ENGLISH | TELUGU  

'A1 ఎక్స్‌ప్రెస్' మూవీ రివ్యూ

on Mar 5, 2021

 

సినిమా పేరు: A1 ఎక్స్‌ప్రెస్
తారాగ‌ణం: సందీప్ కిష‌న్‌, లావ‌ణ్యా త్రిపాఠి, రావు ర‌మేశ్‌‌, మురళీ శ‌ర్మ‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, ప్రియ‌ద‌ర్శి, స‌త్యా, రాహుల్ రామ‌కృష్ణ‌, మ‌హేష్ విట్టా, ర‌ఘుబాబు, అభిజిత్‌, భూపాల్‌, ఖ‌య్యుమ్‌, సుద‌ర్శ‌న్‌, శ్రీ‌రంజ‌ని, ద‌యా గురుస్వామి
సాహిత్యం: రామ‌జోగ‌య్య శాస్త్రి, సామ్రాట్‌
మ్యూజిక్‌:  హిప్ హాప్ త‌మిళ‌
సినిమాటోగ్ర‌ఫీ: కెవిన్ రాజ్‌
ఎడిటింగ్‌: చోటా కె. ప్ర‌సాద్‌
ఆర్ట్‌: అలీ
స‌హ నిర్మాత‌: వివేక్ కూచిభొట్ల‌
నిర్మాత‌లు: టి.జి. విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషెక్ అగ‌ర్వాల్‌, సందీప్ కిష‌న్‌, ద‌యా ప‌న్నెం
ద‌ర్శ‌కుడు: డెన్నిస్ జీవ‌న్ కానుకొల‌ను
విడుద‌ల తేదీ: 5 మార్చి 2021

శానా కాలంగా ఒక జ‌బ‌ర్ద‌స్త్‌ హిట్టు కోసం త‌పిస్తోన్న సందీప్ కిష‌న్ త‌ను ఓ ప్రొడ‌క్ష‌న్ పార్ట‌న‌ర్‌గా ఉండి, మ‌రో మూడు ప్రొడ‌క్ష‌న్ హౌస్‌ల‌తో క‌లిసి ప్రొడ్యూస్ చేసిన సిన్మా 'ఏ1 ఎక్స్‌ప్రెస్'‌. త‌మిళ్‌లో మంచిగ ఆడిన 'న‌ట్‌పే తునై' అనే మూవీని న‌మ్ముకొని, దాన్ని తెలుగులో రీమేక్ చేసిన్ర‌న్న మాట‌. ఈ సిన్మాతోని డెన్నిస్ జీవ‌న్ కానుకొల‌ను అనే డైరెక్ట‌ర్ ప‌రిచ‌య‌మ‌య్యిండు. టాలీవుడ్‌ల తీసిన ఫ‌స్ట్ హాకీ బేస్డ్ ఫిల్మ్‌గా మ‌స్తు ప‌బ్లిసిటీ పొందిన 'ఏ1 ఎక్స్‌ప్రెస్'‌ల సందీప్ కిష‌న్ జోడీగ లావ‌ణ్యా త్రిపాఠి చేసింది. మ‌రి గీ సిన్మా ఎట్టున్న‌దో చూద్దాం ప‌దుండ్రి. 

