సూపర్ స్టార్ చేతుల మీదుగా అందాల నటుడి జీవిత చరిత్ర!
on Sep 2, 2022

బ్లాక్ అండ్ వైట్ సినిమా కాలంలో అప్పటి అమ్మాయిల కలల రాకుమారుడిగా పేరు తెచ్చుకున్న అందాల నటుడు బుద్ధరాజు హరనాథ్ రాజు జయంతి నేడు. 1936లో సెప్టెంబర్ 2న తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలంలోని రాపర్తి గ్రామంలో ఆయన జన్మించారు. తన కెరీర్ లో తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, బెంగాలీ భాషల్లో కలిపి 167 సినిమాల్లో నటించారు. 1989, నవంబర్ 1న ఆయన మరణించారు. స్వర్గీయ నటరత్న ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన 'సీతారామ కళ్యాణం' చిత్రంలోని 'శ్రీ సీతారాముల కళ్యాణము చూడము రారండి' పాటలో శ్రీరామునిగా ఆయన రూపం తెలుగు ప్రేక్షకుల జ్ఞాపకాలలో చిరస్థాయిగా నిలిచిపోతుంది.
హరనాథ్ జీవిత చరిత్రను 'అందాల నటుడు' పేరుతో డాక్టర్ కంపల్లి రవిచంద్రన్ రచించారు. అరుదైన ఫోటోలు, ఎవరికీ అంతగా తెలియని ఆసక్తికరమైన విషయాలతో ఈ పుస్తకాన్ని అందంగా తీర్చిదిద్దారు. హరనాథ్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు(సెప్టెంబర్ 2) హరనాథ్ కుమార్తె జి.పద్మజ, అల్లుడు జివిజి రాజు మరియు మనవళ్లు శ్రీనాథ్ రాజు, శ్రీరామ్ రాజు సమక్షంలో 'అందాల నటుడు' పుస్తకాన్ని సూపర్ స్టార్ కృష్ణ ఆయన నివాసంలో ఆవిష్కరించారు.
పుస్తక విడుదల సందర్భంగా కృష్ణ జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. తాను, హరనాథ్ కలిసి పలు సినిమాల్లో నటించామని అన్నారు. అతను నిజమైన అందాల నటుడని, అలాగే మంచి మనసున్న వ్యక్తి అని కొనియాడారు. అంతేకాకుండా తాను హీరోగా నటించిన 'మా ఇంటి దేవత' అనే చిత్రాన్ని కూడా హరినాథ్ నిర్మించారని గుర్తుచేసుకున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



