ప్రజాకవి అందెశ్రీ కన్నుమూత!
on Nov 9, 2025

ప్రముఖ ప్రజాకవి, తెలంగాణ రాష్ట్ర గీతం రచయిత అందెశ్రీ (Ande Sri) కన్నుమూశారు. 64 ఏళ్ళ అందెశ్రీ కొతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈరోజు(సోమవారం) తెల్లవారుజామున తన నివాసంలో ఒక్కసారిగా కుప్పకూలి పడిపోవడంతో.. కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అందెశ్రీ తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు గుర్తించారు.
ప్రజాకవి, ప్రకృతి కవిగా సుప్రసిద్ధులైన అందెశ్రీ.. జనగాం వద్ద గల రేబర్తి అనే గ్రామంలో 1961, జులై 18న జన్మించారు. ఆయన అసలు పేరు అందె ఎల్లయ్య. తెలంగాణ, ప్రకృతి లాంటి అంశాలపై గేయరచన చేసారు. పాఠశాలకు వెళ్ళి చదువుకోకపోయినా.. తన పాటలతో ఎందరినో చైతన్య పరిచారు. అందెశ్రీ అశు కవిత్వం చెప్పటంలో దిట్ట.
అందెశ్రీ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఆయన రచించిన 'జయ జయహే తెలంగాణ' పాటను తెలంగాణ రాష్ట్ర గీతంగా రేవంత్ రెడ్డి సర్కార్ ప్రకటించింది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినందుకుగాను.. 2025 జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేతులమీదుగా రూ.కోటి నగదు పురస్కారాన్ని అందుకున్నారు అందెశ్రీ.
నారాయణ మూర్తి నటించిన పలు విప్లవాత్మక సినిమాల విజయం వెనుక అందెశ్రీ పాటలున్నాయి. 'మాయమైపోతుండమ్మా మనిషన్నవాడు', 'సుడా సక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి', 'పల్లెనీకు వందనములమ్మో', 'జన జాతరలో మన గీతం' వంటి పాటలు అందెశ్రీకి మంచి పేరు తీసుకొచ్చాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



