ఎవరూ ఊహించని దర్శకుడితో అకీరా నందన్ డెబ్యూ మూవీ!
on Feb 10, 2026

అకీరా నందన్ ఎంట్రీకి రంగం సిద్ధం
పవన్ కళ్యాణ్ నుంచి శేఖర్ కమ్ములకు పిలుపు!
పొలిటికల్ జానరా? లవ్ స్టోరీనా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తనయుడు అకీరా నందన్(Akira Nandan) సినీ రంగ ప్రవేశం కోసం అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. నిజానికి 'ఓజీ'తోనే అకీరా వెండితెరకు పరిచయం అవుతాడని, అందులో టీనేజ్ ఓజీ పాత్రలో అతను కనిపిస్తాడని ప్రచారం జరిగింది. కానీ, అది ప్రచారానికే పరిమితమైంది. దీంతో 'ఓజీ' విడుదల సమయంలో పవన్ ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురయ్యారు. అయితే అభిమానుల్లో ఆనందాన్ని నింపేలా త్వరలోనే అకీరా ఎంట్రీకి రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
అకీరా నందన్ డెబ్యూ మూవీ ఈ డైరెక్టర్ తోనే అంటూ గతంలో హరీష్ శంకర్, సుజీత్, త్రివిక్రమ్ వంటి పేర్లు వినిపించాయి. ఇప్పుడు శేఖర్ కమ్ముల(Sekhar Kammula) పేరు తెరపైకి వచ్చింది. పవన్ కళ్యాణ్ తో సన్నిహితంగా ఉండే ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ నుంచి శేఖర్ కమ్ములకు పిలుపు వచ్చిందట. అకీరా నందన్ ను లాంచ్ చేసే బాధ్యత మీరు తీసుకోవాలని, మంచి స్క్రిప్ట్ ను సిద్ధం చేయాలని కోరారట. ప్రస్తుతం కమ్ముల అదే పనిలో ఉన్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో న్యూస్ చక్కర్లు కొడుతోంది.
స్టార్ వారసుల లాంచ్ కోసం ఎక్కువగా మాస్ దర్శకుల వైపు మొగ్గు చూపుతుంటారు. అయితే ఇటీవల కాలంలో ప్రేక్షకులు సినిమాలు చూసే ధోరణి మారిపోయింది. స్టార్ వారసులు నటించిన సినిమా అయినా.. అందులో వైవిధ్యం లేకపోతే ప్రేక్షకులు ఆదరించట్లేదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే దర్శకుడు శేఖర్ కమ్ములతో తన కుమారుడిని లాంచ్ చేయించాలని పవన్ నిర్ణయించుకున్నారట.
ఆ మధ్య శేఖర్ కమ్ముల దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ 'లీడర్-2' చేస్తారని వార్తలొచ్చాయి. కానీ, అది కార్యరూపం దాల్చలేదు. దీంతో ఇప్పుడు అకీరా నందన్ తో కమ్ముల పొలిటికల్ మూవీ ప్లాన్ చేస్తారా? అనే ఆసక్తి నెలకొంది. లేదా ఆనంద్, గోదావరి, ఫిదా లాంటి ఓ మంచి లవ్ స్టోరీని చేస్తారేమో చూడాలి.
ఏది ఏమైనా శేఖర్ కమ్ములతో లాంచ్ చేయించాలనే ఆలోచన మంచిదే అని చెప్పవచ్చు. ఎందుకంటే కేవలం మెగా అభిమానులకే కాకుండా, సాధారణ ప్రేక్షకులకు మొదటి సినిమాతోనే చేరువయ్యే అవకాశముంటుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



