తీవ్రంగా గాయపడ్డ యాక్టర్ రాజశేఖర్.. మూడు గంటల పాటు సర్జరీ..!
on Dec 8, 2025

యాక్టర్ రాజశేఖర్ కి గాయాలు
హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
మూడు గంటల పాటు సర్జరీ
సినిమా షూటింగ్ లో యాక్టర్స్ గాయపడిన వార్తలు అప్పుడప్పుడూ వింటుంటాం. రీసెంట్ గా యాంగ్రీ స్టార్ రాజశేఖర్(Rajasekhar) కూడా ఒక మూవీ షూటింగ్ లో తీవ్రంగా గాయపడ్డారు. దాంతో ఆయనకు ఏకంగా మూడు గంటల పాటు సర్జరీ జరిగింది.
ఒకప్పుడు యాంగ్రీ మ్యాన్ గా పలు విజయాలతో తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్న రాజశేఖర్.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లోనూ సత్తా చాటడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే కొంత విరామం తర్వాత వరుస సినిమాలకు సైన్ చేస్తున్నారు. ఓ వైపు హీరోగా నటిస్తూనే, మరో వైపు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
నవంబర్ 25న మేడ్చల్ సమీపంలో ఒక మూవీలోని యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ చేస్తుండగా ఆయనకు గాయాలు అయ్యాయి. సన్నిహిత వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం.. రాజశేఖర్ కుడి కాలికి బలమైన గాయమైంది. మడమ దగ్గర పెద్ద ఇంజ్యూరీ అయినట్టు తెలిసింది. గాయమైన వెంటనే హుటాహుటిన యూనిట్ సభ్యులు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. వైద్యులు వెంటనే సర్జరీ చేశారు. సుమారు మూడు గంటల పాటు ఈ సర్జరీ జరిగింది.
బలమైన గాయం కావడంతో బోన్ బయటకు వచ్చిందని, అందువల్ల సర్జరీకి మూడు గంటలు పట్టిందని సమాచారం. సర్జరీలో భాగంగా రాజశేఖర్ కాలిలో ప్లేట్స్ & వైర్ అమర్చారు. దీని వల్ల త్వరగా రికవరీ అవుతారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఆపరేషన్ సక్సెస్ అయ్యిందని, ప్రస్తుతం ఆయన రికవరీ అవుతున్నారని యూనిట్ వర్గాలు తెలిపాయి.
సర్జరీ తర్వాత నాలుగు వారాల పాటు తప్పనిసరిగా విశ్రాంతి తీసుకోవాలని రాజశేఖర్ కు వైద్యులు తెలిపారు. ముఖ్యంగా గాయమైన కాలిని ఎట్టిపరిస్థితుల్లోనూ కదపకూడదని చెప్పారు. అందువల్ల కొన్ని రోజుల పాటు ఆయన చిత్రీకరణలకు దూరంగా ఉంటారు. 2026 జనవరిలో మళ్ళీ ఆయన షూటింగ్ లో పాల్గొనే అవకాశముంది.
మూవీ షూటింగ్ లో రాజశేఖర్ గాయపడటం ఇది మొదటిసారి కాదు. నవంబర్ 15, 1989లో 'మగాడు' షూటింగ్ చేస్తున్న సమయంలోనూ ఆయనకు గాయమైంది. ఇప్పుడు 35 ఏళ్ళ తర్వాత నవంబర్ నెలలోనే మళ్ళీ ఆయనకు గాయమైంది. అప్పుడు ఎడమ కాలికి గాయమైతే, ఇప్పుడు కుడి కాలికి గాయమైంది. 63 ఏళ్ళ వయసులోనూ ఆయన గాయాలను సైతం లెక్క చేయకుండా యాక్షన్ సీన్లు చేస్తున్నారు.
రాజశేఖర్ అప్ కమింగ్ ప్రాజెక్ట్ 'బైకర్'. శర్వానంద్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. అది కాకుండా మరో రెండు సినిమాలు చేస్తున్నారు. అందులో తమిళ్ హిట్ మూవీ 'లబ్బర్ పందు' తెలుగు రీమేక్ కూడా ఉందని సమాచారం. రికవరీ తర్వాత ఆ సినిమాల షూటింగ్స్ మొదలవుతాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



