త్రివిక్రమ్ తో 'హిరణ్యకశ్యప' ప్రకటించిన రానా.. గుణశేఖర్ ఫైర్!
on Jul 20, 2023

'హిరణ్యకశ్యప' చిత్రం అనేది దర్శకుడు గుణశేఖర్ డ్రీమ్ ప్రాజెక్ట్. ఆ సినిమాని రానా దగ్గుబాటితో చేయాలని గుణశేఖర్ ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. రానా కూడా ఆసక్తి చూపడంతో చాలాకాలం స్క్రిప్ట్ మీద వర్క్ చేశారు గుణశేఖర్. అయితే దర్శకుడిగా ఇప్పుడాయన ట్రాక్ రికార్డు బాగాలేదు. ఆయన గత చిత్రం 'శాకుంతలం' దారుణంగా నిరాశపరిచింది. వీఎఫ్ఎక్స్ నాసిరకంగా ఉందంటూ ట్రోల్స్ కూడా వచ్చాయి. దీంతో గుణశేఖర్ గ్రాఫిక్స్ ఉండే ఇలాంటి భారీ చిత్రాల జోలికి పోకుండా 'ఒక్కడు' తరహా కమర్షియల్ సినిమాతో కమ్ బ్యాక్ ఇస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అదే సమయంలో గుణశేఖర్ తో రానా 'హిరణ్యకశ్యప' సినిమా చేయడం సందేహమే అనే కామెంట్స్ వినిపించాయి. ఊహించినట్టుగానే గుణశేఖర్ పేరు లేకుండా రానా 'హిరణ్యకశ్యప' సినిమాని ప్రకటించారు.
తాజాగా రానా 'హిరణ్యకశ్యప' సినిమాని అనౌన్స్ చేశారు. త్రివిక్రమ్ ఈ చిత్రానికి రచయితగా వ్యవహరిస్తున్నారు. కానీ దర్శకుడు ఎవరనే విషయాన్ని మాత్రం రివీల్ చేయలేదు. అయితే గుణశేఖర్ మాత్రం డైరెక్టర్ కాదనే విషయంపై క్లారిటీ వచ్చేసింది. ఎందుకంటే సోషల్ మీడియాలో గుణశేఖర్ పరోక్షంగా తన అసహనాన్ని వ్యక్తం చేశారు. "దేవుడిని ఇతివృత్తంగా చేసుకుని మీరు కథ తయారు చేస్తున్నప్పుడు, ఆ దేవుడు మీ చిత్తశుద్ధిని గమనిస్తుంటాడని మరిచిపోవద్దు. అనైతిక చర్యలకు నైతిక మార్గాల ద్వారా సమాధానం ఇవ్వబడుతుంది" అని ట్వీట్ చేశారు. రానా 'హిరణ్యకశ్యప' ప్రాజెక్ట్ ని ప్రకటించగా, గుణశేఖర్ పరోక్షంగా అసహనం వ్యక్తం చేయడం హాట్ టాపిక్ గా మారింది. మరి గుణశేఖర్ కలల ప్రాజెక్ట్ కి ఎవరు డైరెక్ట్ చేస్తారో చూడాలి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



