ENGLISH | TELUGU  

దాగుడు మూత దండాకోర్‌ రివ్యూ

on May 9, 2015

రీమేక్ అంటే వండిన కూర మ‌ళ్లీ వండ‌డం లాంటిదే.
ఆ రుచి మ‌ళ్లీ వ‌స్తుంద‌న్న గ్యారెంటీ లేదు.
అదృష్టం ఉంటే.. కూర బాగుంటుంది. దినుసులు ఏమాత్రం తేడా వ‌చ్చినా  రుచులు మారిపోతాయి. అరె.. మొన్న బాగా వండావ్‌.. ఈరోజుఇలా `మాడిపోయింది` ఏంటి? అని అడిగితే ఏం చెప్తాం? టైమ్ బ్యాడ్ అంతే!

శైవం సినిమా త‌మిళంతో తెగాడేసింది. డ‌బ్బులొచ్చాయి. అవార్డులూ ద‌క్కాయి. అదే మ్యాజిక్ రిపీట్ చేయ‌డానికి క్రిష్ అండ్ కో ట్రై చేసింది. మ‌రి ఫ‌లితం ఏమైంది?  శైవం అంటే ఈ దాగుడుమూత‌లు బాగుందా, లేదా.. రీమేక్ కూడా ఉడికిందా, మాడిందా?  టేస్ట్ చేద్దాం, రండి.


ఆ ఇంటికే కాదు.. ఊరికే పెద్ద‌.. రాజు గారు.(రాజేంద్ర ప్రసాద్). ఆయ‌న‌ది పేద్ధ‌ ఉమ్మ‌డి కుటుంబం. మ‌న‌వ‌రాలు బంగారం(సారా అర్జున్) అంటే ఆ రాజుగారికి ప్రాణం. ఆ బంగారానికి నాని (కోడిపుంజు) అంటే చాలా చాలా ఇష్టం. ఈ ముగ్గురి మ‌ధ్య ఉన్న అనురాగాలూ, బంధాల‌తో క‌థ మొద‌ల‌వుతుంది. ఆ ఊరి  పోలేరమ్మ జాతరకి ఎక్కడెక్కడో ఉన్న తన  కొడుకులు, కూతుర్లు, వారి పిల్లలు వస్తారు. వీళ్లంతా ఈ జాత‌ర‌ని స‌ర‌దాగా ఎంజాయ్ చేద్దామ‌నుకొంటారు. అయితే ఒకొక్క‌రి జీవితంలో ఒక్కో ఇబ్బంది. ఓ కొడుక్కి వ్యాపారం స‌జావుగా సాగ‌దు. ఒక‌రికి పిల్ల‌ల్లేరు. ఇంకొక‌రి మ‌ధ్య అపార్థాలు. ఓసారి పోలేర‌మ్మ గుడికి పూజ‌కి వెళ్తే అక్క‌డ ఎన్నో అప‌శ‌కునాలు ఎదుర‌వుతాయి. దానంత‌ట‌కీ కార‌ణం ఏంట‌ని ఆరా తీస్తే.. నాని అని తెలుస్తుంది. ఆ నాని పోలేర‌మ్మ మొక్కు. కానీ... కుటుంబం అంతా ఓ చోట లేక‌పోవ‌డంతో ఎప్పుడూ మొక్కు తీర్చ‌డం కుద‌ర్లేదు. నానికి బ‌లిస్తేగానీ.. త‌మ‌కున్న అడ్డంకులు తొల‌గ‌వు.. అనే నిర్ణయానికి వ‌స్తారంతా. సరిగ్గా నానికి పోలేర‌మ్మ‌కి బ‌లిచ్చే స‌మ‌యంలో ఆ కోడి క‌నిపించ‌కుండా మాయ‌మ‌వుతుంది. అప్ప‌టి నుంచీ ఆ ఇంట్లోవాళ్లంతా కోడిని వెదక‌డం మొద‌లెడ‌తారు. కోడి ఆచూకీ కోసం బాబాలొస్తారు. మంత్ర గాళ్లొస్తారు... నానా హంగామా చేస్తారు. మ‌రి నాని ఎక్క‌డ‌కు వెళ్లింది. మాయం చేసిందెవ‌రు?   చివ‌రికి దొరికిందా?  లేదా?  అనేదే క‌థ‌.

