Home

»

Latest News

30 ఏళ్ల ‘భామనే సత్యభామనే’: ఆడవేషంలో కమల్ హాసన్.. మేకప్ వెనుక అసలు కథ తెలుసా.?

Nov 10, 2026 5:11PM

సినిమాల్లో నటీనటులు విభిన్నమైన పాత్రలు చేయడం సహజం. కానీ ఒక పాత్ర కోసం తమ రూపురేఖలనే పూర్తిగా మార్చేసుకోవడం, ఆ పాత్రలో ప్రేక్షకులు నటుడిని గుర్తుపట్టలేనంతగా ఒదిగిపోవడం మాత్రం కొందరికే సాధ్యం. అలాంటి ప్రయోగాలు చేయడంలో లోకనాయకుడు కమల్ హాసన్ ఎప్పుడూ ముందుంటారు. ఆయన కెరీర్‌లో ఎన్నో విలక్షణమైన పాత్రలు ఉన్నప్పటికీ.. ఆడవేషంలో కనిపించి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ‘భామనే సత్యభామనే’ మాత్రం ప్రత్యేకం.

కమల్ హాసన్, మీనా జంటగా నటించిన ఈ సినిమా తమిళంలో ‘అవ్వై షణ్ముగి’ పేరుతో తెరకెక్కింది. 1996 నవంబర్ 10న తమిళంలో విడుదలైన ఈ చిత్రం మూడు దశాబ్దాలు పూర్తి చేసుకుంది. తెలుగులో డబ్బింగ్ రూపంలో విడుదలైన ఈ సినిమా ఇక్కడి ప్రేక్షకులను కూడా విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా బామ్మ వేషంలో కమల్ హాసన్ చేసిన కామెడీ ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోయింది. అయితే తెరపై అంత సరదాగా కనిపించిన ఈ పాత్ర వెనుక కమల్ ఎన్ని కష్టాలు పడ్డారో తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే.

‘భామనే సత్యభామనే’ కథ ఏంటంటే.. భార్య నుంచి విడిపోయిన ఓ వ్యక్తి.. తన కుమార్తెకు దూరంగా ఉండలేక, ఒక వృద్ధ మహిళ వేషంలో ఆమె దగ్గరకు చేరుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఈ కథలోని కామెడీ, ఎమోషన్స్‌ను ప్రేక్షకులకు నచ్చేలా అద్భుతంగా తెరకెక్కించారు దర్శకుడు కె.ఎస్. రవికుమార్.

ఇందులో కమల్ హాసన్ మదన్ అనే వ్యక్తిగా, అదే సమయంలో బామ్మ గెటప్‌లో కనిపిస్తారు. తన కూతురికి దూరమైన తండ్రి పడే బాధ, ఆమె దగ్గర ఉండేందుకు వృద్ధ మహిళగా మారడం, ఆ క్రమంలో ఎదురయ్యే విచిత్రమైన పరిస్థితులు ప్రేక్షకులను నవ్విస్తూనే భావోద్వేగానికి గురిచేస్తాయి.

అయితే ఈ సినిమాలో కమల్ హాసన్‌కు ఈ పాత్ర చేయాలనే ఆలోచన రావడం ఒక ఎత్తయితే.. ఆ పాత్రకు సరిపోయే రూపాన్ని తీసుకురావడం మరో ఎత్తు. మొదట ఆయన మధ్య వయసున్న మహిళ గెటప్‌లో ఫొటోషూట్ కూడా చేశారు. కానీ ఆ లుక్‌తో సంతృప్తి చెందకపోవడంతో మరింత వృద్ధురాలిగా కనిపించేలా గెటప్‌ను మార్చాలని నిర్ణయించుకున్నారు.

ఇది కూడా చదవండి: శ్రీలీలను టాలీవుడ్‌ పక్కన పెట్టింది.. కోలీవుడ్‌ నెత్తిన పెట్టుకుంటోంది.!

ఈ పాత్ర కోసం కమల్ హాసన్ అంతర్జాతీయ స్థాయి మేకప్ నిపుణుడు మైఖేల్ వెస్ట్‌మోర్ సలహాలు తీసుకున్నారు. ‘స్టార్ ట్రెక్’ సిరీస్‌తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ఈ సినిమాలో కమల్ రూపాన్ని తీర్చిదిద్దడంలో కీలకంగా వ్యవహరించారు. కె.ఎం. శరత్ కుమార్ కూడా మేకప్ విషయంలో సహకరించారు.

కమల్ ముఖానికి వృద్ధ మహిళ రూపం తీసుకురావడానికి ప్రోస్థటిక్ మేకప్ ఉపయోగించారు. ముఖం ఆకారం, ముక్కు, బుగ్గలు, కళ్ల చుట్టూ ఉండే మార్పులన్నీ ఎంతో జాగ్రత్తగా రూపొందించారు. ఈ గెటప్ డిజైన్ చేయడానికి మైఖేల్ వెస్ట్‌మోర్ దాదాపు నెల రోజుల సమయం తీసుకున్నట్లు సమాచారం.

