ఎన్టీఆర్ సినిమాకెళ్లి దెబ్బలు తిన్న చిరంజీవి!
on Sep 1, 2022

మెగాస్టార్ చిరంజీవి సినిమా వచ్చిందంటే ఫస్ట్ డే ఫస్ట్ షో చూడటానికి అభిమానులు ఏ స్థాయిలో ఉత్సాహం చూపిస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడంటే ఆన్ లైన్ బుకింగ్ వచ్చింది గానీ ఒకప్పుడు టికెట్స్ కోసం థియేటర్స్ దగ్గర భారీ క్యూలు ఉండేవి. అయితే అభిమానులు చిరంజీవి సినిమా కోసం ఎలా అయితే క్యూలో నిల్చుంటారో.. అలాగే చిరంజీవి సైతం అప్పట్లో నటరత్న ఎన్టీఆర్ సినిమా చూడటానికి క్యూలో నిల్చున్నారు. అంతేకాదు తనతో పాటు తమ్ముడు నాగబాబుని కూడా క్యూలో నిల్చోబెట్టి తండ్రి చేతిలో దెబ్బలు తిన్నారు. ఈ విషయాన్ని తాజాగా చిరంజీవే స్వయంగా పంచుకున్నారు.
'జాతిరత్నాలు' డైరెక్టర్ కేవీ అనుదీప్ కథ అందించగా.. వంశీ, లక్ష్మీనారాయణ దర్శకత్వం వహించిన సినిమా 'ఫస్ట్ డే ఫస్ట్ షో'. ఈ చిత్రంతో పూర్ణోదయ పిక్చర్స్ రీఎంట్రీ ఇస్తుండటం విశేషం. సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ నిన్న(ఆగస్ట్ 31) సాయంత్రం జరిగింది. ఈ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రేక్షకుడిగా తన చిన్ననాటి 'ఫస్ట్ డే ఫస్ట్ షో' అనుభవాన్ని పంచుకున్నారు.
"నేను సెవెంత్ క్లాస్ చదువుతున్న టైములో ఎన్టీ రామారావు గారు నటించిన 'రాము' సినిమా విడులైంది. నెల్లూరులో మా చుట్టాలబ్బాయి ఉండేవాడు.. అతను రామారావు గారికి పెద్ద అభిమాని. ఫస్ట్ డేనే సినిమా చూడాలని నన్ను, నాగబాబుని థియేటర్ కి తీసుకెళ్లాడు. మా నాన్నగారు మమ్మల్ని ఎప్పుడు సినిమాకి తీసుకెళ్లినా కుర్చీ లెవెల్ లో చూపించేవారు. కానీ అతనికేమో నేల టికెట్ చూడటం అలవాటు. క్యూ చాలా పెద్దగా ఉంది. నాగబాబు చిన్న పిల్లాడు కావడంతో ఆ క్యూలో ఊపిరి ఆడక చాలా ఇబ్బందిపడ్డాడు. ఎలాగోలాగ టికెట్స్ సాధించి క్యూ నుంచి బయటకు రాగానే.. ఆ ముందు షో చూసిన మా నాన్నగారు ఎదురుగా వచ్చారు. ఏంటి ఇక్కడ అని అడిగారు.. నాన్న మీరు సినిమాకి వచ్చారని తెలిసి మేం కూడా వచ్చామని చెప్పాను. అయితే ఇలా నెలలోనా చూసేది?.. పిల్లాడికి ఏమన్నా అయితే.. అంటూ అక్కడి నుండి రోడ్డు మీద నన్ను కొట్టుకుంటూ తీసుకెళ్లారు. ఇప్పటికీ 'రాము' సినిమా అంటే అదే గుర్తొస్తుంది." అంటూ తన చిన్ననాటి జ్ఞాపకాన్ని పంచుకున్నారు మెగాస్టార్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