త‌మిళంలో ఘ‌న విజ‌యం సాధించి, అవార్డులూ మూట‌గ‌ట్టుకొన్న శైవం చిత్రానికి ఇది రీమేక్‌. సున్నిత‌మైన అంశం చుట్టూ, అంద‌మైన బంధాలతో అల్లుకొన్న ఓ ఉదాత్త‌మైన క‌థ ఇది. ఓ కోడి పుంజు కోసం ఇల్లంతా క‌ల‌తిర‌గ‌డం ఏమిటి?  ఓ ఊరు ఊరంతా దాని గురించే చ‌ర్చించుకోవ‌డం ఏమిటి?  కోడి పుంజు కోసం వెదుకులాట‌లో.. కుటుంబంంలో ఒకొక్క‌రూ త‌మ‌ని తాము స‌రిదిద్దుకోవ‌డం ఏమిట‌టి?  మాంసాహారులంతా శాఖాహారులుగా మారిపోవ‌డం ఏంటి? ఎంత అంద‌మైన కాన్సెప్ట్ ఇది.?  ఈ పాయింట్ త‌మిళ ప్రేక్ష‌కుల‌కు విప‌రీతంగా న‌చ్చింది. అందుకే తెలుగులోనూ రీమేక్ రూపంలో వ‌చ్చింది.  ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ మ‌లినేని త‌న‌కు అనువుగా కొన్ని మార్పులూ చేర్పులూ చేసుకొన్నాడు. తాత - మ‌న‌వ‌రాళ్ల అనుబంధాన్ని  మాతృక‌లోలానే చ‌క్క‌గా తెర‌పై ఆవిష్క‌రించాడు. ఆ ప‌చ్చ‌టి ప‌ల్లెటూరి వాతావ‌ర‌ణం, అక్క‌డున్న అనుబంధాలు ఇంచ‌క్క‌గా చూపించాడు. అయితే ఈ క‌థ‌లో కీల‌క‌మైన విష‌యం.. కోడిమాయ‌మ‌వ్వ‌డం. దాన్ని వెదుక్కొనే క్ర‌మంలో కుటుంబం మొత్తం ఏకం కావ‌డం. అయితే...దీన్ని మ‌న‌సుకి హ‌త్తుకొనేలా మ‌ల‌చ‌లేక‌పోయాడు. తెర‌పై ప్ర‌తి స‌న్నివేశం సుదీర్ఘంగా సాగుతూ పోతుంది. అయితే ఏదీ... మ‌నసు త‌లుపు త‌ట్ట‌కుండానే వెళ్లిపోతోంది. ప్రేక్ష‌కుల చేత‌ కంట‌త‌డి పెట్టించే సంద‌ర్భాలు ద‌ర్శ‌కుడికి చాలా వ‌చ్చాయి. వాటిని ఏమాత్రం ఉప‌యోగించుకోలేదు. అలా చేస్తే... ఈ సినిమా ఫీల్ గుడ్ మూవీ జాబితాలో చేరే అవ‌కాశం ఉండేది. కానీ దాన్నీ చేజార్చుకొన్నాడు. మాంసాహారులంతా శాఖాహారులుగా మారిపోతామ‌ని ప్ర‌తిజ్ఞ చేయ‌డం.. శైవంని మ‌రో స్థాయిలో తీసుకెళ్లింది. కానీ దాగుడు మూత‌..లో ఆ విష‌యాన్నే విస్మ‌రించి ప‌క్క‌న పెట్టేయ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తుంది. భావోద్వేగాల‌తో సాగాల్సిన క్లైమాక్స్ కూడా తు.తు.మంత్రంగా తీశాడు. అక్క‌డ ప‌దునైన సంభాష‌ణ‌లు రాసుకొనే వీలున్నా.. ఒక్క డైలాగ్ కూడా ప‌లికించ‌కుండా మూకీ సినిమా తీసిన‌ట్టు తీశాడు.

రాజుగారి పాత్ర‌లో రాజేంద్ర‌ప్ర‌సాద్ ఇమిడిపోయార‌నే చెప్పాలి. తాత‌గా ఆ హుందాత‌నం, పెద్ద‌రికం బాగానే ప‌లికించారు. మ‌న‌వ‌రాలితో అనుబంధం పెన‌వేసుకొన్న స‌న్నివేశాల్లో రాజేంద్రుడి న‌ట‌న బాగుంది. అయితే.. శైవంలో నాజ‌ర్ పాత్ర‌తో పోలిస్తే.. ఎక్క‌డో వెలితిగానే క‌నిపిస్తుంది. ఎంత తాత పాత్ర‌యితే మాత్రం అంత ముస‌లి మేక‌ప్ ఎందుకో అర్థం కాదు. ఆహార్యం విష‌యంలో ఇంకొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సింది. దాగుడు మూత దండాకోర్ సినిమాకి ఒక విధంగా ప్రాణం.. బేబీ సారా. ఆమె ఈ సినిమాకి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌. సినిమా చూస్తున్నంత సేపూ.. ప్రేక్ష‌కులు ఆమెని ప్రేమిస్తూనే ఉంటారు. అంత చిన్న అమ్మాయి.. భ‌లే చేసేసింది. రాజేంద్ర‌ప్ర‌సాద్‌లాంటి సీనియ‌ర్‌తో పోటీ ప‌డి..న‌టించింది. అయితే.. ఆమె పాత్ర‌ని ఇంకాస్త ఎలివేట్ చేయాల్సింది. బంగారం అంటే ఆ ఇంటికి ఎందుకంత ఇష్టం?  అనేది తెలియ‌డానికి ఇంకొన్ని సీన్లు రాసుకొంటే బాగుండేది. మిగిలిన న‌టీన‌టులంతా తమ పాత్ర‌ల‌కు న్యాయం చేశారు.


శైవంలో పాట‌ల్లేవు. కానీ ఈ సినిమా కోసం పాట‌లు పుట్టుకొచ్చాయి. అయితే సాహిత్యం మాత్రం ఆక‌ట్టుకొంటుంది. ప్ర‌తి పాట క‌థ చెబుతుంది. సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి ఓ గీతం ఆల‌పించ‌డం విశేషం. నేప‌థ్య సంగీతం కూడా ఓకే అనిపిస్తుంది. సాంకేతికంగా ఈ సినిమా బాగానే ఉంది. అయితే నైట్ షాట్స్ మ‌స‌క‌మ‌స‌క‌గా క‌నిపిస్తాయి. క్రిష్ సినిమాల‌కు మాట‌లు ప్ర‌ధాన బ‌లం. అయితే ఈసినిమాలో ప‌దును త‌గ్గింది.

ఫ‌క్తు క‌మ‌ర్షియ‌ల్ సినిమాల మ‌ధ్య‌.. ఈసినిమా కొత్త‌గా క‌నిపిస్తుంది. మీకు ప‌ల్లెటూరి అందాలు చూడాల‌నుకొంటే ఈ సినిమా చూడొచ్చు. శైవంని దృష్టిలో ఉంచుకొని థియేట‌ర్ కి వెళ్తేమాత్రం నిరాశ చెంద‌డం ఖాయం.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.