ENGLISH | TELUGU  

బాహుబ‌లి 2 రివ్యూ

on Apr 27, 2017

 


బాహుబ‌లి.. ఐదేళ్ల నుంచీ తెలుగు చిత్ర‌సీమ‌ని ఊపేసిన పేరు. తెలుగువాడి ఖ్యాతిని ప్ర‌పంచ‌మంతా మ‌రోసారి ఘ‌నంగా ప‌రిచ‌యం చేసిన పేరు. బాహుబ‌లి తొలి భాగం విడుద‌లై రెండేళ్లు అవుతున్నా... ఇంకా ఆ ఘ‌న‌త‌ల గురించి మాట్లాడుకొంటూనే ఉన్నాం. అన్నిటికంటే ముఖ్యంగా 'బాహుబ‌లిని క‌ట్ట‌ప్ప ఎందుకు చంపాడు' అనే ప్ర‌శ్న మ‌రింత‌గా ఆసక్తిని రేకెత్తించింది. రాజ‌మౌళి పై రెండు భారాలున్నాయి. ఒక‌టి తొలిభాగానికి ధీటుగా రెండో భాగం తెర‌కెక్కించ‌డం, క‌ట్టప్ప ప్ర‌శ్న‌కు ప్రేక్ష‌కుల ఊహ‌ల‌కు, అంచ‌నాల‌కు, ఆలోచ‌న‌ల‌కు అంద‌నంత స్థాయిలో జ‌వాబు చెప్ప‌డం. మ‌రి బాహుబ‌లి క‌న్ క్లూజ‌న్ ఆ స్థాయిలో సంతృప్తి ప‌రిచిందా?  తెలుగు వాడు మ‌రోసారి 'బాహుబ‌లి' ని చూసి గ‌ర్వప‌డ‌తాడా?  రాజ‌మౌళి మాయ పార్ట్ 2లోనూ కొన‌సాగిందా, లేదా?  చూద్దాం.. రండి!!


* క‌థ‌

కాళ‌కేయుడి సైన్యంపై విజ‌యంలో కీల‌క పాత్ర పోషించిన బాహుబ‌లి (ప్ర‌భాస్‌)ని మాహీష్మ‌తీ రాజ్యానికి రాజుగా ప్ర‌క‌టిస్తుంది శివ‌గామి. ప‌ట్టాభిషేకానికి ముహూర్తం కూడా నిర్ణ‌యిస్తుంది. ఈలోగా దేశాట‌న‌కు బ‌య‌ల్దేర‌తాడు బాహుబ‌లి. అందులో భాగంగా కుంత‌ల రాజ్యం చేర‌తాడు.  ఆరాజ్య యువ‌రాణి దేవ‌సేన (అనుష్క‌)ని చూసి ఇష్ట‌ప‌డ‌తాడు. మ‌రోవైపు రాజ్యం త‌న‌కు ద‌క్క‌కుండా పోయింద‌న్న క‌సితో ర‌గిలిపోతుంటాడు భ‌ళ్లాల‌దేవుడు. త‌మ్ముడిని నాశ‌నం చేసే ఘ‌డియ కోసం ఎదురుచూస్తుంటాడు.  కుంత‌ల రాజ్యంలో దేవ‌సేన‌ని బాహుబ‌లి ఇష్ట‌ప‌డ్డాడ‌న్న వార్త భ‌ళ్లాల‌దేవుడికి చేరుతుంది. దేవ‌సేన‌ని అడ్డం పెట్టుకొని ప‌థ‌కం ర‌చిస్తాడు. దేవ‌సేన‌ని త‌న‌కిచ్చి పెళ్లి చేయ‌మ‌ని అమ్మ శివ‌గామిని కోరిక కోర‌తాడు. దేవ‌సేన‌ని అప్ప‌టికే బాహుబ‌లి ఇష్ట‌ప‌డ్డాడ‌న్న సంగ‌తి తెలియ‌ని శివ‌గామి... కొడుక్కి మాట ఇస్తుంది. త‌ల్లి ఇచ్చిన మాట కోసం తాను ప్రేమించిన అమ్మాయిని అన్న‌య్య‌కు క‌ట్ట‌బెట్టాడా?  లేదంటే... త‌న‌ని న‌మ్మి మాహీష్మ‌తీ రాజ్యంలో అడుగుపెట్టిన దేవ‌సేన‌ని కోసం త‌ల్లిని ఎదిరించాడా?  అనేదే బాహుబ‌లి 2 క‌థ‌లో కీల‌కాంశం.

