ENGLISH | TELUGU  

ఇలాంటి పనులు చేసే... తెలుగు సినిమా నడకనే మార్చేశాడు

on Aug 21, 2017

 

ఇప్పుడున్న యువ హీరోలకు ఒక్క బ్లాక్ బాస్టర్ వచ్చిందనుకోండీ... ఇహ భూమ్మీద ఆగరు. సరికదా... పారితోషికాన్ని వెం..టనే పెంచేస్తారు. తర్వాత చేసే సినిమా... ‘క్రితం హిట్ కంటే గొప్పగా ఉండాలి’. ‘క్రితం సినిమా మాదిరిగానే మాం...చి మాస్ గా సాగాలి’. ‘ఖర్చుకు అస్సలు వెనకాడకూడదు’.. అంటూ నిర్మాతలకు ఆర్డర్లు మీద ఆర్డర్లు పాస్ చేసేస్తుంటారు. వీళ్ల సొమ్మేం పోయిందీ... డబ్బు పెట్టేవాడిది కదా బాధంతా. ‘మనింటి దీపమే కదా ముద్దెట్టుకోబోతే... మూతి కాలింది’ అని ఓ సామెతుంది లేండీ... మన నిర్మాతల విషయంలో అది అక్షర సత్యం. కాదు కాదు.. లక్షల సత్యం... ఇంకా మాట్లాడితే కోట్ల సత్యం. 

ఈ యువ స్టార్లెవరూ లేని రోజుల్లో...  ఒకాయన తెలుగుతెరను రూల్ చేశాడు. ఆమాటకొస్తే... ఇప్పటికీ ఉన్నాడనుకోండీ! ఆయనేం మనిషో కానీ... తనకొచ్చే బ్లాక్ బాస్టర్లను కూడా అస్సలు పట్టించుకునేవాడు కాదు పాపం. అవేమో... ఆత్మబంధువుల్లా వచ్చి.. ఆయన్ను పనిగట్టుకొని పలకరించేవి. అవేనండీ... ‘బ్లాక్ బస్టర్లు’. అయినా.. ఆయనగారికి ఇవేమీ పట్టవిగావు. కేవలం పాత్రల దాహం. ఇంకా ఏదో చేయాలనే తపన. ఎవరికైనా ఒక హిట్ వస్తే... ఇంకో హిట్ కోసం వెంపర్లాడతారు. కానీ... ఈయనగారూ ‘మంచి పాత్ర ఏమైనా దొరుకుతుందేమో’ అని ఆశగా దిక్కులు చూసేవాడు. అందుకే... ప్రేక్షకుల హృదయాల్లో ‘చిరంజీవి’గా నిలిచిపోయాడు.

- 500 రోజులాడిన ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’తర్వాత... మరో హీరో అయితే  విశ్వనాథ్ గారి ‘శుభలేఖ’ చేసేవాడా?

‘-  అడవి దొంగ’ లాంటి బ్లాక్ బ్లస్టర్ తర్వాత ఇంకో హీరో అయితే... ‘విజేత’ లాంటి కుటుంబ కథ చేసేవాడా?  
 
-  ‘దొంగ మొగుడు’ లాంటి బంపర్ హిట్ తర్వాత ఈ యువ హీరోలైతే ‘ఆరాధన’ లాంటి విషాద గాధ చేసేవారా?

నంబర్ వన్ సింహాసనంపై కూర్చోబెట్టిన ‘పసివాడి ప్రాణం’ లాంటి హిట్ తర్వాత... ఎవరైనా ‘స్వయం కృషి’ లాంటి సినిమా చేస్తారా? చెప్పులు కుట్టుకునే పాత్ర పోషిస్తారా?

10 కోట్లు... ఈ అంకె 1992 వరకూ తెలుగు సినిమా ఎరగదు. ‘ఘరనా మొగుడు’తో ఎరుకైంది. అంతటి విజయం తర్వాత లౌక్యం ఉన్న ఏ హీరో అయినా... ‘ఆపద్భాంధవుడు’లాంటి కల్ట్ సినిమా చేయడు. కానీ... ఆయనగారు చేశారు.   

