దర్శకుడి బూతులు... హీరోల వార్నింగులు!
on Oct 30, 2018
ఇటీవల 'వీరభోగ వసంత రాయులు' అని ఒక అద్భుత ఖళాఖండం ఒకటి విడుదలైంది. 'కళ' బదులు 'ఖళ' అని ఎందుకు రాయవలసి వచ్చిందంటే... సినిమాలో అసలు కళ లేదు. విడుదలైన రోజు సాయంత్రం ఆటకు చాలా ఏరియాల్లో సినిమాను ఎత్తేశారు. ఇండియాలో విడుదలకు మూడు రోజుల ముందు అమెరికాలో సినిమాను విడుదల చేస్తే... అక్కడా అదే పరిస్థితి. విమర్శకులకు కూడా సినిమా నచ్చలేదు. రేటింగులు తక్కువ ఇచ్చారు. దాంతో విమర్శకులపై దర్శకుడు ఇంద్రసేన తన అక్కసు వెళ్ళగక్కాడు. 'ఫక్ ఆల్ రివ్యూస్' అని ఒక పోస్టర్ విడుదల చేశాడు. అది చూసి ప్రేక్షకులతో పాటు హీరోలు కూడా అవాక్కయ్యారు.
విమర్శలు అనేవి సహజం. వాటిని జీర్ణించుకోలేకపోతే ఎలా? సినిమా నచ్చకపోతే విమర్శించే హక్కు ఎవరికీ లేదా? రివ్యూల్లో తక్కువ రేటింగులు ఇచ్చిన సినిమాలు ఆడలేదు... ఎక్కువ రేటింగులు ఇచ్చిన సినిమాలు ఎన్ని పోలేదు... ఇవన్నీ పట్టించుకోకుండా కేవలం రివ్యూల వలన తన సినిమా పోయిందని అనుకోవడం ఎంతవరకూ కరెక్ట్!? 'ఫక్' అంటూ పోస్టర్లలో బూతులు తిట్టడాన్ని ఏమనాలి? సినిమాలో నటించిన నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రీవిష్ణు... హీరోలు ముగ్గురూ దర్శకుడు ఇంద్రసేనకు ఫోనులు చేసి వార్నింగులు ఇచ్చారని టాక్. ఇంకోసారి ఇలా చేయవద్దని చెప్పార్ట. శ్రీవిష్ణు దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. తనకు విమర్శకులపై గౌరవం వుందని ట్వీట్ చేశారు. సినిమాకు ముందు నుంచి దూరంగా ఉంటున్న సుధీర్ బాబు దర్శకుడి చర్యపై మౌనం వహించారు.