ENGLISH | TELUGU  

ఏబీసీడీ సినిమా రివ్యూ

on May 17, 2019


నటీనటులు: అల్లు శిరీష్, రుక్సార్ థిల్లాన్, భరత్, నాగబాబు, కోట శ్రీనివాసరావు, 'వెన్నెల' కిషోర్, 'శుభలేఖ' సుధాకర్, రాజా తదితరులు
నిర్మాణ సంస్థలు: మధుర ఎంటర్టైన్మెంట్, బిగ్ బెన్ సినిమాస్
పాటలు: భాస్కరభట్ల, కేకే, తిరుపతి 
సినిమాటోగ్రఫీ: రామ్ 
మాటలు: కల్యాణ్ రాఘవ
సంగీతం: జుడా సాంధీ 
సమర్పణ: డి. సురేష్ బాబు 
నిర్మాతలు: మధుర శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని 
దర్శకత్వం: సంజీవ్ రెడ్డి 
విడుదల తేదీ: మే. 17. 2019

హీరోగా సరైన హిట్టు కోసం ఆరేళ్లుగా అల్లు శిరీష్ ఎదురు చూస్తున్నాడు. 'కొత్త జంట', 'శ్రీరస్తు శుభమస్తు' విజయాలు దర్శకుల ఖాతాల్లో పడ్డాయి. తరవాత నటించిన మలయాళ సినిమా '1971: బియాండ్ బోర్డర్స్', 'ఒక్క క్షణం' ప్లాప్ కావడంతో అల్లు శిరీష్ కొంత గ్యాప్ తీసుకుని 'ఏబీసీడీ' చేశాడు. మలయాళంలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన 'ఏబీసీడీ'కి రీమేక్ ఇది. ఈ చిత్రమైనా అల్లు శిరీష్ కోరుకున్న విజయాన్ని అందించిందా? లేదా?  


కథ:

పాతికేళ్ల క్రితం అమెరికా వెళ్లి అక్కడే సెటిలైన మల్టీమిలీనియర్  (నాగబాబు) కుమారుడు అరవింద్ ప్రసాద్ అలియాస్ అవి (అల్లు శిరీష్). చిన్నతనం నుంచి డబ్బు మధ్య పెరుగుతాడు. డబ్బు అంటే లెక్క లేకుండా పెరుగుతాడు. మంచినీళ్ల ప్రాయంలా రోజుకు వెయ్యి డాలర్లు ఖర్చు పెడుతుంటాడు. కుమారుడి ఖర్చు చూసి తండ్రి భయపడతాడు. డబ్బు విలువ తెలిసేలా చేయాలని కుమారుణ్ణి, కుమారుడి స్నేహితుణ్ణి ఇండియాకి పంపిస్తాడు తండ్రి. నెలకు రూ.5000 మాత్రమే పంపించడం మొదలు పెడతాడు. లగ్జరీలకు అలవాటుపడ్డ అవి, ... క్రెడిట్ కార్డ్స్. లోన్స్ లేకుండా ఇండియాలో ఎన్ని కష్టాలు పడ్డాడు? డబ్బు విలువ ఎలా తెలుసుకున్నాడు? అతడి ప్రయాణంలో రాజకీయాలు ఎందుకు వచ్చాయి? ప్రేమించిన అమ్మాయి ఎటువంటి మద్దతు ఇచ్చింది? అనేది మిగతా కథ


ప్లస్ పాయింట్స్:

'వెన్నెల' కిషోర్ వినోదం
రుక్సార్ థిల్లాన్ గ్లామర్ 
జుడా సాంధీ పాటలు


మైనస్ పాయింట్స్:

రొటీన్ కథ
దర్శకత్వం
వినోదం లేకపోవడం
లవ్ ట్రాక్
సెకండాఫ్


విశ్లేషణ:

'పిల్ల జమిందార్'కు, మా చిత్రానికి సంబంధం లేదని 'ఏబీసీడీ' టీమ్ ఎంత చెప్పినా... థియేటర్లో ప్రేక్షకులకు సినిమా స్టార్టింగు నుంచి ఫస్టాఫ్ వరకూ 'పిల్ల జమిందార్' స్ఫూర్తితో తెరకెక్కిన చిత్రమిదని అర్థమవుతూ ఉంటుంది. రెండు సినిమాల్లో సన్నివేశాలు వేర్వేరు అయినప్పటికీ... సినిమా థీమ్, హీరో క్యారెక్టరైజేషన్, హీరోకి ఎదురైయ్యే సందర్భాలు దగ్గర దగ్గరగా ఉంటాయి. 'పిల్ల జమిందార్'లో హీరో పట్నం నుంచి పల్లెకు వస్తాడు. 'ఏబీసీడీ'లో హీరో అమెరికా నుంచి ఇండియా వస్తాడు. ఇద్దరూ రిచ్ కిడ్స్. డబ్బు మధ్యలో పెరిగిన హీరో, డబ్బు లేకుండా బతకడానికి ఎన్ని తిప్పలు పడ్డాడనేది రెండు సినిమాల్లో కాన్సెప్ట్. 'పిల్ల జమిందార్'లో హీరోలో మార్పుకు స్టూడెంట్ ఎన్నికలు ఉపయోగపడితే... 'ఏబీసీడీ'లోనూ ఎన్నికలు, గట్రా హడావిడి ఉంటుంది. రెండు సినిమాల మధ్య చాలా సారూప్యతలు కనపడతాయి. అయితే... 'పిల్ల జమిందార్'లో ఉన్న వినోదంలో సగం కూడా 'ఏబీసీడీ'లో లేదు. సెకండాఫ్ లో పొలిటికల్ ఎపిసోడ్ అయితే బోర్ కొట్టిస్తుంది. మలయాళ 'ఏబీసీడీ' దర్శకుడు 'పిల్ల జమిందార్' స్ఫూర్తితో కథ రాసుకుని ఉంటాడు. మళ్లీ రీమేక్ రూపంలో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో జుడా సాంధీ అందించిన  పాటల్లో 'మెల్ల మెల్లగా', 'నా అమెరికా అమెరికా' బావున్నాయి. నిర్మాణ విలువలు పర్వాలేదు.  


నటీనటుల పనితీరు:

అల్లు శిరీష్ పాత్రకు తగ్గట్టు హుషారుగా నటించే ప్రయత్నం చేశాడు. నటనతో కంటే అందంతో రుక్సార్ థిల్లాన్ ఎక్కువ ఆకట్టుకుంది. గ్లామ‌ర‌స్‌గా కనిపించింది. హీరో హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ సరిగా కుదరలేదు. నాగబాబు తనదైన శైలిలో చేసుకుంటూ వెళ్లారు. 'వెన్నెల' కిషోర్ ఉన్నంతలో నవ్వించాడు. భరత్ మాత్రం నవ్వించడంలో విఫలమయ్యాడు. మంత్రిగా శుభలేఖ సుధాకర్ బాగా చేశారు. ఆయన కుమారుడిగా విలన్ ఛాయలున్న పాత్రలో రాజా బదులు మరొకరిని తీసుకోవాల్సింది.


తెలుగుఒన్ ప్రోస్పెక్టివ్:

సినిమా ప్రారంభంలో సరదా సరదా సన్నివేశాలు, నవ్వులతో ముందుకు వెళ్లినా... మెల్ల మెల్లగా కథలోకి వెళ్లిన తరవాత ప్రేక్షకుల సహనానికి పరీక్షలు పెట్టే చిత్రమిది. 

రేటింగ్: 2.00

 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.