మైకు విసిరొట్టి...కోపంగా వెళ్లిపోయాడు
on Jul 24, 2017
ధనుష్ కి కోపమొచ్చింది. ఇంటర్వ్యూ చేస్తున్న టీవీ జర్నలిస్ట్ పై అంతెత్తు లేచాడు. అంతటితో ఆగలేదు. మైక్ విసిరికొట్టి...‘ఇదొ చెత్త ఇంటర్వ్యూ’ అంటూ వెళ్లిపోయాడు.
ఈ ఉదాంతం మొత్తం జరిగింది చెన్నయ్ లో కాదు. మన హైదరాబాద్ లోనే... తను నటించిన ‘విఐపీ2’ చిత్రం త్వరలో విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ధనుష్, నిర్మాత సౌందర్య, బాలీవుడ్ స్టార్ కాజోల్ హైదరాబాద్ లో హల్ చల్ చేశారు. వరుసగా ఇంటర్వ్యూలతో బిజీ బిజీగా గడిపారు. అంతా సజావుగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో... ఓ ప్రముఖ ఛానల్ కి సంబంధించిన టీవీ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నలు ధనుష్ ఓర్పును పరీక్షించాయి. వివరాల్లోకెళ్తే...
ఈ ఇంటర్వ్యూ చేసిన లేడీ జర్నలిస్ట్... తొలుత సినిమాకు సంబంధించిన ప్రశ్నలే సంధించింది. తర్వాత్తర్వాత... ఆమె ప్రశ్నలు ధనుష్ వ్యక్తిగత అంశాలపై మళ్లాయి. ముఖ్యంగా ఆమె టార్గెట్ అంశం ‘సుచీలీక్స్’. ప్రస్తుతం డ్రగ్స్ రాకెట్ తెలుగు చిత్రసీమను కుదిపేస్తుంటే... ఈ ‘సుచీలీక్స్’ అనే అంశం మొన్నటి వరకూ తమిళ చిత్రసీమలో భూకంపం సృష్టించింది. గాయని సుచిత్ర తన ట్విట్టర్ ద్వారా.. ధనుష్, సంగీత దర్శకుడు అనిరుథ్, రానా, త్రిష, ఆండ్రియా తదితరులపై చేసిన ఆరోపణలు... పోస్ట్ చేసిన ఫొటోలు తమిళ నాట మొన్నటివరకూ పెద్ద దుమారమే రేపాయి.
‘ధనుష్, సంగీత దర్శకుడు అనిరుథ్ కలిసి పబ్ లో నాకు మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి తెగబడ్డారు’ అని కూడా సుచిత్ర ఆ ట్విట్టర్ ద్వారా పేర్కొంది. అయితే... మళ్లీ... ఏమైందో ఏమో... ‘నా ట్విట్టర్ ఎకౌంట్ ని ఎవరో హ్యాక్ చేశారు. నేను ఆ పోస్ట్లులు పెట్టలేదు’అని సుచిత్ర మీడియా ముందు వివరణ ఇచ్చింది. దాంతో ఆ గొడవ సద్దుమణిగింది. అయితే... కారణం తెలీదు కానీ... ధనుష్ అతని భార్య ఐశ్వర్య ఇటీవలే విడాకులు తీసుకున్నారు. ఇవన్నీ ఒకదానితో ఒకటి లింకునన వ్యవహారాలుగా కనిపించడంతో... ఆ లేడీ జర్నలిస్ట్ ఈ విషయాలన్నీ ప్రశ్నల రూపంలో సంధించింది.
తొలి ప్రశ్న.. ‘సుచీ లీక్స్’ వ్యవహారంతో మీరు మానసిక వేదనకు గురయ్యారట కదా? అని. దానికి ‘నేను మానసిక వేదనకు గురైనట్టు నీకు ఎవరు చెప్పారు?’ అని ఎదురు దాడికి దిగాడు ధనుష్. ‘సుచిత్ర ట్విట్టర్లో మీ ఫొటోలు కూడా పోస్ట్ చేసింది కదా?’ అని ఆమె అడగ్గానే... అసహనం వ్యక్తం చేస్తూ కూర్చున్న చోటు నుంచి పైకి లేచాడు ధనుష్. అయినా.. ఆ విలేఖరి ఆగలేదు. ‘సుచీ లీక్స్’ వ్యవహారం.. మీ దాంపత్య జీవితంపై కూడా ప్రభావం చూపిందని.. మీరు విడిపోవడానికి కారణం అయ్యిందనీ...’ అని అడగబోతుంటే... అందరికీ షాక్ ఇస్తూ... ధనుష్ మైక్ విసిరికొట్టాడట. ‘ఇదో చెత్త ఇంటర్వ్యూ’ అని అక్కడ్నుంచి కోపంగా వెళ్లిపోయాడట. అంతే... అవాక్కవ్వడం అక్కడున్నవారి వంతైంది. ఈ వ్యవహారం తెలిసిన వారందరూ... అసలు వివాదాల్లో ఇరుక్కోవడం దేనికీ? తర్వాత ఈ అసహనం దేనికీ? అంటూ చెవులు కొరుక్కుంటున్నారు. పాపం ధనుష్.