45 ఏళ్ల 'యవ్వనం కాటేసింది'!
on Jan 24, 2021

దాసరి నారాయణరావు డైరెక్ట్ చేసిన 'యవ్వనం కాటేసింది' సినిమాకు జనవరి 23తో 45 ఏళ్లు నిండాయి. కృష్ణంరాజు, జయచిత్ర, మురళీమోహన్ ప్రధాన పాత్రధారులైన ఈ సినిమా 1976 జనవరి 23న విడుదలై సక్సెస్‌ఫుల్‌గా ఆడింది. ఒకప్పుడు అగ్రశ్రేణి దర్శకుడిగా రాణించిన విజయ బాపినీడుకు నిర్మాతగా ఇది తొలి చిత్రం కావడం గమనార్హం. శ్యాంప్రసాద్ ఆర్ట్ పిక్చర్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రానికి మాగంటి రవీంద్రనాథ్ చౌదరి, శ్యాంప్రసాద్ కూడా నిర్మాణ భాగస్వాములు.
తమిళంలో సుజాత నటించగా విజయం సాధించిన 'మయంగు గిరాళ ఒరుమాధు' చిత్రానికి 'యవ్వనం కాటేసింది' రీమేక్. హాస్టల్‌లో ఉంటూ కాలేజీలో చదువుకునే కల్పన అనే అమ్మాయి రాజు అనే యువకుడి మాయమాటలను నమ్మి, అతనిని ప్రేమించి, ఓ బలహీన క్షణంలో అతడికి శారీరకంగా లొంగిపోతుంది. ఆ తర్వాత కొన్ని రోజులకు రాజు కనిపించకుండా పోతాడు. అతడి కోసం ఎదురుచూసి, తప్పనిసరి పరిస్థితుల్లో మరో వ్యక్తిని వివాహమాడుతుంది కల్పన. వారిద్దరి దాంపత్యం ఆనందకరంగా సాగుతున్న వేళ, రాజు ఆ ఇంటి కారు డ్రైవర్‌గా ప్రత్యక్షమవుతాడు. ఆ తర్వాత కల్పన జీవితం ఏమయ్యిందనేది క్లైమాక్స్.
కల్పన పాత్రను జయచిత్ర చేయగా, రాజుగా మురళీమోహన్, కల్పన భర్తగా కృష్ణంరాజు నటించారు. రావు గోపాలరావు, కొమ్మినేని, పర్వతనేని భాస్కరరావు, టి. పద్మిని, బేబి విజయ కీలక పాత్రధారులు. చక్రవర్తి సంగీతం సమకూర్చగా, కన్నప్ప సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేశారు. దాసరి దర్శకత్వంలో జయచిత్రకు ఇదే తొలి చిత్రం. కృష్ణంరాజు, జయచిత్రపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి శోభన్‌బాబు క్లాప్ కొట్టారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



