ఇండస్ట్రీ హిట్ 'పసివాడి ప్రాణం' 35 ఏళ్ల క్రితం విడుదలైంది ఈరోజే!
on Jul 23, 2022

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో 1987కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆయన ఇండస్ట్రీలో నంబర్‌వన్ స్టార్‌గా మారింది ఈ ఏడాదే. ఎ. కోదండరామిరెడ్డి డైరెక్షన్‌లో వచ్చిన 'పసివాడి ప్రాణం' ఇండస్ట్రీ హిట్‌గా నిలిచి చిరు క్రేజ్‌ను మాస్‌లో ఎన్నో రెట్లు పెంచేసింది. ఆయన దర్శకత్వంలోనే వచ్చిన 'దొంగమొగుడు' బ్లాక్‌బస్టర్ హిట్. కె. విశ్వనాథ్ రూపొందించిన 'స్వయంకృషి' నటునిగా చిరంజీవి స్థాయిని పెంచింది. 1978లో 'ప్రాణం ఖరీదు' చిత్రంతో నటునిగా చిత్రసీమలోకి అడుగుపెట్టిన చిరు, 1983లో వచ్చిన 'ఖైదీ' సినిమాతో స్టార్ హోదాను అందుకోగా, 1987 నాటికి టాప్ స్టార్ అయ్యారు. కేవలం తొమ్మిదేళ్ల కాలంలో ఆ రేంజ్‌కు ఎదగడం వెనుక ఆయన పడ్డ కష్టం అనితరసాధ్యం.
'ఖైదీ'కి, 'పసివాడి ప్రాణం'కు డైరెక్టర్ ఎ. కోదండరామిరెడ్డి కావడం గమనార్హం. 1987 జూలై 23న విడుదలైన 'పసివాడి ప్రాణం' 10 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకున్న తొలి చిరంజీవి చిత్రం కావడం, అలాగే డైరెక్టుగా సిల్వర్ జూబ్లీ జరుపుకున్న తొలి చిత్రం కావడం విశేషం.
మలయాళంలో మమ్ముట్టి హీరోగా ఫాజిల్ డైరెక్షన్‌లో వచ్చిన సూపర్ హిట్ ఫిల్మ్ 'పూవిను పుథియ పూంతెన్నాళ్' (1986)కు 'పసివాడి ప్రాణం' రీమేక్. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ నిర్మించిన ఈ సినిమాలో చిరు జోడీగా విజయశాంతి నటించగా, బేబీ సుజిత, రఘువరన్, బాబ్ ఆంటోని, కన్నడ ప్రభాకర్, బ్రహ్మానందం, రాజ్యలక్ష్మి, అల్లు రామలింగయ్య, జగ్గయ్య, గుమ్మడి, గిరిబాబు కీలక పాత్రలు చేశారు. చిరంజీవి భార్యగా సుమలత అతిథి పాత్ర చేశారు. ఒరిజినల్‌లో చేసిన పాత్రనే ఈ మూవీలోనే బేబీ సుజిత చేసింది. విలన్లుగా నటించిన రఘువరన్, బాబ్ ఆంటోనీ ఇద్దరికీ ఇదే తొలి తెలుగు చిత్రం.
మ్యూజికల్‌గా కూడా 'పసివాడి ప్రాణం' అత్యంత ప్రజాదరణ పొందింది. చక్రవర్తి బాణీలు కూర్చిన సత్యం శివం సుందరం, అందం శరణం గచ్ఛామి, ఇదేదో గోలగా ఉంది, కాశ్మీరు లోయలో కన్యాకుమారిలో, చక్కని చుక్కల సందిట బ్రేక్ డాన్స్ సాంగ్స్ బాగా పాపులర్ అయ్యాయి. తెలుగులో మొట్టమొదటి బ్రేక్ డాన్స్ సాంగ్‌గా 'చక్కని చుక్కల సందిట' పేరు తెచ్చుకుంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



