వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో బాలకృష్ణ పేరు!
on Aug 24, 2025

కొన్నేళ్లుగా నటసింహం నందమూరి బాలకృష్ణ టైం నడుస్తోంది. సినీ, రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు. కథానాయకుడిగా 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న ఏకైక వ్యక్తిగా అరుదైన ఘనత సాధించిన బాలకృష్ణ.. ఇప్పటికీ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. రాజకీయాల్లోనూ అంతే. హిందూపురం ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయాన్ని సాధించి చరిత్ర సృష్టించారు. ఇలా అరుదైన ఘనతలతో దూసుకుపోతున్న బాలయ్య.. పలు అరుదైన గౌరవాలనూ ఖాతాలో వేసుకుంటున్నారు.
సినిమా మరియు సమాజానికి చేసిన సేవలకు గాను భారతదేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన పద్మ భూషణ్‌తో ఇటీవల బాలకృష్ణ సత్కరించబడ్డారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి 'ఎన్టీఆర్ నేషనల్ అవార్డు' అందుకున్నారు. అంతేకాకుండా, ఆయన నటించిన 'భగవంత్ కేసరి' చిత్రం ప్రతిష్టాత్మకమైన జాతీయ అవార్డును గెలుచుకుంది. తాజాగా బాలకృష్ణ మరో ఘనత సాధించారు. ప్రతిష్టాత్మక వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్నారు.
భారతీయ సినిమాలో హీరోగా బాలకృష్ణ చేసిన విశేష కృషికి గుర్తింపుగా, UK లోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్‌లో బాలకృష్ణను చేర్చి సత్కరిస్తున్నారు. ఈ సత్కారం ఆగస్టు 30న హైదరాబాద్‌లో జరగనుంది.
ఐదు దశాబ్దాలుగా సినీ రంగానికి సేవ చేస్తూ, లక్షలాది మందికి ప్రేరణగా నిలిచిన బాలకృష్ణను గౌరవించుకోవడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సీఈఓ సంతోష్ శుక్లా అన్నారు.
.webp)
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



