ఇదేందయ్యా ఇది.. పవన్ కళ్యాణ్ కి జై కొట్టిన అంబటి రాంబాబు!
on Jul 23, 2025

రాజకీయ నాయకులు ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికీ అర్థంకాదు. ఆ మాటను మరోసారి రుజువు చేసే బాధ్యతను వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు తీసుకున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ పై ఏ స్థాయి విమర్శలు చేశారో తెలిసిందే. పవన్ నటించిన సినిమాలను కూడా అంబటి టార్గెట్ చేసేవారు. దాంతో అంబటిపై పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అంతెందుకు పవన్ కళ్యాణ్ నటించిన 'బ్రో' సినిమాలో అంబటిని ఇన్ డైరెక్ట్ గా ట్రోల్ చేశారు.
అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ పేరు వింటేనే అంబటి రాంబాబు రగిలి పోయేవారు. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి ఉండేది. అలాంటిది ఇప్పుడు పవన్ సినిమా సక్సెస్ కావాలని అంబటి కోరుకోవడం సంచలనంగా మారింది.

పవన్ కళ్యాణ్ నటించిన 'హరి హర వీరమల్లు' మూవీ రేపు(జులై 24) విడుదల కానుంది. అయితే ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటూ అంబటి రాంబాబు ట్వీట్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. "పవన్ కళ్యాణ్ గారి 'హరిహర వీర మల్లు' సూపర్ డూపర్ హిట్టై కనక వర్షం కురవాలని కోరుకుంటున్నాను." అని అంబటి ట్వీట్ చేశారు.
ఓ వైపు 'హరి హర వీరమల్లు'ను బాయ్ కాట్ చేయాలని వైసీపీ అభిమానులు అంటుంటే.. మరోవైపు అంబటి సినిమా హిట్ కావాలని ట్వీట్ చేయడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అంబటి వెటకారంగా ఈ ట్వీట్ చేశారా? లేక పవన్ కళ్యాణ్ కి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారా? అనే చర్చ జరుగుతోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



