పవన్ కల్యాణ్ డేట్స్ కన్ఫర్మ్ చేయాలి
on Nov 25, 2019
పవన్ కల్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో హిందీ హిట్ 'పింక్'ను తెలుగులో రీమేక్ చేస్తున్నట్టు దిల్ రాజు స్పష్టం చేశారు. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో "నాకు చిరకాలంగా రెండు కోరికలు ఉన్నాయి. ఒకటి... పవన్ కల్యాణ్ తో సినిమా చేయాలని. రెండు... హిందీలో సినిమా నిర్మించాలని. ఈ రెండూ వచ్చే ఏడాది నెరవేరబోతున్నాయి" అని దిల్ రాజు చెప్పారు. ఇక్కడో మెలిక ఉంది.
పవన్ కల్యాణ్ తో సినిమా చేస్తున్నామని చెప్పారు కానీ, తమ సినిమాయే పవన్ రీ ఎంట్రీ సినిమా అని దిల్ రాజు చెప్పలేదు. పైగా, పవన్ కల్యాణ్ డైట్స్, వగైరా కన్ఫర్మ్ చేయాల్సి ఉందనీ, ఆ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తున్నామనీ, ఆయన కన్ఫర్మ్ చేశాక పూర్తి వివరాలు వెల్లడిస్తామనీ దిల్ రాజు అంటున్నారు. అక్కడే పవన్ అభిమానులకు, ప్రేక్షకులకు అనుమానాలు వస్తున్నాయి. క్రిష్ దర్శకత్వంలోనూ పవన్ సినిమా చేస్తారని వార్తలు వచ్చాయి. దర్శకులు త్రివిక్రమ్, హరీష్ శంకర్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరి సినిమా ముందు ఉంటుందో? ఎవరి సినిమా వెనుక ఉంటుందో? మొత్తానికి ఒక్కటి మాత్రం క్లియర్... పవన్ మళ్లీ సినిమాల్లోకి వస్తున్నారు. ఇంతకుముందు రామ్ చరణ్ కూడా "బాబాయ్ కథలు వింటున్నారు" అని చెప్పిన సంగతి తెలిసిందే.