ఇలాంటి పనులు చేసే కదా... తెలుగు సినిమా నడకనే మార్చేశాడు. ఇలాంటి పనులు చేసే కదా... ప్రశాంత గోదారిగా ప్రవహిస్తున్న తెలుగు సినిమాను... వరదగోదారిలా ఉరకలెత్తించాడు. అందుకే ఆయన్ను మొదట్లో అందరూ ‘డేరింగ్ డాషింగ్ డైనమిక్ హీరో’ అని ముద్దుగా
పిలుచుకునేవారు. ఆ తర్వాత సుప్రీమ్ హీరో అన్నారు. ఇప్పుడు ‘మెగాస్టార్’అంటున్నారు.
39 ఏళ్ల నట ప్రస్థానం...
20 ఏళ్ల ‘నంబర్ వన్’ ప్రస్థానం... వెరసి ఆయనే చిరంజీవి... మెగాస్టార్ చిరంజీవి.  
మహానటుడు ఎన్టీయార్ తర్వాత... తెలుగుతెరను ఎక్కువ సమయం ఏలిన సూపర్ స్టార్ ఎవరంటే సమాధానం ఈయనే.
చిరంజీవికి ముందు మహానటులు తెలుగు సినిమాను పునీతం చేశారు. వారి హవా ముగిసే సమయానికి... తెలుగు సినిమా కొత్త మలుపుని కోరుకుంది. ఆ మలుపు తిప్పే రధ సారధి కోసం వేచి చూసింది. అప్పుడొచ్చాడు... చిరంజీవి. తెలుగు సినిమా మలుపు తిరిగింది. ఇప్పటికీ... అదే దారిలో పయనిస్తోంది.
తెలుగు సినిమా చూసిన అద్భుతం చిరంజీవి. ఎందుకంటే... డాన్స్ ఇలా చేయాలని చెప్పింది ఆయనే. ఫైట్స్ ఇలా చేయాలని చూపించింది ఆయనే. స్టైల్ అంటే ఇలా ఉండాలని నేర్పించింది ఆయనే. నటన అంటే.. వాస్తవికతకు దర్పణంలా ఉండాలని తెలియజెప్పిందీ ఆయనే.
చిరంజీవి ప్రభావం అమోఘం అనడానికి ఉదాహరణ ఏంటంటే... ఆయన తర్వాత వచ్చిన హీరోలందరూ ఆయనలాగే డాన్సులు చేశారు. చివరకు సమకాలీనులతో సహా.
‘కేవలం హిట్స్ వచ్చినంత మాత్రాన ‘నంబర్ వన్’ కారూ... హస్టరీలో నిలిచిపోయే పాత్రలు చేస్తేనే ‘నంబర్ వన్’ అవుతారు’ అని నిరూపించిన ప్రయాణం చిరంజీవిది. పదేళ్ల తర్వాత ముఖానికి రంగేసుకున్నా... తన స్టామినా ఇసుమంత కూడా తగ్గలేదని 1 50 చిత్రం ‘ఖైదీ నంబర్ 150’తో తేలిపోయింది.  అదే ఉత్సాహంతో 151వ చిత్రానికి కొబ్బరికాయ కొట్టేశారు మెగాస్టార్. స్వాతంత్ర్య సమరయోధుడు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’గా ఆయన రాబోతున్నారు.
నేడు మెగాస్టార్ పుట్టిన రోజు. ఇలాంటి పుట్టిన రోజులు ఆయన ఇంకెన్నో జరుపుకోవాలి. ఇలాగే ప్రేక్షకులను అలరిస్తూ ముందుకు సాగాలి. నేటి కథానాయకుల్లో ఆయన స్పూర్తి రగలాలి... అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు అందిస్తోందీ... ‘తెలుగు వన్’.


-నరసింహ బుర్రా

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.