'ప్రాజెక్ట్ కె'.. ప్రభాస్ రోల్ అదేనా!
on Oct 16, 2021
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన కెరీర్ లోనే ఫస్ట్ టైమ్ ఓ సైన్స్ ఫిక్షన్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. `ప్రాజెక్ట్ కె` పేరుతో రూపొందుతున్న ఈ టైమ్ ట్రావెల్ మూవీలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఓ ముఖ్య పాత్రలో దర్శనమివ్వనుండగా.. బాలీవుడ్ దివా దీపికా పదుకోణ్ కథానాయికగా కనిపించనుంది. `మహానటి` ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ పాన్ - వరల్డ్ మూవీని వైజయంతీ మూవీస్ పతాకంపై సి. అశ్వనీదత్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే కొంతమేర చిత్రీకరణ జరుపుకున్న ఈ భారీ బడ్జెట్ వెంచర్.. నవంబర్ నుంచి 13 నెలల పాటు ఏకధాటిగా షూటింగ్ జరుపుకోనుంది.
ఇదిలా ఉంటే... ఈ సినిమాలో ప్రభాస్ పాత్రకి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే.. ఇందులో ఓ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా దర్శనమివ్వనున్నారట ప్రభాస్. అంతేకాదు.. ఈ పాత్రకి ఓ స్పెషల్ మేనరిజమ్ కూడా ఉంటుందని బజ్. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే. కాగా, మిక్కీ జే మేయర్ స్వరాలు సమకూర్చుతున్న `ప్రాజెక్ట్ కె`.. 2023 వేసవిలో థియేటర్స్ లోకి రానుంది. అన్నట్టు.. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న `స్పిరిట్`లోనూ ప్రభాస్ ఓ సూపర్ కాప్ గా కనిపిస్తారని కొద్దిరోజుల క్రితం కథనాలు వచ్చాయి.
Also Read