మ్యూజికల్ ఎంటర్టైనర్ `శ్రీనివాస కళ్యాణం`కి 34 ఏళ్ళు!
on Sep 25, 2021

మ్యూజికల్ హిట్స్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన నిర్మాణ సంస్థల్లో యువచిత్ర ఆర్ట్స్ ఒకటి. పుష్కరకాలం పాటు అలరించిన ఈ నిర్మాణసంస్థ మొత్తంగా తొమ్మిది చిత్రాలను నిర్మించగా.. వాటన్నింటికీ స్వరబ్రహ్మ కేవీ మహదేవన్ బాణీలు అందించారు. ఆ చిత్రాల్లో.. విక్టరీ వెంకటేశ్ కథానాయకుడిగా నటించిన `శ్రీనివాస కళ్యాణం` ఒకటి. శతాధిక చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ రూపొందించిన ఈ రొమాంటిక్ డ్రామాలో వెంకీకి జంటగా భానుప్రియ, గౌతమి నటించగా.. గొల్లపూడి, మోహన్ బాబు, వై. విజయ, వరలక్ష్మి, సుత్తి వేలు, వంకాయల, శుభలేఖ సుధాకర్, ప్రసాద్ బాబు, అనిత, శ్రీలక్ష్మి, కల్పనా రాయ్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు.
చిన్నప్పటి నుంచి తను ఎంతగానో ప్రేమించే బావ శ్రీనివాస్ (వెంకటేశ్) కోసం ఏమైనా చేసే మరదలు సరోజ అలియాస్ స్వప్న (గౌతమి) కథే.. ఈ `శ్రీనివాస కళ్యాణం`. బావ సంతోషం కోసం తన ప్రేమను సైతం త్యాగం చేసే సరోజ పాత్రే ఈ చిత్రానికి ప్రధాన బలం. నవరస సమ్మేళనంగా రూపొందిన ఈ మ్యూజికల్ ఎంటర్టైనర్ కి కేవీ మహదేవన్ సంగీతం మెయిన్ ఎస్సెట్ గా నిలిచింది. పాటల్లో ``తుమ్మెద ఓ తుమ్మెద``, ``ఎందాకా ఎగిరేవమ్మా`` చార్ట్ బస్టర్స్ గా నిలవగా.. ``జాబిల్లి వచ్చి``, ``కదలిక కవళిక``, ``తొలి పొద్దుల్లో``, ``అనుకోని అనుకోని`` కూడా అలరించాయి. 1987 సెప్టెంబర్ 25న విడుదలై జననీరాజనాలు అందుకున్న `శ్రీనివాస కళ్యాణం`.. నేటితో 34 వసంతాలు పూర్తిచేసుకుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



