ENGLISH | TELUGU  

అలా ఎలా రివ్యూ: చిన్న సినిమా తీయాలిలా

on Nov 28, 2014

 

హ‌మ్మ‌య్య‌.. ఎన్నాళ్ల‌కు..
ఓ చిన్న సినిమా.. హాయిగా.. ఆహ్లాద‌క‌రంగా..!
గోదాట్లో ప‌డ‌వ ప్ర‌యాణం చేస్తున్న‌ట్టు..
బీచ్‌లో కూర్చుని ఫ్రెండ్స్‌తో మాట్లాడుకొన్న‌ట్టు.. స‌ర‌దాగా!
ఫైట్లు లేవు. భీక‌ర‌మైన ఫ్లాష్ బ్యాకులు లేవు. భారీ డైలాగులు లేవు. త‌ల‌నొప్పులు లేవు.
ఎన్నాళ్ల కెన్నాళ్ల‌కు..?

అలా ఎలా సాధ్యం అనుకొంటే.. అలా ఎలా సినిమా  చూడండి..! చూసేముందు టాక్ తెలుసుకోవాలంటే రివ్యూ చ‌ద‌వండి..

తాత‌కిచ్చిన చివ‌రి మాట కోసం రాజోలు అమ్మాయి శ్రుతి (ఖుషి)కి రెండు కోట్ల క‌ట్నం కోసం పెళ్లి చేసుకోవ‌డానికి సై అంటాడు కార్తీక్ (రాహుల్ ర‌వీంద్ర‌). కాక‌పోతే త‌న‌కు ప్రేమించి పెళ్లి చేసుకోవాల‌న్న కోరిక‌. ల‌వ్ స్టోరీలు ఎక్కువ చూశాడేమో.. అలాంటి స్వీట్ న‌థింగ్స్ అన్నీ మిస్స‌యిపోతాన‌నే అన్న ఫీలింగ్ వ‌చ్చేస్తుంది. అందుకే శ్రుతి ఊరెళ్లి, ఆమెకు తానెవ‌రో తెలియ‌కుండా ప్రేమించి. శ్రుతి చేత కూడా ప్రేమింప‌బ‌డి .. పెద్ద‌లు కుదిర్చిన పెళ్లి చేసుకోవాలా?  లేదంటే ప్రేమించిన కార్తీక్‌ని చేసుకోవాలా అని క‌న్‌ఫ్యూజ్ ప‌డుతున్న‌ప్పుడు `మీ పెద్ద‌లు కుదిర్చిన పెళ్లి కొడుకు కూడా నేనే` అని షాక్ ఇచ్చి, అప్పుడు పెళ్లి చేసుకోవాల‌నుకొంటాడు. త‌న స్నేహితులు (వెన్నెల కిషోర్‌, షాని)ల‌ను తీసుకొని ఓ ఆల్ ఇన్ వ‌న్ (అన్ని కంపెనీల లోగోలూ ఈ కారుపై ఉంటాయ్ లెండి) బ్రాండెడ్ కారు వేసుకొని రాజోలు బ‌య‌ల్దేర‌తాడు. అక్క‌డ శ్రుతిని దొంగ‌చాటుగా ప్రేమించ‌డం మొద‌లెడ‌తాడు. శ్రుతి ఫ్రెండ్ దివ్య (హెబ్బా ప‌టేల్‌) చాలామంచిది. త‌న‌కేం కానివాళ్ల కోసం కూడా ఆలోచిస్తుంటుంది. ఆమె ద్వారా శ్రుతికి ద‌గ్గ‌ర కావాల‌నుకొంటాడు. అయితే.. దివ్య మంచిత‌నం చూసి దివ్య‌ని ప్రేమించ‌డం మొద‌లెడ‌తాడు. `శ్రుతి, దివ్య ఇద్ద‌రూ న‌చ్చారు.. ఎవ‌రిని పెళ్లి చేసుకోవాలో అర్థం కావ‌డం లేదు` అని చెప్పేస‌రికి ఫ్రెండ్స్ ఇద్ద‌రూ షాక్‌!!  ఆ త‌ర‌వాత ఇంట్ర‌వెల్‌. మ‌రి కార్తిక్  ఎవ‌రికి పెళ్లి చేసుకొన్నాడు..?  చివ‌ర్లో త‌న‌కు ఎదురైన ట్విస్ట్ ఏంటి? అనేవి తెలుసుకోవాలంటే సెకండాఫ్ కూడా చూడాల్సిందే.

