ఈవీవీ `జంబలకిడిపంబ`కి 30 ఏళ్ళు!
on Jul 2, 2022
వినోదాత్మక చిత్రాలకు పెట్టింది పేరు.. అగ్ర దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ. ఆయన తెరకెక్కించిన హాస్యభరిత సినిమాల్లో `జంబలకిడిపంబ`కి ప్రత్యేక స్థానం ఉంది. నరేశ్ కథానాయకుడిగా నటించిన ఈ బ్లాక్ బస్టర్ మూవీతో ప్రముఖ నటి ఆమని కథానాయికగా తొలి అడుగేయగా.. బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, బాబూ మోహన్, జయలలిత, జయప్రకాశ్ రెడ్డి, మల్లికార్జున రావు, మహర్షి రాఘవ, ఐరెన్ లెగ్ శాస్త్రి, అలీ, డబ్బింగ్ జానకి, శ్రీ లక్ష్మి, కల్పనా రాయ్, శిల్ప, మాస్టర్ ఆదిత్య ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. ఈవీవీ రచన చేసిన ఈ చిత్రానికి దివాకర్ బాబు సంభాషణలు సమకూర్చారు. వైజాగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమా.. భారీ తారాగణంతో కేవలం నెల రోజుల్లో చిత్రీకరణ పూర్తిచేసుకోవడం విశేషం.
రాజ్ - కోటి సంగీతమందించిన `జంబలకిడిపంబ`కి భువనచంద్ర సాహిత్యమందించారు. ``కనరా వినరా``, ``మదనా తగునా``, ``నేనే సూపర్ మేన్``, ``యమ్మా యమ్మా``, ``నిలువరా వాలు కనుల వాడా`` (పేరడీ పాటల కదంబం) అంటూ సాగే ఇందులోని పాటలు ఆకట్టుకున్నాయి. డీవీవీ దానయ్య, జె. భగవాన్, సరస్వతి కుమార్ నిర్మించిన `జంబలకిడిపంబ`.. కన్నడంలో `నారి మునిడరే గండు పరారి`(2004) పేరుతో రీమేక్ అయింది. 1992 జూలై 3న విడుదలై ఘనవిజయం సాధించిన `జంబలకిడిపంబ`.. ఆదివారంతో 30 వసంతాలు పూర్తిచేసుకుంటోంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
