ENGLISH | TELUGU  

దేవ్ మూవీ రివ్యూ

on Feb 14, 2019

 

నటీనటులు: కార్తీ, రకుల్, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, నిక్కీ గల్రాని తదితరులు
నిర్మాణ సంస్థలు: ప్రిన్స్ పిక్చర్స్, లైట్ హౌస్ మూవీ మేకర్స్, రిలయన్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌
కెమెరా: ఆర్ వేల్‌రాజ్‌
సంగీతం: హారీస్ జయరాజ్
నిర్మాత‌లు: ఎస్. లక్ష్మణ్ కుమార్, 'ఠాగూర్' మధు
ద‌ర్శ‌క‌త్వం: రజత్ రవిశంకర్
విడుదల తేదీ: ఫిబ్రవరి 14, 2019

కార్తీకి తెలుగులో ఒకప్పుడు మంచి మార్కెట్ ఉండేది. ఇక్కడి యంగ్ హీరోలతో సమానంగా స్టార్‌డ‌మ్‌, ఫ్యాన్ బేస్ ఎంజాయ్ చేశాడు. వరుసపెట్టి ఫ్లాపులు పలకరించడంతో తెలుగునాట కార్తీ మార్కెట్ కిందకు పడింది. మళ్ళీ 'ఖాకీ' హిట్‌తో కాస్త పైకి లేచింది. 'ఖాకీ' తరవాత వచ్చిన 'చినబాబు' ఆశించిన విజయాన్ని ఇవ్వలేదు. మరి, ప్రేమికుల రోజున వచ్చిన 'దేవ్' ఎలా ఉంది? రివ్యూ చదివి తెలుసుకోండి.  

క‌థ‌:

జీవితంలో ఎవరికీ నచ్చినట్టు వారు ఉండాలనేది దేవ్ రామలింగం (కార్తీ) ఫిలాసఫీ. ఎటువంటి బరువు బాధ్యతలు లేకుండా అడ్వెంచర్స్ చేస్తూ సంతోషంగా గడిపేస్తుంటారు. అటువంటి దేవ్ ఫేస్‌బుక్‌లో మేఘన (రకుల్ ప్రీత్ సింగ్)ని చూసి ప్రేమలో పడతాడు. అమెరికాలో ఉద్యోగం చేసే మేఘనకు ప్రేమ, పెళ్లిపై నమ్మకం ఉండదు. తన తల్లిని ప్రేమ పేరుతో ఒకరు మోసం చేయడంతో మగాళ్లను ద్వేషిస్తుంది. మగాళ్లు అందరూ ఒకేలా ఉంటారని దేవ్ ప్రేమను తిరస్కరిస్తుంది. మెల్లమెల్లగా దేవ్ మంచితనం చూసి ప్రేమలో పడుతుంది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటున్న తరుణంలో... దేవ్‌కి దూరంగా వెళుతుంది మేఘ‌న‌. అతడికి దూరం కావడానికి కారణాలు ఏంటి? మేఘన వెళ్లిన తరవాత దేవ్ జీవితంలో ఏం జరిగింది? ప్రేమ కోసం దేవ్ ఏం చేశాడు? చివరకు ఇద్దరూ ఎలా ఒక్కటయ్యారు? అనేది సినిమా.   

విశ్లేషణ:

