Home

»

Latest News

'ప్రాణం ఖరీదు' వెనుక ఉన్న సీక్రెట్స్: చిరంజీవి ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా.?

Sep 22, 2026 11:53AM

సెప్టెంబర్ 22, 1978. సరిగ్గా ఇదే రోజున 'ప్రాణం ఖరీదు' అనే ఒక సినిమా థియేటర్లలోకి వచ్చింది. ఆరోజే తెలుగు తెరకు ‘చిరంజీవి’ అనే ఒక కొత్త తార పరిచయమయ్యారు. నేటితో ఈ అద్భుతమైన సినిమా వచ్చి సరిగ్గా 48 ఏళ్ళు పూర్తి చేసుకుంది. కానీ, ఈ సినిమా వెనుక ఉన్న అసలు కథ, ఇప్పటికీ చాలామందికి తెలియని ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలు ఉన్నాయి.

అసలు శివశంకర వరప్రసాద్ అనే ఒక సామాన్యమైన కుర్రాడు.. 'చిరంజీవి'గా మారిన ప్రయాణం ఒక సంచలనం. చెన్నై ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో నటన నేర్చుకుంటున్న రోజుల్లోనే, ఆయనలోని అపారమైన ప్రతిభను, విలక్షణమైన ముఖకవళికలను దర్శకుడు కె. వాసు గమనించారు. అప్పట్లో సి.ఎస్. రావు రాసిన ప్రముఖ నాటకం 'ప్రాణం ఖరీదు' ఆధారంగా ఒక సినిమా తీయాలని నిర్మాత క్రాంతి కుమార్ భావించారు. ఆ సినిమాలో 'నరసింహా' అనే ఒక ఛాలెంజింగ్ రోల్ కోసం కొత్త ముఖం కావాల్సి వచ్చింది. అలా చిరంజీవికి ఆ అవకాశం దక్కింది.

ఇక్కడొక పెద్ద ట్విస్ట్ ఏంటంటే.. చిరంజీవి మొదట నటించిన సినిమా 'పునాదిరాళ్లు'. కానీ సాంకేతిక కారణాల వల్ల ఆ సినిమా విడుదల ఆలస్యమైంది. దానికంటే తర్వాత మొదలైన 'ప్రాణం ఖరీదు' సినిమానే ముందుగా విడుదలై చిరంజీవికి తొలి చిత్రంగా చరిత్రలో నిలిచిపోయింది. ఇక ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు చిరంజీవి డెడికేషన్ చూసి ఇండస్ట్రీ పెద్దలంతా ఆశ్చర్యపోయారు. క్లైమాక్స్ సీన్స్ కోసం ఆయన పడిన శ్రమ, చూపించిన ఎమోషన్స్ థియేటర్లలో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి.

ఇది కూడా చదవండి: నా ఓటమిని కోరుకునే వారికి ఒకటే చెప్తున్నా.. నాని వైల్డ్ ఫైర్ స్పీచ్.!

ఇక ఈ సినిమా కోసం చిరంజీవికి వచ్చిన తొలి పారితోషికం.. కేవలం ఒక వెయ్యి నూట పదహారు రూపాయలు (రూ. 1116/-). ఆ చిన్న మొత్తంతో మొదలైన ప్రయాణం, ఆ తర్వాత దశాబ్దాల పాటు తెలుగు చలనచిత్ర రంగాన్నే శాసించే స్థాయికి చేరింది అంటే దానికి కారణం ఆయన కష్టం, పట్టుదల.

రావుగోపాలరావు, జయసుధ, చంద్రమోహన్ వంటి సీనియర్ నటీనటుల మధ్యలో.. తన ప్రత్యేకమైన మాడ్యులేషన్, నటనతో చిరంజీవి తన మార్కును స్పష్టంగా చూపించారు. 'ప్రాణం ఖరీదు' కేవలం ఒక సినిమా మాత్రమే కాదు.. తెలుగు చిత్రసీమకు ఒక "మెగాస్టార్"ను బహుమతిగా ఇచ్చిన ఒక చారిత్రాత్మక చిత్రం.

దిగ్గజ నటుడు కోట శ్రీనివాసరావు కూడా 'ప్రాణం ఖరీదు' సినిమాతోనే వెండితెరకు నటుడిగా పరిచయం కావడం విశేషం. 

మీకు నచ్చవచ్చు: 
ఒకే సినిమాలో ముగ్గురు మెగాస్టార్లు.. ఆ సినిమా కోసం ద‌ర్శ‌కేంద్రుడు చేసిన సాహసం ఇదే!
ట్రిపుల్ రోల్: టాలీవుడ్‌లో తోపు యాక్టర్ ఎవరు?

 

 

 

[48 Years Of Pranam Khareedu, 48 Years For Pranam Khareedu, Pranam Khareedu Unknown Facts, Chiranjeevi First Remuneration, Chiranjeevi First Movie, Chiranjeevi Debut Movie, Megastar Chiranjeevi, Pranam Khareedu Movie, Telugu Film News, Telugu News]
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com