* విశ్లేష‌ణ‌

బాహుబ‌లి 1లోనే అద్భుతాల‌న్నీ చూపించేశాడు రాజ‌మౌళి. అంత‌కు మించిన అద్భుతాలు కోరుకొంటార‌ని త‌న‌కు తెలుసు. దానికి అనుగుణంగా బాహుబ‌లి 2ని తీర్చిదిద్ద‌డంలో స‌ఫ‌లీకృతం అయ్యాడు. టైటిల్స్ ప‌డుతున్న‌ప్పుడే బాహుబ‌లి తొలి భాగంలో ఏం జ‌రిగింద‌న్న విష‌యాన్ని చూచాయిగా చెప్పేశాడు. ఆ వెంట‌నే పార్ట్ 2 క‌థ‌లోకి వెళ్లిపోయాడు. కుంత‌ల దేశానికి బాహుబ‌లి వెళ్లడం, అక్క‌డ దేవ‌సేన‌ని ఇష్ట‌ప‌డ‌డం, సుబ్బ‌రాజుని కామెడీ కార్డ్‌గా వాడుకోవ‌డం ఇవ‌న్నీ కాస్త స్లో నేరేష‌న్‌తో ఇబ్బంది పెట్టే విష‌యాలే. కానీ ఎక్క‌డ‌క్క‌డ విజువ‌ల్ వండ‌ర్‌గా తీర్చిదిద్డ‌డం వ‌ల్ల క‌ళ్ల‌కు ఇంపుగా క‌నిపిస్తూ.. ఆహ్లాదంగా సాగిపోతాయి. కుంత‌ల రాజ్యాన్ని బాహుబ‌లి కాపాడ‌డం, దేవ‌సేన‌ని మాహీష్మ‌తీ రాజ్యానికి తీసుకెళ్ల‌డం, అక్క‌డ ఇచ్చిన మాటా?  త‌ల్లి వాక్కా? అనే ప్ర‌శ్న ఎదురైన‌ప్పుడు... బాహుబ‌లి ఏ వైపు అడుగు వేశాడ‌నే సన్నివేశం.. ఇవ‌న్నీ అద్భుతంగా పండాయి. ప్ర‌ధ‌మార్థాన్ని ముగించిన తీరు కూడా త‌ప్ప‌కుండా ఆక‌ట్టుకొంటుంది. ద్వితీయార్థంలో సోది చెప్ప‌డానికి ఏం లేకుండా పోయింది. దాంతో క‌థ ర‌స‌ప‌ట్టుగా సాగింది. త‌దుప‌రి ఏం జ‌ర‌గ‌బోతోంది? అనే విష‌యం ప్రేక్ష‌కుడికి అర్థ‌మ‌వుతూనే ఉంటుంది. కానీ... ఆ క‌థ‌ని కూడా అందంగా, క‌న్నుల పండువ‌గా తెర‌కెక్కించాడు రాజ‌మౌళి.

 

క‌ట్ట‌ప్ప  బాహుబ‌లిని ఎందుకు చంపాడు? అనేదే బాహుబ‌లి 2లో కీల‌క పాయింట్‌. రాజ‌మౌళి చూపించిన కార‌ణం కూడా ఊహించిన‌దే. అయితే.. ఆ స‌న్నివేశాల్ని ఎమోష‌న‌ల్‌గా మ‌ల‌చిన తీరు.. ఆక‌ట్టుకొంది. ఇన్నాళ్లు ఎదురుచూసిన స‌మాధానం సంతృప్తిక‌ర‌మైన రీతిలో చెప్పాడు రాజ‌మౌళి. కార‌ణం ఎలాగున్నా.. ఆయా సన్నివేశాల్ని భావోద్వేగాల‌తో న‌డిపించ‌డంలో రాజ‌మౌళి మార్క్ క‌నిపిస్తుంది. ప‌తాక స‌న్నివేశాలు దాదాపు అర‌గంట‌పైనే సాగాయి. యుద్ధం కాస్త బోర్ కొట్టించింది. తాటి చెట్ల‌ని స్ప్రింగులుగా మార్చ‌డం విడ్డూరంగా ఉంటుంది. అయినా స‌రే... తీసింది రాజ‌మౌళి కాబ‌ట్టి, అద్భుతం అనుకోవాలి. తెలుగు తెర‌పై ఇలాంటి ఓ విజువ‌ల్ వండ‌ర్ ఇది వ‌ర‌కు చూడ‌లేదు. ఆ విష‌యంలో మాత్రం చిత్ర‌బృందాన్ని మెచ్చుకొని తీరాల్సిందే.

