ENGLISH | TELUGU  

ఆవిరి సినిమా రివ్యూ 

on Nov 1, 2019

 

నటీనటులు: రవిబాబు, నేహా చౌహన్, ప్రియా వడ్లమాని, బేబీ శ్రీముక్త, భరణి శంకర్, ముక్తార్ ఖాన్, కాశీ విశ్వనాథ్ తదితరులు
సినిమాటోగ్రఫీ: ఎన్. సుధాకర్ రెడ్డి
సంగీతం:వైధి
సమర్పణ: శ్రీ వెంకటేశ్వర ప్రిక్చర్స్ అధినేత 'దిల్' రాజు
రచన, నిర్మాణం, దర్శకత్వం: రవిబాబు
విడుదల తేదీ: 01 నవంబర్ 2019

రవిబాబు 'అల్లరి' వంటి కామెడీ సినిమా తీయగలడు. 'నచ్చావులే' వంటి ప్రేమకథతో మెప్పించగలడు. అయితే... అతడికి హారర్ థ్రిల్లర్స్ 'అనసూయ', 'అవును', 'అవును 2' ఎక్కువ పేరు తీసుకొచ్చాయి. ఆ చిత్రాలు హారర్ కాదు, థ్రిలర్స్ అనేది రవిబాబు మాట. అది పక్కన పెడితే, 'అదుగో' ప్లాప్ తర్వాత 'ఆవిరి' అంటూ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సినిమా ఎలా ఉంది? రివ్యూ చదివి తెలుసుకోండి.

కథ: రాజ్ (రవిబాబు), లీనా (నేహా చౌహన్) దంపతులకు ఇద్దరు అమ్మాయిలు. పెద్దమ్మాయి శ్రేయ (బేబీ మోక్ష) మరణిస్తుంది. ఆ తర్వాత వేరే ఇంటికి మారతారు. అప్పట్నుంచి చిన్న అమ్మాయి మున్ని (బేబీ శ్రీముక్త) ఇంటి నుండి బయటకు పారిపోవాలనుకుంటుంది. ఒక రోజు కనిపించకుండా పోతుంది. రాజ్ కొత్త ఇంటికి మారినప్పటి నుండి, అతడి ఆఫీసు ఉద్యోగి జాన్వీ (ప్రియా వడ్లమాని) కూడా కనిపించకుండా పోతుంది. ఆమె మున్నీని తీసుకు వెళ్లిందా? ఒకవేళ మున్నీని జాన్వీ తీసుకువెళితే... ఇంట్లో మున్నీకి సహాయం చేసిన ఆత్మ ఎవరిది? మున్నీ ఏమైంది? చివరికి, కనిపించిందా? లేదా? అనేది మిగతా సినిమా.

విశ్లేషణ: 
'అవును' వంటి థ్రిల్లర్ తీసిన రవిబాబు 'ఆవిరి' తీశాడంటే నమ్మడం కష్టమే. హార్రర్స్, థ్రిల్లర్స్ తీసే ఇతర దర్శకులకు, రవిబాబుకు ఎంతో తేడా ఉంది. కొందరు దర్శకులు ప్రేక్షకులను భయపెట్టడానికి కెమెరా యాంగిల్స్, ఇతర విషయాలపై ఆధారపడతారు. కానీ, రవిబాబు అలా కాదు. ఓ ఇంట్లో, అందులో వస్తువులను కదిలిస్తూ, కెమెరా యాంగిల్ తిప్పకుండా ప్రేక్షకులను భయపెడతారు. 'అవును', 'అవును 2'లో ఇంట్లో ఏ వస్తువు కదిలినా ప్రేక్షకుల్లో చిన్న అలజడి మొదలయ్యేది. అందుకు కారణం ఆయా కథల్లో బలమే. 'ఆవిరి'లో కూడా ఒక ఇల్లు, ఆత్మ... ఇలా కథకు కావలసిన అంశాలు ఉన్నాయి. కానీ, కథలో బలమే లేదు. చిన్నపాప ఇంటి నుండి పారిపోవాలని అనుకోవడానికి చెప్పే కారణం సహేతుకంగా అనిపించదు. ఆత్మ చేసే పనులు ప్రేక్షకులను పెద్దగా భయపెట్టవు. అలాగని, థ్రిల్ కూడా ఇవ్వవు. ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ కొంచెం పర్వాలేదనిపిస్తుంది. కానీ, అక్కడ ఎమోషన్ అంత స్ట్రాంగ్ గా లేదు. కథా రచయితగా, దర్శకుడిగానే కాదు... నటుడిగానూ రవిబాబు ఫామ్‌లో లేడు. దాంతో సన్నివేశాలు తేలిపోయాయి. ఫస్టాఫ్ అంతా రిపీటెడ్ సీన్స్ తో విసిగిస్తుంది. సెకండాఫ్ చివర్లో కొంచెం పర్లేదు. రవిబాబు సినిమాల్లో కెమెరా వర్క్, ఆర్ట్ వర్క్ బావుంటాయి. ఈ సినిమాలోనూ బావున్నాయి. అలాగని, కొత్తగా ఏమీ లేవు. రవిబాబు సినిమా నుండి ఊహించే కలర్ ప్యాట్రన్ లో ఉన్నాయి. ఇంకా చెప్పుకోవాలంటే... సినిమా యూరోపియన్ ఫర్నీచర్ కంపెనీ ఐక్యా (IKEA)కు తీసిన కమర్షియల్ యాడ్ టైపులో ఉంది. ప్రతి సన్నివేశంలోనూ ఐక్యా ఫర్నిచర్ ఎక్కువ హైలైట్ అవుతుంటుంది. నేపథ్య సంగీతం పర్వాలేదు.

