విశ్వంభర స్టోరీ చెప్పేసిన డైరెక్టర్.. స్టోరీ వింటే పిచ్చెక్కిపోయిద్ది!
on Jul 18, 2025

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'విశ్వంభర'. యు.వి. క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సోషియో ఫాంటసీ ఫిల్మ్ కి 'బింబిసార' ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకుడు. 'జగదేకవీరుడు అతిలోకసుందరి' తర్వాత చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ ఫిల్మ్ కావడంతో.. 'విశ్వంభర' ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. నిజానికి ఈ ఏడాది ప్రారంభంలోనే మూవీ విడుదల కావాల్సి ఉండగా.. వీఎఫ్ఎక్స్ వర్క్ కారణంగా వాయిదా పడింది. సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది. ఇదిలా ఉంటే అసలు 'విశ్వంభర' కథ ఎలా ఉండబోతుందో తాజాగా దర్శకుడు వశిష్ట రివీల్ చేశాడు.
"మనకు 14 లోకాలు తెలుసు. ఈ 14 లోకాలు కాకుండా మరో లోకం ఉంది. అదే బ్రహ్మదేవుడు ఉండే సత్యలోకం. హీరో 14 లోకాలు దాటుకొని.. ఆ లోకానికి వెళ్లి.. అక్కడ్నుంచి హీరోయిన్ ని భూమ్మీదకు ఎలా తీసుకొచ్చాడు అనేదే ఈ చిత్ర కథ" అని దర్శకుడు వశిష్ట చెప్పుకొచ్చాడు.
'జగదేకవీరుడు అతిలోకసుందరి' సినిమాలో.. హీరోయిన్ స్వర్గలోకం నుంచి భూమ్మీదకు వస్తుంది. అయితే 'విశ్వంభర'లో మాత్రం హీరోయిన్ కోసం హీరోనే సత్యలోకానికి వెళ్తాడు. మరి దానిని దర్శకుడు ఎంత ఆసక్తికరంగా మలిచాడు అనేది చూడాలి.
అంతేకాదు, 'విశ్వంభర'కు సంబంధించి మరిన్ని విషయాలను పంచుకున్నాడు దర్శకుడు వశిష్ట. ఇందులో చిరంజీవి పాత్ర పేరు దొరబాబు అని చెప్పాడు. ఫస్ట్ హాఫ్ లో మెగా అభిమానులు కోరుకునే వినోదం ఉంటుందని, ఇక సెకండ్ హాఫ్ సత్యలోకం ప్రధానంగా సాగుతుందని తెలిపాడు. సత్యలోకంలో పంచభూతాల మాదిరిగా ఐదు ప్రపంచాలు ఉంటాయని అన్నాడు. దాదాపు 70 శాతం వీఎఫ్ఎక్స్ సన్నివేశాలు ఉంటాయట. రెక్కల గుర్రం, రెండు తోకల ఉడత సహా ఎన్నో వింత జంతువులు సినిమాలో ఉంటాయని అన్నాడు. అలాగే రావురమేష్ జీనీ తరహా పాత్రలో కొత్తగా కనిపిస్తాడని వశిష్ట చెప్పాడు.
హీరోయిన్ ని భూలోకానికి తీసుకొని రావడం కోసం హీరో సత్యలోకానికి వెళ్తాడు. అదే మెయిన్ స్టోరీ. ఇందులో హీరోయిన్ గా త్రిష నటిస్తోంది కాబట్టి.. ఆమె చుట్టూనే కథ తిరుగుతుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
సాంగ్స్ గురించి కూడా చెప్పాడు దర్శకుడు. మొత్తం నాలుగు పాటలు ఉంటాయట. ఇప్పటికే "రామ రామ" అనే సాంగ్ విడుదలైంది. ఇది కాకుండా.. మరో మూడు సాంగ్స్ ఉంటాయి. అవి మ్యారేజ్ సాంగ్, మాంటేజ్ సాంగ్, స్పెషల్ సాంగ్. ఈ పాటలన్నీ వేటికవే ప్రత్యేకంగా ఉంటాయట.
అలాగే ఇందులో "కొడితే దవడ అవడ ఐపోయిద్ది" అనే డైలాగ్ ను చిరంజీవికి ఊతపదంలా పెట్టారట. అప్పట్లో చిరంజీవి సినిమాల్లో ఇలాంటి ఊతపదాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవి. ఇప్పుడు ఆ ట్రెండ్ ని మళ్ళీ తీసుకురాబోతున్నారని అర్థమవుతోంది.
రీసెంట్ ఇంటర్వ్యూలో దర్శకుడు వశిష్ట 'విశ్వంభర' గురించి ఇన్ని విశేషాలు పంచుకోవడంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. స్టోరీ అద్భుతంగా ఉందని ప్రశంసిస్తున్నారు. అయితే కొందరు ఫ్యాన్స్ మాత్రం.. ఇలా మొత్తం స్టోరీని ముందే రివీల్ చేయడాన్ని తప్పుబడుతున్నారు. థియేటర్లో నేరుగా చూసి ఎక్సైట్ అయ్యే విషయాలను కూడా ఇలా ముందే రివీల్ చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