మేకప్ వేసుకోవడానికి సుమారు ఐదు గంటల సమయం పట్టేదని అప్పట్లో కథనాలు వచ్చాయి. కానీ ఇక్కడే అసలు సమస్య మొదలయ్యేది. అంత కష్టపడి వేసిన మేకప్ ఎక్కువసేపు నిలబడేది కాదు. చెమట పట్టడం మొదలైతే ముఖానికి అమర్చిన ప్రోస్థటిక్ భాగాల మధ్య గ్యాప్ కనిపించేది. దీంతో కమల్ హాసన్ నటనకు, షూటింగ్‌కు ఇబ్బందులు ఎదురయ్యేవి.

ఇటీవల దర్శకుడు కె.ఎస్. రవికుమార్ కూడా ఈ మేకప్ కష్టాల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. ప్రోస్థటిక్ మేకప్ రెండు నుంచి మూడు గంటలు మాత్రమే బాగా ఉండేది. నాలుగో గంట వచ్చేసరికి ముఖం దగ్గరకు వెళ్లే పరిస్థితి కూడా ఉండేది కాదట.

దీంతో కమల్ కోసం ప్రత్యేకంగా ఒక ఏసీ బాక్స్ లాంటి ఏర్పాటును చేశారు. అందులో జీరో డిగ్రీల ఉష్ణోగ్రత ఉండేలా చూసేవారు. మేకప్ వేసుకున్న తర్వాత కమల్ ఆ చల్లని వాతావరణంలోనే ఉండాల్సి వచ్చేది. ఉదయం 7 గంటలకు షూటింగ్ ప్రారంభమైతే.. మేకప్ పూర్తి చేసుకుని ఆయన సెట్‌లోకి రావడానికి 10 గంటల సమయం అయ్యేది. ఆ తర్వాత కమల్‌కు సంబంధించిన క్లోజప్, మిడ్ షాట్స్, లాంగ్ షాట్స్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేసేవారట. మధ్యాహ్నం 2.30 గంటల వరకు ఆయన సన్నివేశాలను చిత్రీకరించిన తర్వాతే లంచ్ బ్రేక్ ఇచ్చేవారని కె.ఎస్. రవికుమార్ వివరించారు.

ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ మేకప్ కోసం ఉపయోగించిన ప్యాడింగ్, ఫౌండేషన్ కారణంగా కమల్ కళ్ల కింద అలర్జీ కూడా వచ్చింది. అందుకే హిందీ రీమేక్ ‘చాచి 420’ తెరకెక్కించే సమయంలో ఇలాంటి ఇబ్బందులు రాకుండా ముందుగా కమల్ సాధారణ పాత్రకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించేలా జాగ్రత్తలు తీసుకున్నారు.

కేవలం ముఖానికి మేకప్ వేస్తే సరిపోదని కమల్‌కు తెలుసు. ఒక వృద్ధ మహిళలా కనిపించాలంటే ఆమె నడక, నిలబడే విధానం, మాట్లాడే తీరు, హావభావాలు కూడా అలానే ఉండాలి. అందుకే ఈ పాత్ర కోసం ఆయన బాడీ లాంగ్వేజ్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.

సినిమాలో కమల్ హాసన్ ధరించిన చీర కూడా ప్రత్యేకమే. సాధారణ చీర కాకుండా తొమ్మిది గజాల చీరను ఉపయోగించారు. పాత్రకు తగ్గట్టుగా కాస్ట్యూమ్స్ రూపొందించడంలో ఆయన భార్య సారిక కూడా సహకరించారు. మేకప్, కాస్ట్యూమ్స్, హావభావాలు.. ఇలా ప్రతి విషయంలోనూ తీసుకున్న జాగ్రత్తే అవ్వై షణ్ముగి పాత్రను అంత సహజంగా మార్చింది.

ఈ సినిమాలో కమల్ తన గురువు, రంగస్థల నటుడు అవ్వై టి.కె. షణ్ముగం పేరు మీదుగా తన పాత్రకు ‘అవ్వై షణ్ముగి’ అని పేరు పెట్టడం మరో విశేషం. మహిళా పాత్రలు ధరించి రంగస్థలంపై నటించడంలో పేరుగాంచిన ఆ కళాకారుడికి ఈ సినిమాను అంకితం చేశారు.

మూడు దశాబ్దాలు గడిచినా ‘భామనే సత్యభామనే’లో కమల్ హాసన్ చేసిన ఆ బామ్మ పాత్రను ప్రేక్షకులు మర్చిపోలేదు. తెరపై నవ్వులు పూయించిన ఆ పాత్ర వెనుక ఐదు గంటల మేకప్, అలర్జీలు, ప్రత్యేక ఏసీ ఏర్పాట్లు, గంటల తరబడి షూటింగ్ కష్టం ఉన్నాయి. ఒక పాత్ర కోసం నటుడు ఎంతగా శ్రమించవచ్చో చెప్పడానికి ఈ సినిమా మంచి ఉదాహరణ.

మీకు నచ్చవచ్చు:
‘గాడ్ ఆఫ్ వార్’కు బ్రేకులు.. ఎన్టీఆర్-త్రివిక్రమ్ భారీ ప్రాజెక్ట్ ఆగిపోయిందా.?
‘వారణాసి’ స్టోరీ లీక్.. రావణుడి నవరత్నాల హారం చుట్టూ అసలు కథ.!

 

 

 

[30 Years of Bhamane Satyabhamane, 30 Years of Avvai Shanmugi, Bhamane Satyabhamane Movie, Avvai Shanmugi Movie, Kamal Haasan Makeup, Kamal Haasan Lady Getup, Kamal Haasan, KS Ravikumar, Telugu News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com