క‌థ‌
సంజు అనే పోర‌గాడు యానాలం ఉండేటి ఆళ్ల మేన‌మామ ఇంటికి వ‌స్త‌డు. ఆ ఊర్ల చిట్టిబాబు హాకీ గ్రౌండ్ అని ఒక‌టుంట‌ది. మ‌న‌కి ఇండిపెండెన్స్ వ‌చ్చిన‌ప్పుడు ఫ్రెంచివాళ్ల‌తో హాకీ ఆడి, చిట్టిబాబు కెప్టెన్‌గా ఉండే మ‌న టీమ్ గెల్చి ఆ గ్రౌండ్‌ను కాపాడుకుంట‌ది. అంతోటి హిస్ట‌రీ ఉన్న ఆ గ్రౌండ్ మీద ఓ మ‌ల్టీనేష‌న‌ల్ మెడిక‌ల్ కంపెనీ క‌న్ను ప‌డ‌త‌ది. లంచాలు మింగే స్పోర్ట్స్ మినిస్ట‌ర్ రావు ర‌మేశ్ ఆ కంపెనీతోని మిలాఖ‌త్ అయ్యి ఆ గ్రౌండ్‌ని ఆ కంపెనీకి అప్ప‌జెప్పాల‌ని జూస్త‌డు. గ‌ప్పుడు ప్రెజెంట్ హాకీ కోచ్ ముర‌ళి ఆ గ్రౌండ్‌ను కాపాడుకోని ఏం జేసిండు? స‌ంజు ఆ కోచ్‌కు ఎట్లా హెల్ప్ జేసిండు? అస‌లు సంజు అలియాస్ సందీప్ నాయుడు అస‌లు క‌తేంది? అనేది 'ఏ1 ఎక్స్‌ప్రెస్' క‌త‌.

విశ్లేష‌ణ‌
సిన్మాలోని మెయిన్ పాయింట్ స‌మ‌జ్ అయింది గ‌దా.. చిట్టిబాబు హాకీ గ్రౌండ్‌ను స్పోర్ట్స్ మినిస్ట‌ర్ నుంచీ, అ‌త‌న్ని న‌మ్ముకున్న ఎంఎన్‌సీ కంపెనీ నుంచీ సందీప్‌, హాకీ కోచ్ క‌లిసి ఎట్టా ర‌క్షించుకున్నార‌న్న‌దే ఆ పాయింట్‌. ఇది విన‌గానే యెంట‌నే మ‌న‌కి రాజ‌మౌళి సిన్మా 'సై' గుర్తుకు వ‌చ్చేసింది గ‌దా! అక్క‌డ కూడా త‌మ గ్రౌండ్‌ని కాపాడుకొనీకి నితిన్ బ్యాచ్ విల‌న్ ప్ర‌దీప్ రావ‌త్ బ్యాచ్‌తో ర‌గ్బీ ఆడి, గెలుస్త‌ది. ఆ పాయింట్ చుట్టూ మంచి ఎమోష‌న్‌ని, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ని అల్లుకొని రాజ‌మౌళి ఆ సిన్మా తీసిండు. ఆ ఎమోష‌న్ విష‌యంల, ఎంట‌ర్‌టైన్‌మెంట్ విష‌యంల‌ 'ఏ1 ఎక్స్‌ప్రెస్' స‌గ‌మే స‌క్సెస్ అయ్యింది. 

ఎందుకంటే "సై" సిన్మాల గ్రౌండ్.. నితిన్ చ‌దువుకొనే కాలేజీది అవ‌డంతోని అత‌ని బాధ ఆడియెన్స్ బాధ‌య్యింది. మ‌రి 'ఏ1 ఎక్స్‌ప్రెస్‌'ల‌? ఈ గ్రౌండ్‌తోని సందీప్‌ క్యారెక్ట‌ర్‌కు ఉన్న సంబంధం శానా చిన్న‌ది. అది అత‌ని మేన‌మామ ఊర్ల ఉన్న గ్రౌండ్‌. అక్క‌డ్నే అత‌ని ల‌వ‌ర్ లావ‌ణ్య ఆడుతుంట‌ది. అంతే సంబంధం. అందుక‌నే సందీప్ నాయుడు బాధ ఆడియెన్స్ బాధ అయ్యే చాన్సులు త‌క్కువ‌. దాని కోసం స్క్రిప్ట్‌లో ఏం జేసిన్రంటే.. సందీప్‌కు ఓ ఫ్లాష్‌బ్యాక్ పెట్టి, ఆ స్టోరీలో గ‌త‌డ్ని నేష‌న‌ల్‌ హాకీ ప్లేయ‌ర్‌గా జూపెట్టి, హాకీలోని పాలిటిక్స్ వ‌ల్ల ఓ ఫ్రెండ్‌ను కోల్పోయేట‌ట్లు చేసిన్రు. క్లైమాక్స్‌లో ఆ ఎమోష‌న్‌ని వాడుకోవాల్న‌ని జూసిన్రు. కానీ అది హేఫ్ బేక్డ్ ఎమోష‌న్ కింద మారింది. గందుకే సిన్మా హాల్లోంచి బ‌య‌ట‌కు వ‌చ్చేట‌ప్పుడు ఏమంత ఫీల్ క‌ల‌గ‌దు మ‌న‌కి.

