బాలయ్య సినిమాని ఫ్యాన్స్ లైట్ తీసుకున్నారా!
on Jun 9, 2023
గత కొద్ది నెలలుగా పలువురు స్టార్ హీరోల సినిమాలు రీరిలీజ్ అయ్యి మంచి వసూళ్లతో సత్తా చాటాయి. అందులో నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన 'చెన్నకేశవరెడ్డి' కూడా ఉంది. అప్పట్లో ఆ సినిమా ఆశించినస్థాయిలో సంచలనాలు సృష్టించనప్పటికీ బాలయ్య ఫ్యాన్స్ కి ఆ సినిమాపై ప్రత్యేక అభిమానం ఉంది. అందుకే రీరిలీజ్ లో బ్రహ్మరథం పట్టారు. అయితే బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలవడమే కాకుండా, ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన 'నరసింహనాయుడు' రీరిలీజ్ అవుతుంటే మాత్రం ఫ్యాన్స్ పెద్దగా ఆసక్తి చూపించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
టాలీవుడ్ లో ఉన్న బిగ్గెస్ట్ మాస్ హీరోలలో బాలయ్య ఒకరు. ఆయన సినిమాలకు మాస్ లో ఉండే క్రేజే వేరు. ఆయనకు అంతటి మాస్ ఇమేజ్ తీసుకొచ్చిన సినిమాలలో 'నరసింహనాయుడు' ఒకటి. 1999 లో 'సమరసింహా రెడ్డి'తో ఇండస్ట్రీ హిట్ కొట్టిన బాలకృష్ణ-బి.గోపాల్ కాంబినేషన్ రెండేళ్లకే 'నరసింహ నాయుడు'(2001) రూపంలో మరో ఇండస్ట్రీ హిట్ కొట్టారు. అప్పట్లో 'నరసింహ నాయుడు' సృష్టించిన సంచలనం అంతాఇంతా కాదు. పవర్ ఫుల్ డైలాగ్ లకి, అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలకు మాస్ ప్రేక్షకులు ఊగిపోయారు. ఇప్పుడు ఆ సినిమాని 22 ఏళ్ళ తర్వాత బాలకృష్ణ పుట్టినరోజు కానుకగా జూన్ 10న రీరిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా రీరిలీజ్ లో 'చెన్నకేశవరెడ్డి'కి మించిన ప్రభంజనం సృష్టించడం ఖాయమని భావించారంతా. అయితే ఇప్పుడు ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కి అంతగా రెస్పాన్స్ రాకపోవం షాక్ కి గురి చేస్తోంది. సడెన్ గా రిలీజ్ డేట్ ప్రకటించడం, పెద్దగా ప్రమోషన్స్ లేకపోవడం ఈ పరిస్థితికి కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి అడ్వాన్స్ బుకింగ్స్ తో సంబంధం లేకుండా రేపు నేరుగా థియేటర్ల దగ్గర మాస్ సెలబ్రేషన్స్ కనిపిస్తాయేమో చూడాలి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
