుస్తోంది. అయితే అభిమానుల తీరు మాత్రం.. అప్పటితో పోలిస్తే ఇప్పుడు రోజురోజుకి దిగజారుగుతోంది.
ఒకప్పుడు వేరే హీరో కంటే తమ హీరో సినిమా పెద్ద హిట్ కావాలని అభిమానులు కోరుకునేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితి అలా లేదు. తమ హీరో సినిమా ఏమైనా పరవాలేదు.. వేరే హీరో సినిమా మాత్రం హిట్ కాకూడదన్న అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా ఈ సోషల్ మీడియా యుగంలో పరిస్థితి రోజురోజుకి దారుణంగా తయారవుతోంది.
ఒక హీరో సినిమా విడుదలవుతుందంటే చాలు.. మిగతా హీరోల అభిమానులంతా ఏకమై.. ఆ సినిమా మీద నెగటివ్ క్యాంపెయిన్ చేస్తున్నారు. దాని వల్ల ఆ హీరో సినిమాకి నష్టం కలిగించామని అప్పటికి ఆనందపడుతున్నారు కానీ.. ఆ తర్వాత తమ హీరో సినిమాకి కూడా అదే పరిస్థితి వస్తుందనే విషయాన్ని గుర్తించలేకపోతున్నారు.
అప్పట్లో తాము అభిమానించే హీరో ఎవరైనా కానీ.. ఇతర హీరోల సినిమాలు కూడా ఎంతో కొంత చూసేవారు. ఎందుకంటే సినిమాల మీద ఇష్టం అలాంటిది. కానీ, ఇప్పుడలా లేదు. వేరే హీరోల సినిమాలు చూడటం దేవుడెరుగు.. ఆ సినిమాలను ఎలా చంపాలా అని చూస్తున్నారు. దాంతో సినిమాకి కొంచెం టాక్ అటూ ఇటూ అయినా రెండో రోజుకే కలెక్షన్లు డ్రాప్ అవుతున్నాయి. ఈ ఏడాది విడుదలైన పలు స్టార్ హీరోల సినిమాలకు ఇదే పరిస్థితి ఎదురైంది.
ఇకనైనా అభిమానుల తీరు మారాలి. తమ హీరో సినిమా ఆడాలి అనుకోవాలి కానీ.. ఇతర హీరోల సినిమాలను చంపేసే ప్రయత్నం చేయకూడదు. దాని వల్ల హీరోలకు కలిగే నష్టం కంటే కూడా.. నిర్మాతలకు, పరిశ్రమకు కలిగే నష్టమే ఎక్కువ. సినీ అభిమానులు ఈ విషయాన్ని ఎంత త్వరగా గుర్తిస్తే టాలీవుడ్ కి అంత మంచిది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



