ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి డైరెక్టర్ మారుతి క్షమాపణలు!
on Nov 24, 2025

రాజా సాబ్ సాంగ్ లాంచ్ ఈవెంట్
ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని హర్ట్ చేసిన మారుతి స్పీచ్
క్షమాపణలు చెప్పిన రాజా సాబ్ డైరెక్టర్
టాలీవుడ్ లో "కాలర్ ఎగరేసి చెప్తున్నా" అనే మాట వింటే.. మొదట గుర్తుకొచ్చే పేరు జూనియర్ ఎన్టీఆర్(Jr NTR). 'టెంపర్' సినిమా నుండి ఈ ట్రెండ్ స్టార్ట్ అయింది. ఆ మూవీ ఈవెంట్ లో "అభిమానులు కాలర్ ఎగరేసుకునే సినిమాలు చేస్తాను" అని ఎన్టీఆర్ మాట ఇచ్చాడు. అన్నట్టుగానే అప్పటినుండి వరుస విజయాలు అందుకున్నాడు. అయితే ఎన్టీఆర్ నటించిన బాలీవుడ్ మూవీ 'వార్-2' విషయంలో ఈ సెంటిమెంట్ వర్కౌట్ కాలేదు. వార్-2 హిట్ అవుతుందని, ఆ సినిమా ఈవెంట్ లో ఎన్టీఆర్ కాలర్ ఎగరేసి చెప్పాడు. కానీ, ఆ సినిమా నిరాశపరిచింది. దీంతో ఎన్టీఆర్ కాలర్ సెంటిమెంట్ కి బ్రేక్ పడింది. ఇదిలా ఉంటే, తాజాగా ఈ కాలర్ డైలాగ్ పై డైరెక్టర్ మారుతి చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ది రాజా సాబ్'(The Raja Saab). పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ హారర్ కామెడీ ఫిల్మ్.. సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ నుండి ఫస్ట్ సింగిల్ విడుదలైంది.
ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో 'ది రాజా సాబ్' సినిమా ఓ రేంజ్ లో ఉండబోతుందని.. ప్రభాస్ అభిమానులకు మారుతి హామీ ఇస్తూ.. "మీ అందరూ పండగకి.. కాలర్ ఎగరేసుకుంటారు ఇలాంటివి చెప్పను.. ఎందుకంటే, ప్రభాస్ గారి కటౌట్ కి అవి చాలా చిన్న మాటలు అయిపోతాయి." అన్నాడు.
అయితే మారుతి చేసిన కామెంట్స్ ఎన్టీఆర్ ని టార్గెట్ చేసినట్టుగా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యాంటీ ఫ్యాన్స్ ఈ వీడియో క్లిప్ ని వైరల్ చేస్తూ.. ఎన్టీఆర్ ని ట్రోల్ చేస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా మారుతి తీరుని తప్పుబడుతూ విమర్శలు గుప్పిస్తున్నారు.
తన మాటలు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని హర్ట్ చేశాయని గ్రహించిన మారుతి.. సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పాడు. "ముందుగా ప్రతి అభిమానికి హృదయపూర్వకంగా క్షమాపణలు చెబుతున్నాను. ఎవరినీ బాధపెట్టడం లేదా అగౌరవపరచడం నా ఉద్దేశ్యం కాదు. కొన్నిసార్లు మాటల ప్రవాహంలో మనం చెప్పాలనుకున్న దానికి భిన్నంగా మాటలు బయటకు వస్తాయి. నా భావం తప్పుగా చేరినందుకు నిజంగా చింతిస్తున్నాను. నాకు ఎన్టీఆర్ గారు, ఆయన అభిమానుల పట్ల అపారమైన గౌరవం ఉంది. సినిమా పట్ల, మీ హీరో పట్ల మీరు చూపే ప్రేమకు నేను నిజంగా విలువ ఇస్తాను. నేను ఈ మాటలను పూర్తి నిజాయితీతో, హృదయపూర్వకంగా చెబుతున్నాను. ఈ పరిస్థితిని, దాని వెనుక ఉన్న నా ఉద్దేశాన్ని మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను." అని మారుతి రాసుకొచ్చాడు.
వివాదం మరింత ముదరక ముందే.. మారుతి సరైన సమయంలో స్పందించాడు. దీంతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