సిన్మాల క్యారెక్ట‌ర్ల‌కు వాటిని జేసిన యాక్ట‌ర్ల పేర్లే పెట్ట‌డం గ‌మ‌నించాల‌. సందీప్‌, లావ‌ణ్య‌, రావు ర‌మేశ్, ముర‌ళి, ద‌ర్శి, రాహుల్‌, ర‌ఘు.. ఇట్లా యాక్ట‌ర్ల పేర్లే వాటిని జేసిన క్యారెక్ట‌ర్ల‌కు పెట్టిన్రు. 'ఏ1 ఎక్స్‌ప్రెస్' జూసినంక మ‌న‌కి స్పోర్ట్స్‌ని ఎట్లా పొలిటీషియ‌న్లు శాసిస్తుంట‌రో స‌మ‌జైత‌ది. ఎవ‌ర్ని ఆడించాల‌, ఎవ‌ర్ని తీసేయాల, ఎవ‌రి కెరీర్‌ల‌ని ఆగ‌మాగం జెయ్యాల‌ అనేటివి క‌ర‌ప్టెడ్ కోచ్‌లు ఎట్ల చేస్తుంట‌రో స‌మ‌జైత‌ది. సందీప్‌, లావ‌ణ్య మ‌ధ్య కెమిస్ట్రీ అయితే మంచిగ పండింది. 

'ఏ1 ఎక్స్‌ప్రెస్‌'కు ఒరిజిన‌ల్ అయిన త‌మిళ్ ఫిల్మ్ 'న‌ట్‌పే తునై'లో హీరోగా జేసి, మ్యూజిక్ కొట్టిన‌ హిప్ హాప్ త‌మిళ తెలుగు రీమేక్‌కీ మ్యూజిక్ ఇచ్చిండు. నాలుగు పాట‌ల్లో "సింగిల్ కింగులం", "అమిగో" పాటలు క్యాచీగా ఉండి, చూడ్డానికీ బాగున్నై. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా మంచిగ‌నే కొట్టిండు. కెవిన్ రాజ్ సినిమాటోగ్ర‌ఫీ బాగానే ఉంది కానీ, కొన్ని సీన్ల‌ల్ల క‌ల‌ర్ కాంబినేష‌న్ డ‌ల్ అయిపోయి, మంచిగ అనిపిచ్చ‌లేదు. చోటా కె. ప్ర‌సాద్ ఎడిటింగ్ ఫ‌ర్వాలేదు. ప్రొడ‌క్ష‌న్ వాల్యూస్ మంచిగ‌నే అనిపిచ్చిన‌య్‌.

