వామ్మో కంగనా... నీకో దండం తల్లో..!
on Sep 14, 2017
అదో షూటింగ్ లొకేషన్... పాట తీస్తున్నారు. హీరోయిన్ కి డైరెక్టరూ... పాట గురించి వివరించాడు. హీరోయిన్ కి చిర్రెత్తుకొచ్చింది. ‘ఇందులో నా కేరక్టర్ ఏంటి? ఈ పాట ఏంటి?’ అంటూ అంతెత్తున లేచింది. కానీ.. ఆమె కోపాన్ని పెద్దగా పట్టించుకోలేదు డైరెక్టర్. ‘సాంగ్ ని సాంగ్ లాగే చూడాలి’ అని ఓ ఉచిత సలహా పారేశాడు. ఇంతలో సెట్ లోకి హీరోగారు ఎంట్రీ. ఆయన కారు దిగీ దిగగానే... గొడుగు పట్టేవాడు ఒకడు, కాఫీ, టీలు మోసేవాడు ఒకడు.. కాళ్లు పిసికేవాడు ఒకడు. చివరకు డైరెక్టర్ కూడా హీరో గారి భజనే. ఈ వివక్ష చూసి తట్టుకోలేకపోయింది హీరోయిన్. అంతే పాట ఎత్తుకుంది... ‘ఆడవారిపై ఎందుకురా ఈ వివక్ష?’ అని ప్రశ్నించే రీతిలో ఆ పాట సాహిత్యం సాగుతుంది. అందులోనే ఓ వివాదాస్పనమైన పదం కూడా ఉంటుంది. అదే... ‘cause I have vagina Re’. అంటే... ‘నేను యోని కలిగి ఉండటానికి కారణం ఉంది’ అనే అర్థం.
ప్రస్తుతం బాలీవుడ్ లో ఈ పాట పెను సంచలనం. సోషల్ మీడియా అంతా రచ్చ రచ్చ చేస్తోందీ పాట. ఇంతకీ ఈ పాట ఎవరిది? ఈ హీరోయిన్ ఎవరు? ఏంటి కథ, కమామీషు.. అనుకుంటున్నారా? విషయం ఏంటంటే...కంగనారనౌత్ ఉంది కదా... ఆవిడగారూ... ఓ యూట్యూబ్ ఛానల్ తో కలిసి.. ‘బాలీవుడ్ దివా’ అనే సాంగ్ చేసింది.. ఆ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలోనే కాదు, బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా రచ్చ రంబోలా చేస్తోంది. హన్సల్ మెహతా దర్శకత్వం వహించిన ఈ పాట ఒక్క రోజులోనే ఇంటర్నెట్ లో సంచలనం సృష్టించేసింది. నెపోటిజమ్, సెక్సిజమ్, మహిళలపై వివక్ష ఈ మూడు అంశాల చుట్టూ ఈ పాట నడుస్తుంది.
ఇలాంటి సాహిత్యం ఉన్న పాటలో నటించాలన్నా.. నర్తించాలన్నా.. సదరు నటికి ఏంతో డేర్ ఉండాలి. అలాంటి ధైర్యం మన కంగనాకు కావాల్సినంత ఉంది. ఏ విషయాన్నయినా... కుండ బద్దలు కొ్ట్టేసే రకం కంగనా. మొన్నటివరకూ హృతిక్ రోషన్ ని ఆడేసుకుంది. ఇప్పుడు ఈ పాటతో బాలీవుడ్ హీరోలందరినీ చెడుగుడు ఆడేసింది. కంగనా నటించిన ‘సిమ్రాన్’ సినిమా శుక్రవారం విడుదల కానుంది. ఆ సినిమా ప్రమోషన్ కోసమే.. కంగనా ఇలాంటి పనులు చేస్తోందని బాలీవుడ్ పరిశ్రమలో పలువురు ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదిలా వుంటే...ఈ పాట మన సమంతకి కూడా విపరీతంగా నచ్చేసిందండోయ్. అందుకే ఆనందం ఆపుకోలేక... ఈ పాటను ట్వీట్ చేసేసింది. ‘కంగనా ఓ లెజెండ్రీ... భయం అంటూ తెలీని ఓ ముఖం ఉంటే.. అది కంగనా దే‘ అని ఓ మెసేజ్ కూడా పెట్టింది. ఏది ఏమైనా మరీ.. అంత బోల్డా? ఆ సాహిత్యం ఏంటండీ బాబూ... మరీ ఇబ్బందిగా.