న‌ల‌భై ఏభై కోట్లు పెట్టి, అర్థం ప‌ర్థం లేని సినిమాలు తీసి, జ‌నాల‌పై రుద్దేయ‌డానికి తెగ ప్ర‌య‌త్నిస్తున్నారు.. వాటి మ‌ధ్య అలా ఎలా... కొత్త‌గా ప్ర‌శాంతంగా అనిపిస్తుంది. చాలా చిన్న లైన్‌. మ‌హా అయితే మూడు కోట్ల బ‌డ్జెట్ అయ్యిందేమో...?  స్టార్లు, భారీ కాస్లింగ్‌, భారీ బ‌డ్జెట్ ఎవ‌డికి కావాలి?  ఓ చిన్న క‌థ‌ని అందంగా చెబితే స‌రిపోతుంది క‌దా.?  అలా ఎలా లా.  ముగ్గురు ఫ్రెండ్స్‌.. స‌ర‌దాగా ప‌ల్లెటూరిలో సాగించిన ప్రేమ ప్ర‌యాణం. సినిమా ఎలాంటి కుదుపులు లేకుండా హాయిగా మొద‌ల‌వుతుంది. ఫ‌స్ట్ రీల్  నుంచి.. చివ‌రి వ‌ర‌కూ ఆ ప్ర‌యాణం అంతే అందంగా సాగింది. చిన్న చిన్న డైలాగులు, కామిక్‌, క్యూట్ ఎక్స్‌ప్రెష‌న్స్‌... ఇవ‌న్నీ అందంగా చూపించారు. ఈ క‌థ‌లో ట్విస్ట్ ఊహించిన‌దే అయినా.. బోర్ కొట్ట‌కుండా ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించాడు. ప‌ల్లెటూరి అందాల‌మ‌ధ్య ఓ ప్రేమ క‌థ‌ని.. స‌ర‌దా స‌ర‌దాగా న‌డిపించాడు. లోపాలు లేవ‌ని కాదు. అక్క‌డ‌క్క‌డ క‌థ‌, క‌థ‌నం న‌స పెడ‌తాయి. ఎదో చెప్ప‌బోయి మ‌రేదో చెబుతున్నాడ‌న్న ఫీలింగ్ వ‌స్తుంది. పాట‌లు డిస్ట‌బ్ చేస్తాయి. క‌థ‌లో కొంత క‌న్‌ఫ్యూజ్ ఉంది. అయినా చిన్న సినిమా కాబ‌ట్టి పెద్ద మ‌న‌సుతో క్ష‌మించేయొచ్చు. హాయిగా న‌వ్వించినందుకు ఈ త‌ప్పుల్ని వ‌దిలేయొచ్చు.

ఖాళీగా ఉన్న‌ప్పుడు మీరేం చేస్తారు?
- ఖాళీగానే ఉంటా!

హెడ్ ఉన్నా లేక‌పోయినా, హెడ్ ఆఫ్ ది హోమ్ అన‌గానే ప్ర‌తీ మ‌గాడూ చంక‌లు గుద్దుకొంటాడు. కానీ త‌ల‌కాయ‌ని ఆడించే మెడ‌కాయ్ ఆడ‌ది అని తెలుసుకోడు.

అర్జునుడికి శ్రీ‌కృష్ణుడు అన్నీ చెప్పాడు. ఒక్క ఆడ‌దాని గురించి త‌ప్ప‌. ప‌ద‌హారు వేల‌మంది గోపిక‌ల‌తో వేగిన‌వాడే.. అమ్మాయిల గురించి తెల్సుకోలేక‌పోయాడు.


ఇలాంటి డైలాగులు ఈ సినిమాలో ఇర‌వై వ‌ర‌కూ ఉన్నాయి. ద‌ర్శ‌కుడు డైలాగ్స్‌ని బాగా రాసుకొన్నాడు. దానికితోడు వెన్నెల కిషోర్‌, కృష్ణ‌భ‌గ‌వాన్‌, షానిల న‌ట‌న‌, వాళ్ల ఎక్స్‌ప్రెష‌న్స్ ఆక‌ట్టుకొంటాయి. ముఖ్యంగా వెన్నెల కిషోర్ న‌డిపించేశాడు. భార్య‌బాధితుడిగా తాను పండించిన కామెడీ ఈ సినిమాని ముందుకు న‌డిపిస్తుంటుంది. త‌న‌చేత పలికించిన డైలాగుల‌న్నీ న‌వ్విస్తాయి. రాహుల్ మంచి ఈజ్‌తో చేశాడు. తాను చాలా ఇంప్రూవ్ అయ్యాడు. డైలాగ్ డెలివ‌రీ బాగుంది. ఇలాంటి క‌థ‌లు మ‌రిన్ని అత‌న్ని వెతుక్కొంటూ వెళ్తాయి. ఇద్ద‌రు హీరోయిన్ల‌లో హెబ్బా ప‌టేల్‌కే ఎక్కువ ఆస్కారం ద‌క్కింది. కొన్ని ఫ్రేముల్లో అందంగా క‌నిపించింది. భానుశ్రీ మెహ్రా చేసిందేం లేదు. మిగిలిన వాళ్లంతా ఓకే.

సాంకేతికంగా కెమెరా ప‌నిత‌నానికి ఎక్కువ మార్కులు ప‌డ‌తాయి. చిన్న సినిమా అయినా క్వాలిటీ చూపించాడు. ఆ త‌ర‌వాత సంభాష‌ణ‌ల‌దే అగ్ర తాంబూలం. డైలాగులు భ‌లే  పండాయి. ద‌ర్శ‌కుడు చిన్న లైన్‌ని అంద‌రికీ ఆసక్తి గొలిపేలా తీశాడు. అయితే ఐటెమ్ పాటెందుకో అర్థం కాదు. చిన్న సినిమానే అయినా.. నిడివి ఇంకాస్త త‌గ్గించుకోవ‌చ్చు. క్లైమాక్స్ కాస్త అతిగా అనిపించినా.. అక్క‌డా న‌వ్వుల‌తోనే నెట్టుకొచ్చాడు.

మొత్త‌మ్మీద బాంబు బ్లాస్టులు, భీభ‌త్సాలు, భ‌యంక‌ర‌మైన డైలాగులూ లేని... ఓ హాయైన చిన్న సినిమా ఇది. కొత్త‌త‌రం వ‌స్తుంది. చిన్న సినిమాలెన్నో వ‌స్తున్నాయి. ఈమ‌ధ్య చిన్న సినిమాలంటే ప్రేక్ష‌కులు భ‌య‌ప‌డిపోతున్నారు. కానీ అలా ఎలా లాంటి సినిమాలు క‌థ‌లు... చిన్న సినిమాపై కొత్త ప్రేమ‌కు చిగుళ్లు వేస్తాయి. బీసీల్లో భ‌విష్య‌త్తు ఏమిటోగానీ.. ఏ సెంట‌ర్‌కి కావ‌ల్సిన సినిమా ఇది.

రేటింగ్ 3.25/5
 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.