* న‌టీన‌టుల ప్ర‌తిభ‌

ఏడు పాత్ర‌ల చుట్టూ తిరిగిన క‌థ ఇది. ప్ర‌తీ పాత్ర‌కూ స‌రైన న‌టీన‌ట వ‌ర్గాన్నే ఎంచుకొన్నాడు రాజ‌మౌళి. ప్ర‌భాస్ గురించి ఏం చెప్పాలి?  యుద్ధ వీరుడంటే ఎలా ఉండాలో క‌ళ్ల‌కు క‌ట్టాడు. బాహుబ‌లి పాత్ర‌లో ప్ర‌భాస్‌ని త‌ప్ప మ‌రెవ్వ‌రినీ ఊహించ‌లేం. ప్ర‌భాస్ కెరీర్‌లో అల్టిమేట్ అంటే.. ఈ పాత్రే. అన్ని ర‌కాల ఎమోష‌న్స్‌నీ పండించాడు. తొలి భాగంతో పోలిస్తే.. ద్వితీయార్థంలో రానా పాత్ర ప‌రిధి చాలా త‌గ్గిపోయింది. బహుశా.. బాహుబ‌లిని ఎలివేట్ చేయ‌డంలో భాగంగా రానా పాత్ర కుదించుకుపోయిందేమో..?  దేవ‌సేన పాత్ర‌పై ఈసారి దృష్టి పెట్టాడు రాజ‌మౌళి. వీర‌వ‌నిత‌గా అనుష్క‌... ఇమిడిపోయింది. త‌మ‌న్నా ఈ సినిమాలో ఉందా, లేదా? అనే అనుమానం వేస్తుంది. త‌ను క‌నిపించింది కాసేపే. ఒక్క డైలాగూ లేదు. బిజ్జాల దేవ పాత్ర హైలెట్‌గా నిలిచింది. త‌న క్రూర‌త్వ‌మే ఈ సినిమాని ముందుకు న‌డిపించింది. మ‌రోసారి న‌మ్మిన బంటు పాత్ర‌లో స‌త్య‌రాజ్ అమోఘంగా రాణించాడు.


*  సాంకేతికంగా...

ఇది టెక్నీషియన్ల సినిమా. కీర‌వాణి పాట‌ల్ని ప‌క్క‌న పెడితే, నేప‌థ్య సంగీతం అదిరిపోయింది. కెమెరా, ఆర్ట్‌, విజువ‌ల్ ఎఫెక్ట్స్‌... తెలుగు సినిమా స్థాయిని పెంచ‌డంలో దోహ‌దం చేశాయి. కొన్ని సీన్ల‌యితే.. అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో తీశారు. చూస్తోంది హాలీవుడ్ సినిమానేమో అనే స్థాయిలో వాటిని తెర‌కెక్కించారు. ఈ ఘ‌న‌త క‌చ్చితంగా రాజ‌మౌళికే ద‌క్కుతుంది. బాహుబ‌లి 1తో తెలుగువాడి కీర్తిని నిల‌బెట్టిన రాజ‌మౌళి.. బాహుబ‌లి 2 తో దాన్ని మ‌రింత బ‌లంగా చాట‌గ‌లిగాడు. ఎమోష‌న‌ల్ సీన్ల ప‌రంగా తానెంత బ‌లంగా ఉంటాడో.. బాహుబ‌లి 2 నిరూపిచింది. పార్ట్ 1లో చాలా లోపాలు క‌నిపించాయి. వాటిని పార్ట్ 2లో స‌రిద్దుకోగ‌లిగాడు.


* చివ‌రిగా:  అంచ‌నాల భారం మోసిన బాహుబ‌లి చివ‌రికి గ‌మ్యాన్ని చేరుకొన్నాడు. బాహుబ‌లి క‌ట్ట‌ప్ప‌ని ఎందుకు చంపాడ‌న్నది  ఇప్ప‌టి వ‌ర‌కూ వేధించిన ప్ర‌శ్న‌. ఇప్పుడు బాహుబ‌లి 2 ఎన్ని రికార్డులు బ‌ద్ద‌లు కొడుతుంద‌న్న‌దే అస‌లు ప్ర‌శ్న‌. మ‌రి కొద్ది రోజుల్లోనే అన్ని రికార్డులూ
బాహుబ‌లి పేరిట లిఖించ‌డం ఖాయం.

రేటింగ్‌: 3.75

 

 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.