`జస్టిస్ చౌదరి`గా ఎన్టీఆర్ మెస్మరైజ్ చేసి నేటికి 40 ఏళ్ళు!
on May 28, 2022
నటరత్న నందమూరి తారక రామారావు - దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు కాంబినేషన్ లో వచ్చిన చిత్రాల్లో సింహభాగం బాక్సాఫీస్ ని షేక్ చేశాయి. వాటిలో `జస్టిస్ చౌదరి` ఒకటి. జస్టిస్ చౌదరిగా, రాముగా ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రంలో అతిలోక సుందరి శ్రీదేవి, ఊర్వశి శారద, జయంతి, రావుగోపాల రావు, సత్యనారాయణ (ద్విపాత్రాభినయం), అల్లు రామలింగయ్య, నాగేశ్, ప్రభాకర్ రెడ్డి, చలపతి రావు, శ్రీధర్, రాజా, రాజ్యలక్ష్మి, ముచ్చర్ల అరుణ, సుభాషిణి ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. సత్యానంద్ కథను అందించారు. చట్టానికి, న్యాయానికి, ధర్మానికి విలువనిచ్చే ఆర్.కె. చౌదరి అనే ఓ జస్టిస్ కథే.. ఈ చిత్రం.
చక్రవర్తి బాణీలు కట్టిన ఈ చిత్రానికి వేటూరి సుందరరామ్మూర్తి సాహిత్యమందించారు. ``నీ తొలి చూపులోనే``, ``ముద్దు మీద ముద్దు``, ``ఒకటో నంబర్``, ``నీ చెక్కిలి వెల``, ``శ్రీలక్ష్మి పెళ్ళికి``, ``చట్టానికి న్యాయానికి``, ``అబ్బ ముసురేసింది``.. ఇలా ఇందులోని పాటలన్నీ విశేషాదరణ పొందాయి. విజయలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై టి. త్రివిక్రమ రావు నిర్మించిన `జస్టిస్ చౌదరి`.. హిందీలో `జస్టిస్ చౌదరి`గానూ, తమిళంలో `నీతిపతి`గానూ, మలయాళంలో `జస్టిస్ రాజా`గానూ రీమేక్ అయింది. 1982 మే 28న ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్ గా రిలీజై అఖండ విజయం సాధించిన `జస్టిస్ చౌదరి`.. నేటితో 40 వసంతాలు పూర్తిచేసుకుంది.
Also Read