సజాతి ధ్రువాలు వికర్షించుకుంటాయి. విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయి. స్కూల్‌లో ప్ర‌తి ఒక్క‌రూ ఈ పాఠం తప్పకుండా చదివే ఉంటారు. విజాతి ధ్రువాలు ఎందుకు ఆకర్షించుకుంటాయనే అంశం విద్యార్థుల్లో ఆసక్తి కలిగిస్తుంది. సినిమాల్లోనూ అంతే! భిన్నమైన వ్యక్తిత్వాలు గల ఇద్దరు వ్యక్తులు ప్రేమలో పడితే చివరకు ఏమవుతుందనే అంశం ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగిస్తుంది. ఈ సినిమా ప్రారంభంలో ప్రేక్షకుల్లో అటువంటి ఆసక్తి ఉంటుంది. అడ్వెంచర్స్ ఇష్టపడే ఓ కుర్రాడు దేవ్. మన మనసుకు నచ్చింది చేయాలని చెబుతుంటాడు. ప్రేమంటే నమ్మకం లేని ఓ అమ్మాయి మేఘన. ఉద్యోగమే ప్రపంచంగా బతుకుతూ ఉంటుంది. కథ ప్రారంభంలో ఈ క్యారెక్టరైజేషన్లు ఆసక్తి కలిగిస్తాయి. అయితే... క్యారెక్టరైజేషన్లకు తగ్గ సన్నివేశాలు సినిమాలో పడలేదు. పైగా, క్యారెక్టరైజేషన్లు చెప్పడానికి కథను సాగదీశాడు. దాంతో కథ ముందుకు సాగుతున్న కొలదీ విసుగు వస్తుంటుంది. కథలో విషయం లేదనిపిస్తుంది. ఒకానొక దశలో క్యారెక్టరైజేషన్లను కూడా గందరగోళంలో నెట్టేశాడు దర్శకుడు. కథనం కూడా గజిబిజిగా ఉంటుంది. ప్రేమలో పడే సన్నివేశాలు గానీ.. భావోద్వేగభరిత సన్నివేశాలు గానీ.. కామెడీ సీన్స్ గానీ... ఒక్కటంటే ఒక్కటి కూడా ఆకట్టుకోలేదు. సినిమాలో ప్రతి సన్నివేశం ఆర్టిఫిషియ‌ల్‌గా ఉంటుంది. తెరపైది జరిగేది నిజమని నమ్మేట్టు ఎక్కడా అనిపించదు. అందువల్ల, సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ కాదు. సన్నివేశాలు బోరింగ్ అయినప్పటికీ... సినిమాటోగ్రఫీ, లొకేషన్స్, పలుచోట్ల నేపథ్య సంగీతం బావున్నాయి.

ప్లస్ పాయింట్స్:

ఛాయాగ్రహణం
నేపథ్య సంగీతం   

మైనస్ పాయింట్స్:

కథ, సన్నివేశాలు, దర్శకత్వం
క్యారెక్ట‌రైజేష‌న్ల‌లో గంద‌ర‌గోళం
పాటలు  

నటీనటుల పనితీరు:

కార్తీలో నటుడికి పని కల్పించే సన్నివేశాలు ఈ సినిమాలో లేవు. అందువల్ల, పలు సన్నివేశాల్లో ఏం చేయాలో? ఎలా నటించాలో? తెలియని నిస్సహాయ స్థితిలో కార్తీ నిలబడ్డాడు. 'జులాయి'లో 'కరువొచ్చిన కంట్రీకి బ్రాండ్ అంబాసిడర్ లా ఉంది' అని ఇలియానాపై త్రివిక్రమ్ ఓ డైలాగ్ రాశాడు. ఇందులో రకుల్ ని చూస్తే ఆ డైలాగ్ గుర్తుకు వస్తుంది. మరీ సన్నగా అందం ఆవిరైన అమ్మాయిలా కనిపించింది. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ వంటి ప్రతిభావంతులైన నటులను ఉపయోగించుకోవడంలో దర్శకుడు విఫలమయ్యాడు. మిగతా నటులు ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించారు.

చివరగా:

ఈ సినిమాలో అడ్వెంచర్స్ (సాహసాలు) చేసే యువకుడిగా కార్తీ నటించారు. సినిమాలో ఆయన చేసిన సాహసాలు పక్కన పెడితే... నిస్సారమైన సన్నివేశాలు, బలహీనమైన కథతో వచ్చిన దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కార్తీ చేసిన పెద్ద సాహసం. ఇంత తెలిసీ ఈ సినిమాకు ప్రేక్షకులు వెళ్లాలనుకోవడం దుస్సాహసం. తమ సహనానికి తామే పరీక్ష పెట్టుకోవడం! కార్తీ, రకుల్ అభిమానులు అయినా సరే సినిమాకు దూరంగా ఉండటం మంచిది.

రేటింగ్: 1.25/5

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.