ప్లస్ పాయింట్స్:
ఆర్ట్ వర్క్ 
కెమెరా వర్క్
ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్

మైనస్ పాయింట్స్:
బలహీనమైన కథ
డైలాగులు, దర్శకత్వం
థ్రిల్స్ లేకపోవడం
 
నటీనటులు:  
'హుషారు', 'శుభలేఖ+లు' సినిమాల్లో కథానాయికగా నటించిన ప్రియా వడ్లమాని తప్పిస్తే... మిగతా ఆర్టిస్టుల చేత దర్శకుడిగా రవిబాబు ఓవర్ యాక్టింగ్ చేయించారు. నటుడిగా ఆయన కూడా ఓవర్ యాక్షన్ చేశారు. బేబీ శ్రీముక్త చేత సెట్టిల్డ్ పెర్ఫార్మన్స్ చేయించారు. క్లైమాక్స్‌కి ముందు ప్రియా వడ్లమాని కనిపించేది కాసేపే అయినప్పటికీ, చక్కగా నటించింది. రవిబాబుకు ఈ సినిమాలో చేసినటువంటి పాత్రల్లో నటించడం కొత్త కాదు. నటుడిగా ఆయనకు సవాల్ విసిరే పాత్ర కూడా కాదు. కానీ, ఎందుకో ఓవర్ యాక్టింగ్ చేశారు. రవిబాబు భార్య పాత్రలో నటించిన లీనా సినిమా అంతా రెండు మూడు ఎక్స్‌ప్రెషన్స్‌తో ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. ఆత్మ ఆవహించినప్పుడు ఆమె ఇచ్చే ఎక్స్‌ప్రెషన్ భరించడం కష్టమే. ముక్తార్ ఖాన్, భరణీ శంకర్, కాశీ విశ్వనాథ్ తదితరులవి రొటీన్ పాత్రలే.

తెలుగుఒన్ ప్రోస్పెక్టివ్:
ప్రీ క్లైమాక్స్ ముందు వచ్చే ట్విస్ట్ మినహా సినిమాలో ఆకట్టుకునే అంశం మరొకటి లేదు. ఆ ట్విస్ట్ కూడా ఏమంత గొప్పగా ఉండదు. కొత్తగా ఇల్లు కట్టుకున్నవాళ్లు లేదా ఫ్లాట్స్ కొన్నవాళ్లు, ఇంటిని రీమోడలింగ్ చేయించుకోవాలని ఆలోచిస్తున్నవాళ్లు సినిమాకు వెళితే మంచిది. డైనింగ్ రూమ్, బెడ్ రూమ్, కిడ్స్ రూమ్, కిచెన్ రూమ్, స్టీమింగ్ రూమ్ గురించి ఒక ఐడియా వస్తుంది. సినిమా చూడటానికి వెళ్లాలని అనుకునేవారు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి. 

రేటింగ్: 1.25/5


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.