న‌టీన‌టుల అభిన‌యం
హాకీ గ్రౌండ్‌ను కాపాడుకోవాల‌నే కోచ్ ఆశ‌యంలో భాగ‌మ‌య్యే నేష‌న‌ల్ హాకీ ప్లేయ‌ర్ సందీప్ నాయుడు అలియాస్ సంజుగా సందీప్ కిష‌న్ కొత్త‌గా క‌నిపిచ్చిండు. జ‌న‌ర‌ల్‌గా జోవియ‌ల్ క్యారెక్ట‌ర్ల‌లో సందీప్‌ను జూసుడు అల‌వాటైన మ‌న‌కి కొంచెం జోవియ‌ల్‌, ఎక్కువ సీరియ‌స్‌నెస్ ఉన్న క్యారెక్ట‌ర్ల చూడ్డం కొత్త‌గ‌నే ఉంట‌ది క‌దా. త‌నైతే ఆ క్యారెక్ట‌ర్‌ను చేయ‌నీకి బాగానే క‌ష్ట‌ప‌డిండు. మ‌న‌ల్ని ఇంప్రెస్ చేయ‌నీకి ట్రై చేసిండు. హీరోయిన్ లావ‌ణ్య‌గా లావ‌ణ్యా త్రిపాఠి మ‌స్తు బ్యూటీగా ఉంది. త‌న క్యారెక్ట‌ర్‌ను ఎట్టాంటి వంక పెట్ట‌లేని విధంగా మంచిగ చేసింది. 

గైతే ఈ సిన్మాల ప‌ర్ఫార్మెన్స్‌ల ప‌రంగా జూస్తే.. ఇద్ద‌రు యాక్ట‌ర్లు ఒక‌రితో ఒక‌రు ఢీకొట్టిన్రు. ఆళ్లు.. హాకీ కోచ్ ముర‌ళిగా యాక్ట్ చేసిన ముర‌ళీశ‌ర్మ‌, క‌ర‌ప్టెడ్ స్పోర్ట్స్ మినిస్ట‌ర్‌గా జేసిన రావు ర‌మేశ్‌. 'అల‌.. వైకుంఠ‌పుర‌ములో' సిన్మాల నెగ‌టివ్‌ క్యారెక్ట‌ర్‌ల దున్నేసిన ముర‌ళీశ‌ర్మ‌, ఈ మూవీల పాజిటివ్ క్యారెక్ట‌ర్‌ల అద‌ర‌హో అనిపిచ్చిండు. మ‌న‌కున్న మంచి మెథ‌డ్ యాక్ట‌ర్స్‌లో ఒక‌డిగా ఇంగోమాల ప్రూవ్ జేసిండు. గ‌ట్ల‌నే నెగిటివ్ రోల్‌ల రావు ర‌మేశ్ ప‌ర్ఫార్మెన్స్ ఇస్తుంటే సూప‌ర్ అనిపిస్త‌ది. 

సంజు మేన‌మామ‌గా పోసాని కృష్ణ‌ముర‌ళి, ఆయ‌న కొడుకుగా స‌త్యా, స్పోర్ట్స్ డైరెక్ట‌ర్ ర‌ఘుగా ర‌ఘుబాబు, సందీప్ ఫ్రెండ్స్‌గా రాహుల్ రామ‌కృష్ణ‌, ప్రియ‌ద‌ర్శి, బ్యాడ్ కోచ్‌గా ద‌యానంద్‌ త‌మ పాత్ర‌ల‌కు త‌గ్గ‌ట్లు యాక్ట్ జేసిన్రు. గ‌ప్పుడెప్పుడో గ్రౌండ్‌ను కాపాడుకున్న చిట్టిబాబు టీమ్‌ల ఉండి, గిప్పుడు ముస‌లోడై, ఆ గ్రౌండ్‌లోనే కూల్‌డ్రింకులు అమ్ముకుంటున్న తాత రోల్ జేసిన ముస‌లాయ‌న‌, ఆయ‌న మ‌న‌వ‌డిగా విట్టా మ‌హేశ్ కూడా ఇంప్రెస్ జేసిన్రు.

తెలుగువ‌న్ ప‌ర్‌స్పెక్టివ్‌
ఓవ‌రాల్‌గ.. 'ఏ1 ఎక్స్‌ప్రెస్' అనేది ఎమోష‌న్స్ మంచిగ పండ‌ని, ర‌న్నింగ్‌ల ప్యాసింజ‌ర్ బండి లెక్క‌న ఉన్న సిన్మా అని జెప్పాలె.

రేటింగ్‌: 2.5/5

- బుద్ధి య‌జ్ఞ‌మూర్తి


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.