
తెలుగు సినీ చరిత్రలో కొన్ని సినిమాలు కేవలం హిట్లుగా మిగిలిపోవు, అవి ఒక శకాన్ని సృష్టిస్తాయి. సరిగ్గా 35 ఏళ్ల క్రితం, 1991 మే 9న విడుదలైన ‘గ్యాంగ్ లీడర్’ (Gang Leader) అటువంటి సంచలనమే. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)ని బాక్సాఫీస్ వద్ద అజేయమైన నంబర్ వన్ స్థానంలో కూర్చోబెట్టిన ఈ సినిమా, నేటికీ మాస్ సినిమాలకు ఒక గైడ్‌లా నిలుస్తోంది.
సంచలన రికార్డులు
విజయ బాపినీడు దర్శకత్వంలో వచ్చిన ‘గ్యాంగ్ లీడర్’ మూవీ అప్పట్లో కనీవినీ ఎరుగని రీతిలో వసూళ్ల వర్షం కురిపించింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.10 కోట్ల షేర్ వసూలు చేసి, అప్పట్లో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రంగా నిలిచింది. 50కి పైగా కేంద్రాల్లో 100 రోజులు, కొన్ని ప్రధాన కేంద్రాల్లో 200 రోజులకు పైగా ప్రదర్శితమై రికార్డు సృష్టించింది.
ఈ సినిమా సక్సెస్‌తోనే చిరంజీవి భారతీయ సినీ చరిత్రలో రూ.1.25 కోట్ల పారితోషికం అందుకున్న తొలి హీరోగా వార్తల్లో నిలిచారు. ఇది అప్పట్లో అమితాబ్ బచ్చన్ పారితోషికం కంటే ఎక్కువ.
‘గ్యాంగ్ లీడర్’ వెనుక ఆసక్తికర కథ
నిజానికి ఈ సినిమాకు మొదట అనుకున్న కథ ఇది కాదు. విజయ బాపినీడు తన పాత చిత్రం 'బొమ్మరిల్లు' తరహా ఫ్యామిలీ డ్రామాను నాగబాబుతో చేయాలనుకున్నారు. కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. అయితే చిరంజీవి డేట్స్ ఇవ్వడంతో ఆ కథలో మార్పులు చేశారు. అది చిరంజీవికి అంతగా నచ్చకపోవడంతో, పరుచూరి బ్రదర్స్ రంగంలోకి దిగి ఆ కథకు మెరుగులు దిద్ది మెగాస్టార్ ను మెప్పించారు.
‘గ్యాంగ్ లీడర్’ టైటిల్ వెనుక కూడా ఆసక్తికర కథ ఉంది. రచయిత సత్యమూర్తి (దేవిశ్రీ ప్రసాద్ తండ్రి) అప్పట్లో 'మెగాస్టార్' మ్యాగజైన్‌లో ‘గ్యాంగ్ లీడర్’ పేరుతో ఒక సీరియల్ రాసేవారు. ఆ పేరు నచ్చడంతో బాపినీడు దీనినే సినిమా టైటిల్‌గా ఖరారు చేశారు.
‘గ్యాంగ్ లీడర్’ ప్రత్యేకతలు
"చెయ్యి చూశావా ఎంత రఫ్ గా ఉందో.." వంటి డైలాగులు, చిరు మేనరిజమ్స్ యువతను ఉర్రూతలూగించాయి. బప్పీలహరి అందించిన మ్యూజిక్ ఈ సినిమాకు ప్రాణవాయువు. ముఖ్యంగా "వాన వాన వెల్లువాయే" పాట ఇప్పటికీ ఎవర్ గ్రీన్ చార్ట్ బస్టర్. విజయశాంతి, రావు గోపాల్ రావు, ఆనందరాజ్, శరత్ కుమార్ వంటి హేమాహేమీల నటన సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది.
‘గ్యాంగ్ లీడర్’ కేవలం ఒక యాక్షన్ సినిమా మాత్రమే కాదు, అది ఒక పక్కా ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న డ్రామా. 35 ఏళ్లు గడిచినా, ఆ సినిమాలోని స్టైల్, మేనరిజమ్స్, సాంగ్స్ ఇప్పటికీ ఫ్రెష్‌గా అనిపిస్తాయి. మెగాస్టార్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన ఈ చిత్రం, భవిష్యత్ తరాల మాస్ హీరోలకు ఎప్పటికీ ఒక పాఠంలా ఉంటుంది.






